‘మనమిత్ర’ సేవలు సద్వినియోగం చేసుకోండి
● ఎస్పీ ఏ.ఆర్.దామోదర్
విజయనగరం క్రైమ్: పోలీస్ విభాగం అంది స్తున్న ‘మనమిత్ర’ వాట్సాప్ గవర్నెన్స్ సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఎస్పీ ఏ.ఆర్.దామోదర్ పిలుపునిచ్చారు. ఎస్పీ కార్యాలయంలో శనివారం ఏర్పాటుచేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. సాధారణ ప్రజలు చిన్నచిన్న పనుల కోసం పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా ఎఫ్‌ఐఆర్ కాపీలు, ఈ–చలాన్ వివరాలు తెలుసుకోవచ్చన్నారు. ముందుగా ప్రజలు తమ ఫోన్ల లో 95523 00009 నంబర్‌ను సేవ్‌చేసి ‘హాయ్’ మెసేజ్‌ను వాట్సాప్‌లో పంపించాలన్నారు. పోలీస్‌శాఖ అందించే వివిధ సేవల జాబితా మొబైల్ స్క్రీన్‌పై కనిపిస్తుందని తెలిపారు. జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్లు, పోలీస్ కార్యాలయాల్లో అందుబాటులో ఉంచిన
క్యూఆర్‌కోడ్‌ను స్కాన్ చేసి తక్షణమే సేవలు పొందవచ్చని తెలిపారు. ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు.
జాతీయ కబడ్డీ పోటీలకు రిఫరీలుగా జిల్లా పీఈటీలు
విజయనగరం: జాతీయ స్థాయిలో జరగనున్న అండర్–14 స్కూల్ గేమ్స్ బాల, బాలికల కబడ్డీ పోటీల నిర్వహణకు రిఫరీలుగా జిల్లాకు చెందిన నలుగురు వ్యాయామ ఉపాధ్యాయు లు నియామకమయ్యారు. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ నుంచి ఉత్త ర్వులు జారీ అయ్యాయి. ఈ నెల 19 నుంచి 23వ తేదీ వరకు గుడివాడలో జరగబోయే జాతీయ స్థాయి కబడ్డీ పోటీలను పర్యవేక్షించటంలో జిల్లాలోని నడుపూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విధులు నిర్వహిస్తున్న పి.అన్నపూర్ణ, శ్రీరామ్‌నగర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విధులు నిర్వహిస్తున్న మొయిద ఉదయ్, తెర్లాంలో విధులు నిర్వహిస్తున్న పి.రమ, ఎస్.కోట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విధులు నిర్వహిస్తున్న వై.పావనీ నియామకమైనట్టు జిల్లా విద్యాశాఖ అధికారి యు.మాణిక్యాల నాయుడు తెలిపారు.
మంచు దుప్పటి
వారంరోజులుగా మంచు వర్షంలా కురుస్తోంది. ఉదయం 8 గంటలైనా సూర్యోదయం కనిపించడం లేదు. రాకపోకలకు వాహనచోదకులు ఇబ్బందులు పడుతున్నారు. తెర్లాం–బొబ్బిలి రోడ్డును మంచు కప్పేయడంతో లైట్ల వెలుగులో ముందుకు సాగుతున్న లారీని చిత్రంలో చూడొచ్చు. – తెర్లాం


