బాబు సర్కారు ఘోర వైఫల్యం | Extreme negligence in tracing fishermen | Sakshi
Sakshi News home page

బాబు సర్కారు ఘోర వైఫల్యం

Jul 9 2026 5:26 AM | Updated on Jul 9 2026 5:26 AM

Extreme negligence in tracing fishermen

మత్స్యకారుల ఆచూకీ కనుక్కోవడంలో తీవ్ర అలసత్వం 

ఇంకా లభించని ఆరుగురు గంగపుత్రుల జాడ

కనీస దయ కూడా లేకుండా.. నడిసంద్రంలో వదిలేసిన ప్రభుత్వం   

గాలింపు చర్యలను నిలిపివేసి చేతులు దులుపుకున్న పాలకులు

గంగపుత్రుల కుటుంబాల్లో వెల్లువెత్తుతున్న ఆగ్రహావేశాలు 

మృతదేహాలైనా దొరికేవరకూ వెతకలేరా అంటూ కన్నీరుమున్నీరు   

మత్స్యకారులను ఆదుకుంటానన్న పవన్‌ ఎక్కడంటూ నిరసనలు   

పరామర్శకు వచ్చిన మంత్రి కొల్లు రవీంద్ర కారును అడ్డుకున్న మహిళలు 

పుట్టెడు దుఃఖంలో ఉన్న మహిళల గోడు వినకుండా చెదరగొట్టిన పోలీసులు

సాక్షి, విశాఖపట్నం: గంగమ్మ అలల హోరు ఆ కుటుంబాలకు ఇప్పుడు మృత్యుఘోషలా వినిపిస్తోంది. బతుకు పోరాటం కోసం పడవెక్కి కడలి ఒడిలోకి వెళ్లిన ఆరుగు­రు గంగపుత్రులు ఏమయ్యారో తెలియక ఆ ఇళ్లు కన్నీటి సంద్రాలయ్యాయి. రోజుల తరబడి రేవు వైపు ఆశగా చూస్తున్న కళ్లలో నెత్తురు సుడులు తిరుగుతోంది. కానీ.. ఆపత్కాలంలో అండగా నిలవాల్సిన చంద్రబాబు ప్రభు­త్వం మాత్రం ఆ అభాగ్యులను నిలువునా దగా చేసింది. బాధి­తులకు భరోసా ఇవ్వాల్సిన యంత్రాంగం.. కనీస కనికరం లేకుండా నిర్దాక్షిణ్యంగా గాలింపు చర్యలను అర్ధాంతరంగా నిలిపివేసి చేతులెత్తేసింది. 

అదేమని కన్నీటితో ప్రశ్నిస్తున్న కుటుంబాలపైకి ఖాకీలను ఉసిగొల్పి గొంతునొక్కేందుకు య­త్నిస్తోంది. కర్కశత్వాన్ని చాటుకుంటోంది.  దీంతో గంగపుత్రుల కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విల­పిస్తున్నారు. తమ గోడు వినే నాథుడే లేడా అంటూ రోదిస్తున్నారు. ఉదయం లేచింది మొదలు పేదలంటే గౌరవం.. మత్స్యకారులంటే ప్రాణమని డైలాగులు చెప్పే పవన్‌ కళ్యాణ్‌ ఎక్కడంటూ ప్రశ్నిస్తున్నారు.  

అరకొర పరిహారంతో బాధ్యత నుంచి తప్పుకుంటారా?  
కనీసం గల్లంతైనవారు బతికున్నా­రా, లేదా సముద్ర గర్భంలోనే కలిసిపోయారా అన్నది నిర్ధారించకుండానే వెతుకులాట ఎలా ఆపేస్తారని బాధిత కుటుంబాలు ఆగ్ర­హం వ్యక్తం చేస్తున్నాయి. మనిషి ప్రాణానికి రూ.10 లక్షల వెలకట్టి, పరిహారం ఇచ్చేశాం కదా అని చంద్రబాబు సర్కారు బాధ్యత నుంచి తప్పుకోవడాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నారు. మా వాళ్లు బతికుంటే ప్రాణాలతో.. లేదంటే వాళ్ల మృతదేహాలైనా తెచ్చివ్వండి‘ అంటూ కడుపుకోతతో ఆక్రోశిస్తున్నారు. అయినా బాధి­తుల ఆర్తనాదాలు మాత్రం పాలకుల చెవికెక్కడం లేదు.   

ప్రశ్నిస్తే.. పోలీసులతో తోసేస్తారా.? 
బాధితుల చెంతకు మొక్కుబడి పరామర్శకు వచ్చిన మంత్రి కొల్లు రవీంద్రకు విశాఖ ఫిషింగ్‌ హార్బర్‌లో బుధవారం చేదు అనుభవం ఎదురైంది. కన్నీళ్లు తుడు­చుకుంటూ తమ ఆవేదనను చెప్పుకునేందుకు ఆయన కారును మత్స్యకార మహిళలు అడ్డుకున్నారు. గాలింపు చర్యలు కొనసాగించాలంటూ నినాదాలు చేశారు. 

గల్లంతైన వారి ఆచూకీ తెలిసేంత వరకూ కొనసాగించాలని డిమాండ్‌ చేస్తూ మంత్రి కారుకు అడ్డంగా నిలుచున్నారు. అంతే పోలీసులు కనీస మానవత్వం లేకుండా పుట్టెడు దుఃఖంలో ఉన్న  మహిళలపై తమ ప్రతాపం చూపారు. ఆడపడుచులని కూ­డా చూడకుండా, అత్యంత అమా­నుషంగా వారిని పక్కకు తోసేసి కర్కశత్వం ప్రదర్శించారు. ఇది చంద్రబాబు ప్రభు­త్వ అరాచకానికి పరాకాష్టగా మారింది. దీనిపై బాధితులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రశ్నిస్తే తోసేస్తారా అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.  

గత ప్రభుత్వంలో మిన్నగా..
బాధ్యత గల ప్రభుత్వం అంటే.. ఆఖరి ఆశ ఆరిపోయే వరకూ ప్రాణాలను కాపాడేందుకు శ్రమించాలి.  కానీ చంద్రబాబు ప్రభుత్వం మాత్రం బాధితుల గొంతు నొక్కేస్తూ, సమస్యను కప్పిపుచ్చే ప్రయత్నం చేస్తోంది. 72 గంటలకు పైగా గాలింపు చర్యలు చేపట్టిన అనంతరం.. ఏమయ్యారో తెలియకుండానే వారు బతికి లేరని నిర్థారించేసింది. బాధిత కుటుంబాలకు తక్షణ సాయం పేరుతో రూ.10 లక్షలు అందజేశారు. 

అది కూడా.. మత్స్య శాఖ నుంచి రూ.5 లక్షలు, సీఎం రిలీఫ్‌ ఫండ్‌ నుంచి రూ.5 లక్షలు ఇస్తున్నట్లు ప్రకటించడంపైనా విమర్శలొస్తున్నాయి. 2023లో హార్బర్‌లో బోట్లు అగ్ని ప్రమాదానికి ఆహుతైతే.. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ఒక్కో బోటు, వలలకు రూ.20లక్షలకు పైగా పరిహారం అందించింది. చిన్న వల కాలిపోయినా.. దానికీ పరిహారం అందించింది. కానీ.. ఒక కుటుంబాన్ని నడి­పించే వ్యక్తి కనిపించకపోతే.. గాలించడం వదిలేసి.. కేవలం రూ.10 లక్షలు  ఇచ్చి చేతులు దులిపేసుకోవడంపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తమవుతోంది.

వారిని మృతులుగా నిర్ధారించలేదు
గల్లంతైన మత్స్యకారులపై త్రిసభ్య కమిటీ నివేదిక
మహారాణిపేట : సముద్రంలో గల్లంతైన మత్స్యకారుల ఆచూకీ ఇప్పటికీ లభ్యం కాలేదని, వారిని మృతులుగా అధికారికంగా నిర్ధారించలేదని ప్రభుత్వం నియమించిన త్రిసభ్య కమిటీ తన నివేదికలో పేర్కొంది. ఆర్‌డీవో కళ్యాణ్‌ చక్రవర్తి, ఏసీపీ చిట్టిబాబు, మత్స్యశాఖ అసిస్టెంట్‌ డైరెక్టర్‌ సురేష్‌తో కూడిన కమిటీ తొమ్మిది పేజీల నివేదికను ప్రభుత్వానికి సమర్పించింది. కోస్ట్‌ గార్డ్‌ అందించిన వివరాలు, ప్రభుత్వ జీవోలు (జీఓలు), అమల్లో ఉన్న నిబంధనలను ఆధారంగా చేసుకుని ఈ నివేదికను రూపొందించినట్లు పేర్కొంది. గల్లంతైన మత్స్యకారుల ఘటనకు సంబంధించిన వాస్తవ పరిస్థితులు, నిబంధనల ప్రకారం తీసుకోవాల్సిన చర్యలు, పరిహారానికి సంబంధించిన అంశాలను నివేదికలో పొందుపరిచినట్లు సమాచారం.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement