సముద్రం వెనక్కి.. తీరంలో గుబులు | - | Sakshi
Sakshi News home page

సముద్రం వెనక్కి.. తీరంలో గుబులు

Jul 8 2026 12:50 AM | Updated on Jul 8 2026 12:50 AM

పర్యాటకులకు కొత్త అందాలు.. శాస్త్రవేత్తలకు ఆందోళన సునామీ సంకేతమా? ఖగోళ ఆటుపోట్ల ప్రభావమా? అల్పపీడన ప్రభావమా? ఈ మూడు కారణాలపై సముద్ర నిపుణుల విశ్లేషణ

విశాఖ విద్య: అలల ఘోషతో ఎప్పుడూ ఉప్పొంగే విశాఖ సాగరం ఒక్కసారిగా నిశ్శబ్దంగా వెనక్కు తగ్గింది. కొన్ని మీటర్ల మేర సముద్రం వెనక్కు వెళ్లడంతో ఇప్పటివరకు అలల కింద దాగి ఉన్న రాళ్లు, ఇసుక మేటలు, సముద్ర గర్భంలోని సహజ నిర్మాణాలు ఒక్కసారిగా వెలుగులోకి వచ్చాయి. ఈ అరుదైన దృశ్యాన్ని చూసేందుకు పర్యాటకులు, స్థానికులు పెద్దఎత్తున బీచ్‌కు చేరుకుని సెల్ఫీలు, వీడియోలతో సందడి చేస్తున్నారు. అయితే ఈ అందాల వెనుక ఆందోళన కూడా ఉందని సముద్ర శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. సముద్రం అకస్మాత్తుగా ఈ స్థాయిలో వెనక్కు వెళ్లడం సాధారణ ఘటన కాదని, దాని వెనుక ఖగోళ, వాతావరణ, భూగర్భ కారణాలు ఉండొచ్చని విశ్లేషిస్తున్నారు.

మూడు కారణాలు ప్రధానంగా..

సముద్ర అధ్యయన నిపుణుల విశ్లేషణ ప్రకారం సముద్రపు నీరు ఇలా ఒక్కసారిగా వెనక్కు తగ్గడానికి ప్రధానంగా మూడు శాసీ్త్రయ కారణాలు ఉండొచ్చు.

1, ఖగోళ ఆటుపోట్లు : చంద్రుడు, సూర్యుడి గురుత్వాకర్షణ శక్తి, భూభ్రమణం వల్ల ప్రతి ఆరు గంటలకు ఒకసారి సముద్రంలో ఆటుపోట్లు సహజంగా ఏర్పడతాయి. ముఖ్యంగా అమావాస్య, పౌర్ణమి రోజుల్లో ఈ తీవ్రత ఎక్కువగా ఉండటం వల్ల సముద్రం సాధారణం కంటే మరింత వెనక్కు వెళ్లినట్లు కనిపిస్తుంది.

2. అల్పపీడనం, తీరగాలుల ప్రభావం: బంగాళాఖాతంలో ఏర్పడే తీవ్ర అల్పపీడనాలు, తుపాన్ల సమయంలో వాతావరణ పీడనం అకస్మాత్తుగా మారుతుంది. బలమైన తీర గాలులు సముద్ర ఉపరితల నీటిని ఒక వైపునకు నెట్టివేసినప్పుడు ఏర్పడే తాత్కాలిక ‘శూన్యత’ వల్ల నీరు వెనక్కు తగ్గుతుంది.

