చిన్న ఉద్యోగాలకు...
పెద్ద చదువులతో..
విజయనగరం అర్బన్:
‘పీజీ చదివాను. ఉద్యోగం లేదు. కుక్, అటెండర్ పోస్టులకు దరఖాస్తు చేయడం సిగ్గుగా అనిపిస్తున్నా... బతకడానికి ఏదో ఒక జీవనాధారం కావాలి కదా అని దరఖాస్తు చేశాను. పాలకులు యువతను మోసం చేశారు’
– గజపతినగరానికి చెందిన ఓ యువతి
ఆవేదన ఇది..
‘ఎన్నికల ముందు ఉద్యోగాలు ఇస్తామని చెప్పిన నేతలు అధికారంలోకి వచ్చాక కనీసం ఉపాధి అవ కాశాలు కల్పించలేదు. కేజీబీవీల్లో రాజకీయ ప్రభావితంగా భర్తీ చేస్తున్న పోస్టులు సైతం వస్తాయన్న నమ్మకం లేదు. మా భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది. అయినా ఆశతో దరఖాస్తు చేస్తున్నాను.’
– నెల్లిమర్ల మండలానికి చెందిన
మరో యువతి ఆవేదన ఇది..
అధికారంలోకి వచ్చిన వెంటనే జాబ్ క్యాలెండర్ వేస్తాం.. లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తాం.. రాష్ట్రంలో నిరుద్యోగ సమస్యే ఉండదు.. ఉద్యోగాలు కల్పించకపోతే నిరుద్యోగ భృతి కింద ప్రతీ నిరుద్యోగికి నెలకు రూ.3వేలు చెల్లిస్తామంటూ టీడీపీ నేతలు ఊకదంపుడు ప్రసంగాలిచ్చారు. అదిగో పరిశ్రమలు వస్తున్నాయంటూ గాలిలో మేడలు కట్టారు. ఎంఓయూలంటూ హడావుడి చేస్తూ నిరుద్యోగులను నిలువునా ముంచేస్తున్నారు. ఆవేదనకు గురిచేస్తున్నారు. పరిమిత ఉద్యోగులు.. పెరుగుతున్న నిరు ద్యోగం దృష్ట్యా కేజీబీవీలలో కుక్, వాచ్‌ఉమెన్, అటెండర్, స్కావెంజర్ వంటి తాత్కాలిక ప్రాతిపదికన భర్తీచేసే చిరుద్యోగాలకు ఉన్నత విద్యావంతులు దరఖాస్తు చేస్తున్నారు. ఇది చంద్రబాబు పాలనతీరును ఎత్తిచూపుతోంది. పరిశ్రమలు తీసుకురావడంలో, శాశ్వత ఉద్యోగాలు సృష్టించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్న అభిప్రా యం బలపడుతోంది. జిల్లా యువతలో అసహనం రోజురోజుకు పెరుగుతోంది. ఇప్పటికై నా పాలకులు స్పందించకపోతే నిరుద్యోగ యువత ఆగ్రహం రోడ్డెక్కే ప్రమాదం ఉందని రాజకీయ పరిశీలకులు హెచ్చరిస్తున్నారు. ప్రభుత్వం చెబుతున్న అభివృద్ధి మాటలకు, వాస్తవ పరిస్థితులకు మధ్య ఉన్న భారీ అంతరాన్ని కేజీబీవీ నాన్‌టీచింగ్ నియామకాల భర్తీ ప్రక్రియ బహిర్గతం చేశాయి. జిల్లాలో కేవలం 73 ఉద్యోగాలకు ఇప్పటివరకు 1,807 మంది యువత దర ఖాస్తు చేసుకోవడం, పాలకుల వైఫల్య పాలనకు అద్దం పట్టినట్లుగా మారింది. ఈ నెల 20వ తేదీ వరకు గడువు ఉండడంతో ఈ సంఖ్య ఇంకా పెరుగుతోందని తెలుస్తుంది.
టైప్–4 పోస్టులకూ..
టైప్–4 కేజీబీవీల్లోని పోస్టుల్లో కూడా ఇదే పరిస్థితి కనిపిస్తోంది. నాలుగు వార్డెన్ పోస్టులకు 91 మంది, ఐదు చౌకీదార్ పోస్టులకు 73 మంది, 11 కుక్ పోస్టులకు 124 మంది, 7 పార్ట్ టైమ్ టీచర్ పోస్టులకు 67 మంది దరఖాస్తు చేశారు. తాత్కాలికమైన, తక్కువ వేతనంతో కూడిన ఉద్యోగాలకై నా యువత పోటెత్తడం, జిల్లాలో శాశ్వత ఉపాఽ ది అవకాశాలు ఎంతగా క్షీణించాయో స్ప ష్టం చేస్తోంది. దరఖాస్తుల స్వీకరణ సమయంలో కార్యాలయాల చుట్టూ యువత గంటల కొద్దీ క్యూలలో నిలబడిన పరిస్థితి నిరుద్యోగ సమస్యకు అద్దం పడుతోంది.
ఇదీ పరిస్థితి...
సమగ్ర శిక్ష, విజయనగరం ఆధ్వర్యంలో చేపట్టిన కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాల (కేజీబీవీ)ల్లో తాత్కాలిక ప్రాతిపదికన భర్తీ చేస్తుస్తున్న టైప్–3లోని 46 పోస్టులకు ఇప్పటివరకు 1,420 దరఖాస్తులు, టైప్–4 లోని 27 పోస్టులకు 351 దరఖాస్తులు వచ్చాయి.
టైప్–3 కేటగిరీలో కంప్యూటర్ ఇన్‌స్ట్రక్టర్ పోస్టులకు భారీ సంఖ్యలో దరఖాస్తులు వస్తున్నాయి. కేవలం 12 పోస్టులు ఉండగా శనివారం నాటికి 504 దరఖాస్తులు వచ్చాయంటే చదువుకున్న యువత నిరుద్యోగ సమస్య ఎంత దారుణంగా ఉందో తెలుస్తోంది.
ఎలాంటి విద్యార్హత అవసరంలేని అటెండర్, కుక్, నైట్ వాచ్ ఉమెన్, స్కావెంజర్ పోస్టులకు కూడా డిగ్రీలు, పీజీలు, టెక్నికల్ అర్హతలు ఉన్నవారు దరఖాస్తు చేస్తుండడం చూస్తుండం గమనార్హం. కేవలం 4 అటెండర్ పోస్టులకు 366 మంది, 5 కుక్ పోస్టులకు 138 మంది, ఒక నైట్ వాచ్‌ఉమెన్ పోస్టుకు 29 మంది, ఏడు స్కావెంజర్ పోస్టులకు 158 మంది ఇప్పటివరకు దరఖాస్తు చేసుకున్నారు. చంద్రబాబు ప్రభుత్వ పాలనాపరమైన వైఫల్యానికి ఇది ప్రత్యక్ష నిదర్శనంగా మారింది.
పెరుగుతున్న నిరుద్యోగమే కారణం
కేజీబీవీల్లో తాత్కాలిక పోస్టులకు దరఖాస్తుల వెల్లువ
73 పోస్టులకు ఇప్పటివరకు
1,807 దరఖాస్తులు
20వ తేదీ వరకు దరఖాస్తుల స్వీకరణ గడువు
పాలకుల 20 లక్షల ఉద్యోగాల హామీకి గండి


