
కళామతల్లి ముద్దుబిడ్డను ఆశీర్వదించండి
విజయనగరం టౌన్: కళలకు కాణాచిగా పేరొందిన విద్యలనగరం విజయనగరం అమ్ములపొది నుంచి జాలువారిన కళామతల్లి ముద్దుబిడ్డ దియారాజ్‌ను ప్రతి ఒక్కరూ ఆశీర్వదించాలని ఫ్రైడే చిత్ర నిర్మాత కేసనకుర్తి శ్రీనివాస్ కోరారు. శ్రీ గణేష్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై నిర్మాణమవుతున్న ఫ్రైడే చిత్రం యూనిట్ మంగళవారం ఆర్‌టీసీ కాంప్లెక్స్ వద్దనున్న జీఎస్‌ఆర్ గ్రాండ్‌లో సందడి చేసింది. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన సమావేశంలో జిల్లాకు చెందిన హీరోయిన్ దియారాజ్‌తో పాటు హీరో, ఇనయ సుల్తానా, రిహానా, వికాస్ వశిష్ట, రోహిత్ బొడ్డపాటిలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అన్నివర్గాల అభిమానుల మనసు దోచుకునేలా ఫ్రైడే చిత్రం రూపకల్పన ఈశ్వర్‌బాబు ధూళిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతోందన్నారు. హీరోయిన్ దియారాజ్ మాట్లాడుతూ జిల్లావాసులందరూ చిత్రాన్ని ఆదరించాలని కోరారు. ప్రస్తుతం షూటింగ్ పూర్తిచేసుకున్న ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోందన్నారు. అనంతరం గురానా చారిటబుల్ ట్రస్ట్ అధినేత, జనసేన సీనియర్ నాయకుడు గురాన అయ్యలు దియారాజ్‌ను సత్కరించి, అభినందించారు. కార్యక్రమంలో ఆదాడ మోహన్ తదితరులు పాల్గొన్నారు.