గల్లంతైన వారి ఆచూకీ కోసం యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టాలి విశాఖలో భూ ఆక్రమణలపై సీబీఐ విచారణ జరపాలి వైఎస్సార్‌సీపీ విశాఖ జిల్లా అధ్యక్షుడు కేకే రాజు డిమాండ్
సాక్షి, విశాఖపట్నం: మత్స్యకారుల భద్రత విషయంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని వైఎస్సార్‌సీపీ విశాఖ జిల్లా అధ్యక్షుడు కేకే రాజు విమర్శించారు. సముద్రంలో గల్లంతైన మత్స్యకారుల ఆచూకీ కోసం యుద్ధప్రాతిపదికన గాలింపు చర్యలు చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు. మంగళవారం మద్దిలపాలెంలోని వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో పార్టీ విశాఖ తూర్పు సమన్వయకర్త మొల్లి అప్పారావు, సీనియర్ నేత రవిరెడ్డితో కలిసి కేకే రాజు మీడియాతో మాట్లాడారు. విశాఖ తీరంలో ఆరుగురు మత్స్యకారుల ఆచూకీ ఇప్పటికీ తెలియకపోవడం తీవ్ర ఆందోళన కలిగిస్తోందన్నారు. ప్రమాదం జూలై 4 మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో జరిగినట్లు సమాచారం ఉన్నప్పటికీ, రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన మైరెన్ పోలీసులు, కేంద్ర ప్రభుత్వానికి చెందిన కోస్ట్ గార్డ్, నేవీ బృందాలు జూలై 5 ఉదయం వరకు సహాయక చర్యలు చేపట్టకపోవడం దురదృష్టకరమన్నారు. స్థానిక ఎంపీ, హోంమంత్రి, ఇతర ప్రజాప్రతినిధులు బాధిత కుటుంబాలకు భరోసా ఇవ్వకపోవడం అత్యంత బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రమాదం జరిగిన నాలుగు రోజులైనా గల్లంతైన మత్స్యకారుల ఆచూకీ కనుగొనలేకపోవడం ప్రభుత్వ అసమర్థతకు నిదర్శనమని మండిపడ్డారు. అలాగే విశాఖలో జరుగుతున్న భూ ఆక్రమణలపై సీబీఐ దర్యాప్తు చేపట్టాలని కేకే రాజు డిమాండ్ చేశారు.


