అర్ధరాత్రితో
72 గంటలైనా ఆచూకీ లేని ఆరుగురు మత్స్యకారులు
మంగళవారం అర్ధరాత్రితో ముగిసిన గాలింపు చర్యలు
బోటు ప్రమాదంపై త్రిసభ్య కమిటీ, విచారణకు కలెక్టర్ ఆదేశం
మహారాణిపేట: సముద్రంలో గల్లంతైన ఆరుగురు మత్స్యకారుల కోసం మూడు రోజులుగా సముద్రంలో జల్లెడ పడుతున్నా ఫలితం లేకుండాపోయింది. భారత తీర రక్షక దళం, భారత నౌకాదళం యుద్ధ ప్రాతిపదికన గాలింపు కొనసాగిస్తున్నా ఇప్పటివరకు ఒక్కరి ఆచూకీ కూడా లభించలేదు. దీంతో మంగళవారం అర్ధరాత్రి వరకు చివరిసారిగా విస్తృతంగా సెర్చ్ ఆపరేషన్ నిర్వహించి అనంతరం గాలింపు ముగించాలని అధికారులు నిర్ణయించారు. ఇదే సమయంలో బోటు ప్రమాదానికి గల కారణాలపై విచారణకు కలెక్టర్ ఎం.అభిషిక్త్ కిశోర్ త్రిసభ్య కమిటీని నియమించారు.
యుద్ధ ప్రాతిపదికన గాలింపు చర్యలు
గల్లంతైన మత్స్యకారుల కోసం భారత తీర రక్షక దళం, భారత నౌకాదళం సంయుక్తంగా భారీ గాలింపు చేపట్టాయి. కోస్ట్‌గార్డ్‌కు చెందిన ఐసీజీఎస్ కనక్‌లతా బరువా, ఐసీజీఎస్ వీర నౌకలు, మూడు హెలికాప్టర్లు సముద్రాన్ని జల్లెడ పడుతున్నాయి. విశాఖ రీజినల్ ఆపరేషన్స్ సెంటర్ (ఆర్‌వోసీ) నుంచి మొత్తం ఆపరేషన్‌ను పర్యవేక్షిస్తున్నారు. భారత నౌకాదళం ఈస్ట్రన్ నేవల్ కమాండ్ కూడా రెండు యుద్ధ నౌకలు, ఒక సీ కింగ్ హెలికాప్టర్, ఒక అడ్వాన్స్‌డ్ లైట్ హెలికాప్టర్ (ఏఎల్‌హెచ్)తో గాలింపులో పాల్గొంది. ముందుగా సాయంత్రం 5 గంటలతో ఆపరేషన్ ముగించాలని నిర్ణయించినప్పటికీ, జిల్లా అధికారుల విజ్ఞప్తితో అర్ధరాత్రి 12 గంటల వరకు కొనసాగించాలని నిర్ణయించారు. అయినప్పటికీ గల్లంతైన వారి జాడ మాత్రం దొరకలేదు.
అసలేం జరిగింది ?
విశాఖ ఫిషింగ్ హార్బర్ నుంచి ఈ నెల 1న ఐఎన్‌డీ–ఏపీ–ఎంఎం–వి5–83 బోటులో ఏడుగురు మత్స్యకారులు వేటకు వెళ్లారు. సముద్రంలో వాతావరణం ఒక్కసారిగా మారడంతో భారీ గాలులు, అలల ధాటికి బోటు ఇంజిన్‌లో సాంకేతిక లోపం ఏర్పడింది. బోటును నియంత్రించేందుకు కట్టిన తాడు కూడా తెగిపోవడంతో అది సముద్రంలో కొట్టుకుపోయినట్లు అధికారులు భావిస్తున్నారు. ఈ ప్రమాదంలో కారి చిన్న మాత్రమే ప్రాణాలతో ఒడ్డుకు చేరుకోగా.. అమరా అప్పలరాజు, రాగి బండయ్య (భీమిలి–పెదనాగమయ్యపాలెం), కారి చిన్నయ్య, కారి గరగయ్య, కారి సీతోడు, మేతా చిన్న అమ్మోరు గల్లంతయ్యారు. బోటు ప్రమాదం జరిగి మూడు రోజులు దాటిపోయినా గల్లంతైన ఆరుగురు మత్స్యకారుల ఆచూకీ లభించలేదు. సముద్రంలో విస్తృతంగా గాలించినా ఎలాంటి ఆధారాలు దొరకకపోవడంతో కుటుంబ సభ్యుల ఆందోళన మరింత పెరిగింది.
తీర ప్రాంతాల్లో గస్తీ ముమ్మరం
గల్లంతైన మత్స్యకారుల కోసం కోస్ట్ గార్డ్, నేవీ సమన్వయంతో విస్తృత స్థాయిలో అన్వేషణ సాగుతోందని జిల్లా కలెక్టర్ ఎం.అభిషిక్త్ కిశోర్ తెలిపారు. నౌకలు, హెలికాప్టర్ల ద్వారా సముద్రంలో నిరంతర నిఘా ఉంచామన్నారు. స్థానిక ఆర్డీవో, ఇతర అధికారులతో పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నామని.. సముద్రంలోనే కాకుండా తీర ప్రాంత గస్తీ దళాలను కూడా అప్రమత్తం చేసి తనిఖీలు చేపట్టాల్సిందిగా ఆదేశించామని కలెక్టర్ వెల్లడించారు.
కారి గరగయ్య
కారి సీతోడు
మేతా చిన్న అమ్మోరు
అమరా అప్పలరాజు
రాగి బండయ్య
కారి చిన్నయ్య
గల్లంతైన మత్స్యకారులు
ప్రమాదంపై త్రిసభ్య కమిటీ
బోటు ప్రమాదానికి దారితీసిన పరిస్థితులు, భద్రతా ప్రమాణాల అమలుపై విచారణకు జిల్లా యంత్రాంగం ముగ్గురు సభ్యులతో కమిటీని ఏర్పాటు చేసింది. విశాఖ ఆర్‌డీవో దిలీప్ చక్రవర్తి, హార్బర్ ఏసీపీ చిట్టిబాబు, మత్స్యశాఖ అసిస్టెంట్ డైరెక్టర్ సురేష్ సభ్యులుగా ఉన్న ఈ కమిటీ సమగ్ర విచారణ చేసి ప్రభుత్వానికి నివేదిక అందజేయనుంది. ఆ నివేదిక ఆధారంగా తదుపరి చర్యలు చేపట్టనున్నారు.