3, సముద్ర గర్భ కదలికలు, సునామీ ప్రభావం: సముద్ర గర్భంలో భూకంపాలు లేదా టెక్టోనిక్‌ ప్లేట్ల కదలికల కారణంగా ఏర్పడే సునామీలకు ముందు కొన్ని ప్రాంతాల్లో సముద్రం ఒక్కసారిగా వెనక్కు వెళ్లడం ప్రపంచంలోని అనేక ఘటనల్లో నమోదైంది. ఇటీవల ఫిలిప్పీన్స్‌ సమీపంలో సంభవించిన తీవ్ర భూకంపం ప్రభావాన్ని కూడా శాస్త్రవేత్తలు పరిశీలిస్తున్నారు. అయితే దీనిని బట్టి వెంటనే సునామీ వస్తుందని భావించరాదని, ఇది కేవలం పరిశీలించాల్సిన కారణాల్లో ఒకటేనని నిపుణులు స్పష్టం చేస్తున్నారు.

2004 సునామీ గుర్తుందా?

2004 డిసెంబర్‌లో భారత మహాసముద్రంలో సంభవించిన వినాశకర సునామీకి ముందు కూడా అనేక తీర ప్రాంతాల్లో సముద్రం వందల మీటర్ల మేర వెనక్కు వెళ్లింది. ఆ దృశ్యాన్ని దగ్గరగా చూసేందుకు సముద్ర గర్భంలోకి వెళ్లిన పలువురు తిరిగి వచ్చిన భారీ అలల్లో చిక్కుకుని ప్రాణాలు కోల్పోయారు. అందుకే సముద్రం అసాధారణంగా వెనక్కు తగ్గితే దాన్ని ఎప్పుడూ హెచ్చరిక సంకేతంగా పరిగణించాలని విపత్తు నిర్వహణ నిపుణులు సూచిస్తున్నారు.

ఇది హెచ్చరికగా పరిగణించాలి

విశాఖ తీరంలో సముద్రం వెనక్కు వెళ్లడం సాధారణ ఘటనగా తీసుకోరాదు. బంగాళాఖాతానికి సమీప ప్రాంతాల్లో సంభవించే సముద్రగర్భ భూకంపాలు, సునామీల ప్రభావం మన తీరంపై కూడా కనిపించే అవకాశం ఉంది. ఇటీవల ఫిలిప్పీన్స్‌ సమీప సముద్ర ప్రాంతంలో నమోదైన తీవ్ర భూకంపం, దాని ప్రభావంతో ఏర్పడిన అలల వ్యవస్థను కూడా పరిశీలించాల్సిన అవసరం ఉంది. సముద్ర గర్భంలోని టెక్టోనిక్‌ కదలికల వల్ల ఏర్పడే ఒత్తిడి కారణంగా నీరు కొంతసేపు వెనక్కు తగ్గే అవకాశం ఉంటుంది. అయితే దీనర్థం వెంటనే సునామీ వస్తుందనేది కాదని, కానీ ఇలాంటి పరిణామాలను హెచ్చరిక సంకేతంగా భావించాలి.

– డా. కేఎస్‌ ఆర్‌ మూర్తి, మాజీ శాస్త్రవేత్త,

జాతీయ సముద్ర అధ్యయన సంస్ధ

ప్రజలకు సూచనలు

సముద్రం వెనక్కు వెళ్లిందని ఆసక్తితో సముద్ర గర్భంలోకి వెళ్లవద్దు.

బయటపడిన రాళ్లపై నాచు ఉండటం వల్ల అవి అత్యంత జారుడుగా ఉంటాయి.

వెనక్కు వెళ్లిన నీరు కొన్నిసార్లు వేగంగా తిరిగి ముందుకు వచ్చే అవకాశం ఉంటుంది.

బీచ్‌ వద్ద పోలీసులు, విపత్తు నిర్వహణ సిబ్బంది సూచనలను తప్పనిసరిగా పాటించాలి.

వాతావరణ శాఖ, సముద్ర పరిశీలనా సంస్థలు, అధికార యంత్రాంగం జారీ చేసే హెచ్చరికలను నిరంతరం గమనించాలి.

ప్రకృతి ఇచ్చే ప్రతి సంకేతం ప్రమాదమే కాకపోవచ్చు... కానీ ప్రతి అసాధారణ సంకేతాన్ని గౌరవించడం మాత్రం ప్రాణాలను కాపాడుతుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement