పైడితల్లిని దర్శించుకున్న గానకోకిల
విజయనగరం టౌన్: ఉత్తరాంధ్రుల ఆరాధ్య దైవం పైడితల్లి అమ్మవారిని గానకోకిల, పద్మశ్రీ పి.సుశీల సోమవారం రాత్రి దర్శించుకున్నారు. ఆలయ సంప్రదాయం ప్రకారం వేదపండితులు పూర్ణకుంభంతో ఆమెకు స్వాగతం పలికారు. అమ్మవారికి ప్రత్యేక కుంకుమార్చనలు నిర్వహించిన అనంతరం ఆలయ ఇన్‌చార్జి ఈఓ కేఎన్‌వీడీవీ.ప్రసాద్ ఆధ్వర్యంలో వేదపండితులు ఆమెకు వేదాశీస్సులు, అమ్మవారి శేషవస్త్రాలను, ప్రసాదాలను అందజేశారు. విజయనగరంలోని గురునారాయణ కళాపీఠం వార్షికోత్సవ వేడుకలకు ఆమె హాజరయ్యారు. మంత్రి శ్రీనివాస్, నిర్వాహకుల చేతుల మీదుగా పురస్కారం అందుకున్నారు.
రామతీర్థంలో వసంతోత్సవాలు
నెల్లిమర్ల రూరల్: సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం రామతీర్థం సీతారామస్వామి దేవస్థానంలో ఈ నెల 6న శ్రీరామనవమిని పురస్కరించుకొని కల్యా ణ వసంతోత్సవాలు అత్యంత వైభవంగా కొనసాగుతున్నాయి. సోమవారం వేకువజామున స్వామికి ప్రాతఃకాలార్చన, బాలభోగం నిర్వహించిన తరువాత మంగళాశాసనం, తీర్థ గోష్ఠి జరిపించారు. అనంతరం స్వామి సన్నిధిలో వివిధ ప్రాంతాల నుంచి విచ్చేసిన 40 మంది వేద పండితులు శ్రీమద్రామాయణ, సుందరాకాండ పారాయణాలు, దివ్య ప్రబంధ సేవాకాలం, లక్ష తులసీ దళార్చన, లక్ష కుంకుమార్చన నిర్వహించారు. యాగశాలలో గాయత్రీ రామాయణం, సంక్షేప రామాయణం, సుందరాకాండ హవనం జరిపించారు. కార్యక్రమంలో అర్చకులు, దేవస్థాన సిబ్బంది పాల్గొన్నారు.
సైకిల్‌పై భద్రాచలానికి..
నెల్లిమర్ల రూరల్: రాముడిపై తనకు ఉన్న అమితమైన విశ్వాసంతో ఓ భక్తుడు మండుటెండను సైతం లెక్క చేయకుండా భద్రాచలానికి సైకిల్‌పై పయనమయ్యాడు. తాను రాసిన రామ కోటిని భద్రాచలంలో స్వామికి సమర్పించేందుకు సెగలుకక్కుతున్న ఎండను సైతం లెక్క చేయలేదు. వయసు మీద పడినప్పటికీ అపారమైన భక్తి భావంతో రామనామాన్ని జపిస్తూ శ్రీకాకుళం జిల్లా సోంపేట మండలం కొత్తరకొండ గ్రామానికి చెందిన లంక ప్రకాశరావు సోమవారం రామతీర్థానికి చేరుకున్నాడు. గడిచిన 20 ఏళ్ల నుంచి సైకిల్‌పై భద్రాచలం రామయ్య సన్నిధికి వెళ్తున్నట్టు తెలిపారు. రెండు రోజుల కిందట పయనమై మార్గంమధ్యలో ఉన్న అరసవిల్లి సూర్యనారాయణస్వామిని దర్శించి.. సుమారు 200 కిలో మీటర్లు ప్రయాణం సాగించి రామతీర్థం చేరుకున్నట్టు చెప్పారు. రాత్రికి రామతీర్థంలో బస చేసి మంగళవారం ఉదయం బయలుదేరుతానని తెలిపారు. సింహాచలం, అన్నవరం, ద్వారపూడి మీదుగా సుమారు 429 కిలోమీటర్లు దూరంలో ఉన్న భద్రాచలానికి చేరుకుంటానన్నారు.
పైడితల్లిని దర్శించుకున్న గానకోకిల
పైడితల్లిని దర్శించుకున్న గానకోకిల


