ఎందుకంత చులకన?
దళితులంటే..
విజయనగరం: చంద్రబాబు ప్రభుత్వం ఎస్సీలను మనుషుల్లా చూడడం లేదని, 18 నెలల పాలనలో ఎస్సీలపైన, వైఎస్సార్‌సీపీ కార్యకర్తలపై దాడులు చేస్తూ హత్యా రాజకీయాలతో చలి కాచుకుంటోందని జిల్లా పరిషత్ చైర్మన్, వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు మజ్జి శ్రీనివాసరావు మండిపడ్డారు. దళితులను చులకనగా చూస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు పాలించే హక్కులేదన్నారు. పల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గం పిన్నెల్లి గ్రామానికి చెందిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎస్సీ కార్యకర్త మందా సాల్మన్‌పై టీడీపీ గుండాలు దాడి చేసి, తీవ్రంగా కొట్టి చంపడాన్ని ఖండించారు. అరాచకాలకు నిరసనగా విజయనగరం జిల్లా కేంద్రంలో కలెక్టరేట్ కూడలి వద్ద ఉన్న రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద శనివారం నిరసన తెలిపారు. వైఎస్సార్‌సీపీ జిల్లా ఎస్సీసెల్ అధ్యక్షుడు పీరుబండి జైహింద్‌కుమార్ ఆధ్వర్యంలో అంబేడ్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. వైఎస్సార్‌సీపీ నాయకులు, దళితులపై ప్రభు త్వం చేస్తున్న దాడులు, హత్యలను ఖండిస్తూ నినదించారు. రాష్ట్రంలో అంబేడ్కర్ రాసిన ప్రజాస్వా మ్య రాజ్యాంగాన్ని కాకుండా మంత్రి నారాలోకేశ్ రాసుకున్న రెడ్‌బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తూ దళితులను, వైఎస్సార్‌సీపీ శ్రేణులపై హత్యా రాజకీయాలకు పాల్పడుతున్నారని దుయ్యబట్టారు. దీనికి సాల్మన్ హత్య ఘటనే నిదర్శనమన్నారు. పిన్నెల్లి గ్రామంలోని వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు, దళిత సానుభూతిపరులను భయబ్రాంతులకు గురి చేయడంతో దాదాపు మూడు వందల కుటుంబాలు ఆ గ్రామాన్ని వీడి భయంతో వేరే ప్రాంతాల్లో తలదాచుకునే దుస్థితి కలిగిందన్నారు. భార్యకు అనారోగ్యమని ఊరికి వచ్చిన సాల్మన్‌పై టీడీపీ గుండాలు రాళ్లు, ఇనుప రాడ్లతో దాడులు చేయగా, ఆయనకు మెరుగైన వైద్య సేవలందించేందుకు వైఎస్సార్‌సీపీ నేతలు చేసిన ప్రయత్నాలు ఫలించలేదన్నారు. ఘటన జరిగి రోజులు గడుస్తు న్నా దళిత మహిళ హోం మంత్రిగా ఉన్న చంద్రబాబు ప్రభుత్వంలో దోషులపై చర్యలు తీసుకోకపోవడం విచారకరమన్నారు. వైఎస్సార్‌సీపీ కార్యకర్తలను భూమి మీద లేకుండా చేస్తే, పార్టీ లేకుండా పోతోందన్న కుట్రతో రెండేళ్లుగా హత్యాకాండలకు దిగుతోందని ధ్వజమెత్తారు.
చంద్రబాబుకు ఎస్సీలంటే చులకన భావం..
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి దళితులంటే చులకన భావన ఉందన్నారు. గతంలో దళితుల ఇంట ఎవరైనా పుట్టాలని కోరుకుంటారా అంటూ చంద్రబాబు అవహేళన చేశారని మజ్జి శ్రీనివాస్‌రావు గుర్తు చేశారు. రాబోయే రోజుల్లో చంద్రబాబు ప్రభుత్వానికి ఈ రాష్ట్రంలోని దళిత ప్రజానీకం, బడుగు బలహీన వర్గాల వారు ప్రజాకోర్టులో మరణశాసనం రాస్తారని ఉద్ఘాటించారు. కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ జిల్లా ప్రధాన కార్యదర్శులు వర్రి నర్సింహమూర్తి, గొర్లె రవికుమార్, జిల్లా మహిళా విభాగం అధ్యక్షురాలు గదుల సత్యలత, జిల్లా బీసీసెల్ అధ్యక్షుడు మహంతి జనార్దన్, జిల్లా ఉపాధ్యక్షుడు పాండ్రండి సంజీవి, ఎస్సీసెల్ రాష్ట్ర అధికార ప్రతినిధి రేగాన శ్రీనివాసరావు, విజయనగరం నియోజకవర్గ ఎస్సీసెల్ అధ్యక్షుడు బొంగ భానుమూర్తి, కార్పొరేటర్ పైడిరాజు పాల్గొన్నారు.
రాష్ట్రంలో అంబేడ్కర్ రాసిన
రాజ్యాంగానికి తిలోదకాలు
రెడ్‌బుక్ రాజ్యాంగం పేరిట దాడులు
పిన్నెల్లిలో వైఎస్సార్‌సీపీ కార్యకర్త
మందా సాల్మన్‌ది ప్రభుత్వ హత్యే..
జెడ్పీ చైర్మన్, వైఎస్సార్ సీపీ జిల్లా
అధ్యక్షుడు మజ్జి శ్రీనివాసరావు
కలెక్టరేట్ కూడలిలో అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన


