breaking news
Visakhapatnam fishing harbor
-
బాబు సర్కారు ఘోర వైఫల్యం
సాక్షి, విశాఖపట్నం: గంగమ్మ అలల హోరు ఆ కుటుంబాలకు ఇప్పుడు మృత్యుఘోషలా వినిపిస్తోంది. బతుకు పోరాటం కోసం పడవెక్కి కడలి ఒడిలోకి వెళ్లిన ఆరుగురు గంగపుత్రులు ఏమయ్యారో తెలియక ఆ ఇళ్లు కన్నీటి సంద్రాలయ్యాయి. రోజుల తరబడి రేవు వైపు ఆశగా చూస్తున్న కళ్లలో నెత్తురు సుడులు తిరుగుతోంది. కానీ.. ఆపత్కాలంలో అండగా నిలవాల్సిన చంద్రబాబు ప్రభుత్వం మాత్రం ఆ అభాగ్యులను నిలువునా దగా చేసింది. బాధితులకు భరోసా ఇవ్వాల్సిన యంత్రాంగం.. కనీస కనికరం లేకుండా నిర్దాక్షిణ్యంగా గాలింపు చర్యలను అర్ధాంతరంగా నిలిపివేసి చేతులెత్తేసింది. అదేమని కన్నీటితో ప్రశ్నిస్తున్న కుటుంబాలపైకి ఖాకీలను ఉసిగొల్పి గొంతునొక్కేందుకు యత్నిస్తోంది. కర్కశత్వాన్ని చాటుకుంటోంది. దీంతో గంగపుత్రుల కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. తమ గోడు వినే నాథుడే లేడా అంటూ రోదిస్తున్నారు. ఉదయం లేచింది మొదలు పేదలంటే గౌరవం.. మత్స్యకారులంటే ప్రాణమని డైలాగులు చెప్పే పవన్ కళ్యాణ్ ఎక్కడంటూ ప్రశ్నిస్తున్నారు. అరకొర పరిహారంతో బాధ్యత నుంచి తప్పుకుంటారా? కనీసం గల్లంతైనవారు బతికున్నారా, లేదా సముద్ర గర్భంలోనే కలిసిపోయారా అన్నది నిర్ధారించకుండానే వెతుకులాట ఎలా ఆపేస్తారని బాధిత కుటుంబాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. మనిషి ప్రాణానికి రూ.10 లక్షల వెలకట్టి, పరిహారం ఇచ్చేశాం కదా అని చంద్రబాబు సర్కారు బాధ్యత నుంచి తప్పుకోవడాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నారు. మా వాళ్లు బతికుంటే ప్రాణాలతో.. లేదంటే వాళ్ల మృతదేహాలైనా తెచ్చివ్వండి‘ అంటూ కడుపుకోతతో ఆక్రోశిస్తున్నారు. అయినా బాధితుల ఆర్తనాదాలు మాత్రం పాలకుల చెవికెక్కడం లేదు. ప్రశ్నిస్తే.. పోలీసులతో తోసేస్తారా.? బాధితుల చెంతకు మొక్కుబడి పరామర్శకు వచ్చిన మంత్రి కొల్లు రవీంద్రకు విశాఖ ఫిషింగ్ హార్బర్లో బుధవారం చేదు అనుభవం ఎదురైంది. కన్నీళ్లు తుడుచుకుంటూ తమ ఆవేదనను చెప్పుకునేందుకు ఆయన కారును మత్స్యకార మహిళలు అడ్డుకున్నారు. గాలింపు చర్యలు కొనసాగించాలంటూ నినాదాలు చేశారు. గల్లంతైన వారి ఆచూకీ తెలిసేంత వరకూ కొనసాగించాలని డిమాండ్ చేస్తూ మంత్రి కారుకు అడ్డంగా నిలుచున్నారు. అంతే పోలీసులు కనీస మానవత్వం లేకుండా పుట్టెడు దుఃఖంలో ఉన్న మహిళలపై తమ ప్రతాపం చూపారు. ఆడపడుచులని కూడా చూడకుండా, అత్యంత అమానుషంగా వారిని పక్కకు తోసేసి కర్కశత్వం ప్రదర్శించారు. ఇది చంద్రబాబు ప్రభుత్వ అరాచకానికి పరాకాష్టగా మారింది. దీనిపై బాధితులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రశ్నిస్తే తోసేస్తారా అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత ప్రభుత్వంలో మిన్నగా..బాధ్యత గల ప్రభుత్వం అంటే.. ఆఖరి ఆశ ఆరిపోయే వరకూ ప్రాణాలను కాపాడేందుకు శ్రమించాలి. కానీ చంద్రబాబు ప్రభుత్వం మాత్రం బాధితుల గొంతు నొక్కేస్తూ, సమస్యను కప్పిపుచ్చే ప్రయత్నం చేస్తోంది. 72 గంటలకు పైగా గాలింపు చర్యలు చేపట్టిన అనంతరం.. ఏమయ్యారో తెలియకుండానే వారు బతికి లేరని నిర్థారించేసింది. బాధిత కుటుంబాలకు తక్షణ సాయం పేరుతో రూ.10 లక్షలు అందజేశారు. అది కూడా.. మత్స్య శాఖ నుంచి రూ.5 లక్షలు, సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి రూ.5 లక్షలు ఇస్తున్నట్లు ప్రకటించడంపైనా విమర్శలొస్తున్నాయి. 2023లో హార్బర్లో బోట్లు అగ్ని ప్రమాదానికి ఆహుతైతే.. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఒక్కో బోటు, వలలకు రూ.20లక్షలకు పైగా పరిహారం అందించింది. చిన్న వల కాలిపోయినా.. దానికీ పరిహారం అందించింది. కానీ.. ఒక కుటుంబాన్ని నడిపించే వ్యక్తి కనిపించకపోతే.. గాలించడం వదిలేసి.. కేవలం రూ.10 లక్షలు ఇచ్చి చేతులు దులిపేసుకోవడంపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తమవుతోంది.వారిని మృతులుగా నిర్ధారించలేదుగల్లంతైన మత్స్యకారులపై త్రిసభ్య కమిటీ నివేదికమహారాణిపేట : సముద్రంలో గల్లంతైన మత్స్యకారుల ఆచూకీ ఇప్పటికీ లభ్యం కాలేదని, వారిని మృతులుగా అధికారికంగా నిర్ధారించలేదని ప్రభుత్వం నియమించిన త్రిసభ్య కమిటీ తన నివేదికలో పేర్కొంది. ఆర్డీవో కళ్యాణ్ చక్రవర్తి, ఏసీపీ చిట్టిబాబు, మత్స్యశాఖ అసిస్టెంట్ డైరెక్టర్ సురేష్‌తో కూడిన కమిటీ తొమ్మిది పేజీల నివేదికను ప్రభుత్వానికి సమర్పించింది. కోస్ట్ గార్డ్ అందించిన వివరాలు, ప్రభుత్వ జీవోలు (జీఓలు), అమల్లో ఉన్న నిబంధనలను ఆధారంగా చేసుకుని ఈ నివేదికను రూపొందించినట్లు పేర్కొంది. గల్లంతైన మత్స్యకారుల ఘటనకు సంబంధించిన వాస్తవ పరిస్థితులు, నిబంధనల ప్రకారం తీసుకోవాల్సిన చర్యలు, పరిహారానికి సంబంధించిన అంశాలను నివేదికలో పొందుపరిచినట్లు సమాచారం. -
నడి సంద్రంలో చిక్కుకుని..
సాక్షి, విశాఖపట్నం/పూసపాటిరేగ: బతుకుదెరువు కోసం నడి సంద్రంలోకి వెళ్లిన మత్స్యకార కుటుంబాల్లో కల్లోలం నెలకొంది. వాతావరణం ప్రతికూలంగా మారడం, సముద్రం అల్లకల్లోలంగా ఉండటంతో విశాఖ నుంచి చేపల వేటకు బయలుదేరిన రెండు మత్స్యకారుల బోట్లు వేర్వేరు ప్రాంతాల్లో గల్లంతయ్యాయి. వీటిల్లో మొత్తం 16 మంది మత్స్యకారులున్నట్లు గుర్తించారు. ఇందులో ఒక బోటు డ్రైవర్ చైనా కార్గో షిప్ సహాయంతో ప్రమాదం నుంచి బయటపడగా.. ఆరుగురు మత్స్యకారులు గల్లంతయ్యారు. మరో బోటులో ఉన్న 9 మంది మత్స్యకారులు ప్రమాదపుటంచుల వరకూ వెళ్లి అతికష్టంమ్మీద పూరీ తీరానికి ప్రాణాలతో చేరుకున్నారు. గల్లంతైన ఆరుగురు మత్స్యకారుల ఆచూకీ కోసం కోస్ట్‌గార్డ్, నేవీ, మెరైన్ పోలీసులు గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. మొదటి బోటులో ఏం జరిగిందంటే..!విశాఖపట్నం ఫిషింగ్ హార్బర్ నుంచి ఐఎన్డీ ఏపీ అండ్ వీఎస్ అండ్ ఎంఎం అండ్ 83 నంబర్ బోటులో ఏడుగురు మత్స్యకారులు జూలై 1న చేపల వేటకు బయలుదేరారు. శనివారం మధ్యాహ్నం నుంచి ఈ బోటు ఆచూకీ లేకుండా పోయింది. గల్లంతవడానికి ముందు రాత్రి బోటులో ఉన్నవారు తమ కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి.. ‘గంగవరం దగ్గర్లో ఉన్నాం... గంటలో హార్బర్‌కు చేరుకుంటాం’ అని చెప్పారు. గంట తర్వాత వారి ఫోన్లు కలవకపోవడంతో మత్స్యకార కుటుంబాలు ఆందోళనతో అధికారులకు సమాచారం ఇచ్చాయి. మొదటి బోటు డ్రైవర్, ఓనర్ అయిన కారి‡ చిన్నా.. చైనా కార్గో నౌక సహాయంతో సురక్షితంగా బయటపడ్డాడు. తీవ్ర ప్రతికూల పరిస్థితుల మధ్య చైనాకు చెందిన పనామా (కార్గో) నౌక ఈ బోటును గుర్తించింది. వాణిజ్య నౌక సిబ్బంది లైఫ్ జాకెట్ వేసి సురక్షితంగా రక్షించారు. ప్రస్తుతం ఆయన కోస్ట్‌గార్డ్ సంరక్షణలో ఉన్నారు. మరో ఆరుగురు మత్స్యకారుల ఆచూకీ తెలియరాలేదు. గంగవరం నుంచి 10 నాటికల్ మైళ్ల దూరంలోకి ఎలా వెళ్లారన్న దానిపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. ఒక్కసారిగా ఇంజన్ పనిచేయలేదని.. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా గంటకు 40 నుంచి 50 కిమీ వేగంతో బలమైన గాలులు వీస్తుండటం.. యాంకర్ తాడు ఒక్కసారిగా తెగిపోవడంతో బోటు దిశ మారి కొట్టుకుపోయిందని ప్రాథమికంగా అంచనా వేస్తున్నట్లు మత్స్యశాఖ కమిషనర్ కార్యాలయం ప్రకటించింది. ఈత కొడుతూ షిప్ వద్దకు వెళ్లేందుకు యత్నించి..డ్రైవర్ చిన్నాను రక్షించిన సమయంలో.. మరో ముగ్గురు మత్స్యకారులు ప్రాణాలు దక్కించుకునేందుకు ఈత కొడుతూ ఆ షిప్ వద్దకు వెళ్లే ప్రయత్నం చేశారు. కానీ అలసిపోయి సముద్రంలో గల్లంతయ్యారు. మిగిలిన వారు మరో పడవను గానీ తీరాన్ని గానీ చేరుకుని ఉండొచ్చని అధికారులు భావిస్తున్నారు. అయితే ఇప్పటి వరకూ వారి ఆచూకీ లభించకపోవడంతో వారి కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. రంగంలోకి నేవీ, కోస్ట్‌గార్డ్.. సమాచారం అందిన వెంటనే కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. గల్లంతైన మత్స్యకారుల కోసం కోస్ట్‌గార్డ్, నేవీ, మెరైన్ పోలీసు బృందాలు సంయుక్తంగా రెస్క్యూ ఆపరేషన్ చేపట్టాయి. నేవీకి చెందిన రెండు నౌకలు, కోస్ట్‌గార్డ్‌కు చెందిన రెండు హెలికాప్టర్లతో పాటు కాకినాడ నుంచి మరో కోస్ట్‌గార్డ్ నౌక ముమ్మరంగా గాలింపు చర్యల్లో నిమగ్నమయ్యాయి. బోటు ప్రయాణించిన దిశ, చివరి సిగ్నల్స్ ఆధారంగా సెర్చ్ ఆపరేషన్స్ కొనసాగిస్తున్నారు. సమీపంలోని అన్ని మర్చంట్ నౌకలను కూడా రెస్క్యూ బృందాలు అప్రమత్తం చేశాయి.పరామర్శించిన వైఎస్సార్సీపీ నాయకులుగల్లంతైన మత్స్యకారుల కుటుంబ సభ్యులను వైఎస్సార్ సీపీ విశాఖ జిల్లా అధ్యక్షుడు కేకే రాజు, విశాఖ దక్షిణ సమన్వయకర్త వాసుపల్లి గణేష్‌కుమార్ ఆదివారం సాయంత్రం పరామర్శించారు. ప్రమాదం జరిగి 24 గంటలు గడిచినా ప్రభుత్వం తగిన చొరవ చూపకపోవడం విచారకరమని కేకే రాజు పేర్కొన్నారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి యుద్ధప్రాతిపదికన గల్లంతైన వారిని గుర్తించాలని, బాధిత కుటుంబాలకు పూర్తి భరోసాతో పాటు మునిగిపోయిన బోటుకు తగిన పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. మత్స్యకారులు గల్లంతు కావడంపై ఏపీ శాసనమండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ తీవ్ర ఆవేదన వ్యక్తంచేశారు. గల్లంతైన వారిని సురక్షితంగా రక్షించేందుకు ప్రభుత్వం యుద్ధప్రాతిపదికన రెస్క్యూ ఆపరేషన్ ప్రక్రియను మరింత వేగవంతం చేయాలని ఆయన డిమాండ్ చేశారు. జనసేన ఎమ్మెల్యే వంశీకృష్ణపై మత్స్యకార కుటుంబాల మండిపాటుమత్స్యకారులను కాపాడాలని రాత్రి పూట బాధిత కుటుంబాలు సమాచారం అందించినా ప్రభుత్వం సరిగా స్పందించలేదని మండిపడుతున్నారు. ఉదయం తర్వాత తాపీగా రెస్క్యూ ఆపరేషన్ మొదలు పెట్టారంటూ ఆగ్రహం వ్యక్తం చేశాయి. పరామర్శకు వచ్చిన జనసేన ఎమ్మెల్యే వంశీకృష్ణను మత్స్యకార కుటుంబాలు నిలదీశాయి. మత్స్యకారులు ప్రమాదకర పరిíస్థితుల్లో ఉంటే ఫోన్లలో కాలక్షేపం చేయడం ఏమిటని మండిపడ్డాయి. విశాఖ ఎంపీ భరత్ మత్స్యకారుల గురించి కనీసం ఆరా తీయలేదు. ఇతర టీడీపీ, జనసేన ఎమ్మెల్యేలు అటువైపు కన్నెత్తి చూడలేదు.అచ్చెన్నా..! నిస్సిగ్గుగా అబద్ధాలా!గల్లంతైన మత్స్యకారుల్లో ఒకరిని ప్రభుత్వం రక్షించిందంటూ మంత్రి అచ్చెన్న ప్రెస్‌నోట్ విడుదల చేయటంపై మత్స్యకారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సురక్షితంగా బయటపడిన డ్రైవర్ చిన్నా.. సమీపంలో కనిపించిన చైనాకి చెందిన ఎంవీ యూనివర్స్ వెల్దీ అనే షిప్ వద్దకు ఈదుకుంటూ వెళ్లి ప్రాణాలు కాపాడుకున్నానని స్పష్టంగా చెప్పాడు. మంత్రి అచ్చెన్న మాత్రం ప్రభుత్వం కాపాడిందంటూ ప్రకటించడంపై సర్వత్రా విస్మయం వ్యక్తమవుతోంది. ఇక పూరీలో గల్లంతైన మెకనైజ్డ్ బోటు గాలుల తీవ్రతకు అతికష్టమ్మీద ఒడ్డుకు వచ్చింది. సమీపంలో ఉన్న ఒడిశాకు చెందిన మెరైన్ పోలీసులు అప్రమత్తమై అందులో ఉన్నవారిని కాపాడారు. వీరిని కూడా తామే రక్షించామంటూ అచ్చెన్న ప్రకటించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.పూరీ తీరంలో మరో పడవజూన్ 30న విశాఖ నుంచి చేపల వేటకు వెళ్లిన మరో బోటు పూరీ (ఒడిశా) తీరంలో ప్రమాదానికి గురైంది. ఇందులో మొత్తం 9 మంది మత్స్యకారులు ఉండగా ఎట్టకేలకు అంతా సురక్షితంగా ప్రాణాలతో ఒడ్డుకు చేరుకున్నారు. పడవ ఇంజన్ దెబ్బతినడం, యాంకర్ తాడు అకస్మాత్తుగా తెగిపోవడంతో బోటు నియంత్రణ కోల్పోయి వేగంగా ఒడ్డు వైపు కొట్టుకొచ్చింది. సముద్రం అల్లకల్లోలంగా ఉండటంతో ప్రాణాలు అరచేతిలో పెట్టుకున్న జాలర్లు తమను కాపాడాలంటూ వీడియో రూపంలో అధికారులకు సమాచారం అందించారు. వేగంగా కొట్టుకొస్తున్న బోటులో ఉన్న 9 మంది మత్స్యకారులు ప్రాణాలు అరచేత పట్టుకొని బిక్కుబిక్కుమంటూ గడిపారు. అదృష్టవశాత్తూ బోటు సురక్షితంగా ఆదివారం రాత్రి పూరీ తీరానికి చేరుకోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.కళ్లెదుటే నా వాళ్లందరినీ కోల్పోయా...!‘వేట ముగించుకుని వలలు కడిగేసి తిరిగి వస్తుండగా ఒడ్డుకు సుమారు 10 మైళ్ల దూరంలో ఊహించని విధంగా మా బోటు ఒక్కసారిగా తిరగబడిపోయింది. బోటులో ఉన్న ఏడుగురిలో ఒకరు లోపలే చిక్కుకుపోగా మిగిలిన ఆరుగురు నీళ్లలో దొరికిన ఆధారాలను పట్టుకుని రాత్రి 9 గంటల వరకు ప్రాణాలతో పోరాడాం. ఆ తర్వాత బోటు పూర్తిగా మునిగిపోయింది. తీవ్ర అలసటతో రాత్రి 11 గంటల సమయంలో ఒకరు కళ్లెదుటే ప్రాణాలు వదలడంతో తీవ్ర విషాదంలో కూరుకుపోయాం. తెల్లారేసరికి ఐదుగురం మిగిలాం. ఆ సమయంలో దూరంగా ఒక షిప్ కనిపించింది. కండరాలు పట్టేయడంతో మా పెద్దన్న ఇక ఈదలేనని అక్కడే ఉండిపోగా... ప్రాణాలు దక్కించుకోవచ్చన్న ఆశతో మిగిలిన నలుగురం ఆ ఓడ వైపు ఈదుకుంటూ వెళ్లాం. నేను ముందుగా వెళ్లి ఆ ఓడ యాంకర్ని గట్టిగా పట్టుకున్నా. కానీ అది గాలిలో వేలాడుతుండటంతో చేజారి మళ్లీ నీళ్లలో పడిపోయా. ప్రాణభయంతో గట్టిగా కేకలు వేయడంతో ఓడలోని సిబ్బంది లైఫ్ జాకెట్ విసిరి తాడు సాయంతో నన్ను పైకి లాగి కాపాడారు. కానీ నాతో పాటు ఈదుకుంటూ వచ్చిన మిగిలిన ముగ్గురి పరిస్థితి ఏమైందో తెలియదు. నాతోపాటు వేటకు వచ్చిన వాళ్లంతా నా సొంత అన్నలు, వాళ్ల పిల్లలు, దగ్గరి బంధువులే. నా కళ్లెదుటే నా వాళ్లందరినీ కోల్పోయా. నా జీవితం ఇలా ఒంటరిగా మిగిలింది. – కారి చిన్నా, బోటు ఓనర్, డ్రైవర్మత్స్యకారుల గల్లంతుపై వైఎస్ జగన్ ఆందోళనగాలింపు చర్యలు ముమ్మరం చేయాలిబాధిత కుటుంబాలకు ప్రభుత్వం ధైర్యం చెప్పాలిసాక్షి, అమరావతి: విశాఖ ఫిషింగ్ హార్బర్ నుంచి సముద్రంలో చేపల వేటకు వెళ్లి మత్స్యకారులు గల్లంతైన ఘటనపై మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. సముద్రంలోకి వెళ్లిన మత్స్యకారుల బోటు సాంకేతిక కారణాలతో తిరిగి రాకపోవడం, వారితో సంబంధాలు తెగిపోవడం బాధాకరమన్నారు. మత్స్యకారుల కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళనలో ఉన్నందున ప్రభుత్వం మరింత వేగంగా స్పందించి గాలింపు చర్యలను విస్తృతంగా చేపట్టాలని కోరారు.కోస్టుగార్డు, నేవీ, మెరైన్ పోలీసు విభాగాల సమన్వయంతో గాలింపు చర్యలను మరింత ముమ్మరం చేయాలని సూచించారు. అవసరమైతే అదనపు నౌకలు, హెలికాప్టర్లు వినియోగించి మత్స్యకారులను గుర్తించి రక్షించేందుకు అన్ని ప్రయత్నాలు చేయాలన్నారు. గల్లంతైన మత్స్యకారుల కుటుంబాలకు ప్రభుత్వం తక్షణమే ధైర్యం చెప్పాలని, వారికి ఎప్పటికప్పుడు గాలింపు చర్యల వివరాలు తెలియజేయాలని సూచించారు. ఈ కష్ట సమయంలో మత్స్యకారుల కుటుంబాలకు వైఎస్సార్సీపీ అండగా ఉంటుందని వైఎస్ జగన్ తెలిపారు. బాధిత మత్స్యకారుల కుటుంబాలను విశాఖ ప్రాంత వైఎస్సార్సీపీ నాయకులు సంప్రదించి అవసరమైన సహాయం అందించాలని, అధికారులతో సమన్వయం చేస్తూ గాలింపు చర్యల పురోగతిని తెలుసుకోవాలని నిర్దేశించారు. గల్లంతైన మత్స్యకారులు సురక్షితంగా తిరిగి రావాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నట్లు వైఎస్ జగన్ పేర్కొన్నారు. -
ఒడ్డున ఆగిన బతుకు పడవలు
సముద్రమే జీవనాధారంగా బతికే గంగపుత్రుల జీవితాలు.. ఇప్పుడు అలల తాకిడికి కొట్టుకుపోతున్నాయి. ఎన్నో ఆశలతో ప్రారంభమైన వేట సీజన్.. వారి ఆశలను ఆవిరి చేస్తూ కన్నీటి గాథగా మారుతోంది. లక్షలు పెట్టుబడిగా పెట్టి సముద్రంలోకి వెళ్తే, కనీసం డీజిల్ ఖర్చులు కూడా రాక, బోట్లను ఒడ్డుకే కట్టేసి నిస్సహాయంగా చూస్తున్నారు. విశాఖ ఫిషింగ్ హార్బర్ .. ఒకప్పుడు వేలాది బోట్ల రాకపోకలతో, మత్స్యకారుల కోలాహలంతో సందడిగా ఉండేది. కానీ ఇప్పుడు 80 శాతానికి పైగా బోట్లు లంగరేసుకుని నిశ్శబ్దంగా రోదిస్తున్నాయి. – మహారాణిపేటతూర్పు తీరంలో మత్స్యకారుల బతుకుచిత్రం ఆందోళనకరంగా మారింది. వేట సీజన్ ప్రారంభమై మూడు నెలలు గడిచినా, వారి వలలకు ఆశించిన సంపద చిక్కడం లేదు. వేటకు వెళ్తే లక్షల్లో ఖర్చు, తిరిగి వస్తే కనీసం పెట్టిన పెట్టుబడి కూడా దక్కని దుస్థితి. దీంతో విశాఖ ఫిషింగ్ హార్బర్లోని 643 బోట్లకు గాను కేవలం 150 బోట్లు మాత్రమే నామమాత్రంగా వేటకు వెళ్తున్నాయి. సుమారు 80 శాతానికి పైగా మరబోట్లు ఒడ్డుకే పరిమితమై, అప్రకటిత వేట విరామాన్ని పాటిస్తున్నాయి. ఉపాధి లేక ఎందరో మత్స్యకారులు ఇతర ప్రాంతాలకు వలసపోతుండటం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. ఆరంభ శూరత్వమే.. విశాఖ చేపల రేవు తూర్పు తీరానికి కేంద్రంగా ఉంది. జూన్ 15న వేట నిషేధం ముగిసినప్పుడు మత్స్యకారులు ఎన్నో ఆశలతో సముద్రంలోకి అడుగుపెట్టారు. తొలి రెండు నెలలు చేపలు, రొయ్యల దిగుబడి జోరుగా సాగడంతో ఈ సీజన్ తమను ఆదుకుంటుందని భావించారు. కానీ ఆగస్టు నుంచి పరిస్థితి తలకిందులైంది. చేపల లభ్యత క్రమంగా తగ్గుతూ వచ్చి, సెపె్టంబర్ నాటికి పూర్తిగా పడిపోయింది. దీంతో వేట గిట్టుబాటు కాక.. యజమానులు తీవ్ర నష్టాలను చవిచూస్తున్నారు. 15 రోజుల వేటకు సుమారు రూ. 3.5 లక్షలు ఖర్చవుతుంటే, కనీస ఆదాయం కూడా రాకపోవడంతో బోట్లను హార్బర్‌లోనే నిలిపివేయడమే శ్రేయస్కరమని భావిస్తున్నారు. కాగా.. ప్రస్తుత సీజన్లో ఇప్పటివరకు కోట్లాది రూపాయల విలువ చేసే మత్స్య దిగుబడులు వచ్చాయని మత్స్య పరిశ్రమ వర్గాలు చెబుతుంటే.. సుమారు 40 శాతం మేర తగ్గిపోయాయని వ్యాపారులు అంటున్నారు. ట్యూనా వేటదీ అదే కథ అధిక ధర పలికే ట్యూనా చేపల లభ్యత కూడా అంతంతమాత్రంగానే ఉంది. 70 నుంచి 100 వరకు బోట్లు ట్యూనా కోసం వెళ్లినా, ఆశించిన ఫలితం దక్కడం లేదు. నాణ్యమైన గ్రేడ్–1 ట్యూనా చేపలు దొరికినా, వాటిని 48 గంటల్లోపు ఎగుమతి చేసేందుకు అవసరమైన మౌలిక సదుపాయాలు విశాఖ హార్బర్లో లేవు. దీంతో చేతికొచ్చిన అవకాశాన్ని కూడా జారవిడుచుకోవాల్సిన దుస్థితి నెలకొంది. కాగా.. జిల్లాలో 32 మత్స్యకార గ్రామాలు, సుమారు 1.5 లక్షల జనాభా ప్రత్యక్షంగా, పరోక్షంగా ఈ వృత్తిపైనే ఆధారపడి జీవిస్తున్నారు. ఇప్పుడు వేట సంక్షోభంలో కూరుకుపోవడంతో వేలాది కుటుంబాల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది. కారణాలెన్నో.. కష్టాలెన్నో.. మత్స్య సంపద తగ్గడానికి ప్రధాన కారణం సముద్ర వాతావరణంలో వస్తున్న మార్పులేనని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. సముద్ర ఉపరితలం వేడెక్కడంతో చేపలు, రొయ్యలు చల్లదనం కోసం లోతైన ప్రాంతాలకు వెళ్లిపోతున్నాయి. అంత లోతుకు వెళ్లి వేటాడే సాంకేతికత, వనరులు సాధారణ మత్స్యకారులకు లేకపోవడం పెద్ద సమస్యగా మారింది. దీనికి తోడు, పరిశ్రమల నుంచి వెలువడే రసాయన వ్యర్థాలు సముద్రంలో కలవడం వల్ల కాలుష్యం పెరిగిపోయి, మత్స్య సంపద నశించిపోతోందని మత్స్యకారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. డీజిల్ భారం పెరిగిపోవడంతో వేట గిట్టుబాటు కావడం లేదని మత్స్యకారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.ప్రభుత్వమే ఆదుకోవాలి ప్రభుత్వం తక్షణమే స్పందించి మత్స్యకారులను ఆదుకోవాలి. పెరిగిన డీజిల్ ధరలు, తగ్గిన వేటతో గంగపుత్రుల బతుకులు కష్టాల్లో ఉన్నాయి. పెట్టుబడి కూడా తిరిగి రాక అప్పుల పాలవుతున్నారు. ప్రభుత్వం ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించి, మత్స్యకార కుటుంబాలను ఆదుకోవాలి. – వాసుపల్లి జానకీరామ్, వైఎస్సార్ సీపీ నాయకుడు మత్స్య పరిశ్రమను కాపాడండి మత్స్య పరిశ్రమ తీవ్ర సంక్షోభంలో ఉంది. ఇది కేవలం మత్స్యకారుల సమస్య కాదు, మొత్తం పరిశ్రమ భవిష్యత్తు ప్రశ్నార్థకంలో పడింది. గత ఏడాది కూడా ఇదే పరిస్థితి. ప్రభుత్వం దీర్ఘకాలిక పరిష్కారాలపై దృష్టి సారించి, గిట్టుబాటు ధరలు కల్పించి, పరిశ్రమకు చేయూతనివ్వాలి. లేకపోతే ఈ వృత్తి కనుమరుగయ్యే ప్రమాదం ఉంది. – సూరాడ సత్యనారాయణ(సత్తిబాబు), ఉపాధ్యక్షులు, వైశాఖి మరపడవల సంఘం -
ఫిషింగ్ హార్బర్‌పై వైఎస్సార్సీపీ జెండా
మహారాణిపేట (విశాఖ దక్షిణ): విశాఖపట్నం ఫిషింగ్ హార్బర్‌పై వైఎస్సార్సీపీ జెండా ఎగిరింది. 32 సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీ అధీనంలో ఉన్న ఆంధ్రప్రదేశ్ మరపడవల సంఘాన్ని వైఎస్సార్సీపీ కైవసం చేసుకుంది. సంఘం కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ఎన్నికల్లో అధ్యక్షుడిగా వైఎస్సార్సీపీకి చెందిన వాసుపల్లి జానకీరామ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. విశాఖపట్నం ఫిషింగ్ హార్బర్లోని ఆంధ్రప్రదేశ్ మరపడవల సంఘంలో 300 మంది సభ్యులున్నారు. వీరికి 680 బోట్లున్నాయి. ఈ సంఘానికి అధ్యక్షుడిగా తెలుగుదేశం పార్టీకి చెందిన పి.సి.అప్పారావు కొన్నేళ్లుగా ఎన్నికవుతున్నారు. ఎప్పుడూ ఓటింగ్ నిర్వహించకుండా చేతులు ఎత్తే పద్ధతినే అనుసరిస్తూ గెలుపొందారు. తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షుడిగా పనిచేస్తున్న అప్పారావు మరపడవల సంఘం అధ్యక్షుడిగాను కొనసాగుతుండేవారు. ఈ నేపథ్యంలో దివంగత మాజీ కార్పొరేటర్ బి.నీలకంఠం అల్లుడు వాసుపల్లి జానకీరామ్ సంఘంలో చేరడానికి చేసిన ప్రయత్నాలను అప్పారావు అడ్డుకునేవారు. ఏపీ మరపడవల సంఘంలోని అవకతవకలను పలుమార్లు లేవనెత్తిన వాసుపల్లి జానకీరామ్ ఎన్నికలు నిర్వహించాలని కొన్నాళ్లుగా డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలో సంఘం కార్యవర్గానికి కాలపరిమితి ముగియడంతో ఎన్నికలు నిర్వహించాల్సి వచ్చింది. సోమవారం పోలీసు బందోబస్తు మధ్య జనరల్ బాడీ సమావేశం ఏర్పాటు చేశారు. ఎన్నికలు వద్దని అప్పారావు వర్గం, నిర్వహించాలని జానకీరామ్ వర్గం ఈ సమావేశంలో పట్టుబట్టాయి. రెండువర్గాల మధ్య వాదోపవాదాలు సాగాయి. పరిస్థితి గమనించిన పి.సి.అప్పారావు పదవికి రాజీనామా చేసి వెళ్లిపోయారు. అనంతరం నిర్వహించిన ఎన్నికల్లో జానకీరామ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా జానకీరామ్ మాట్లాడుతూ మత్స్యకారుల సమస్యలను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషిచేస్తానని చెప్పారు. మత్స్యకారుల సంక్షేమం కోసం సీఎం జగన్ అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారని గుర్తుచేశారు. -
ఆరంభంలోనే ‘అల’జడి!
- వాయుగుండంతో బోట్లు వెనక్కి - విశాఖ ఫిషింగ్ హార్బర్లో లంగరు - నష్టాల్లో మత్స్యకారులు సాక్షి, విశాఖపట్నం : రెండు నెలల విరామం తర్వాత చేపల వేటకెళ్లిన మత్స్యకారుల ఆశలపై వాయుగుండం నీళ్లు చల్లింది. ఈ ఏడాది ఏప్రిల్ 14 అర్ధరాత్రి నుంచి జూన్ 14 అర్ధరాత్రి (61 రోజులు) వరకు ప్రభుత్వం చేపలవేటపై నిషేధం విధించిన సంగతి తెలిసిందే. దీంతో 15వ తేదీ నుంచి వీరు వేటకు బయల్దేరారు. వెళ్లిన రెండు రోజులకే బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడి క్ర మేపీ వాయుగుండంగా బలపడింది. ఫలితంగా మత్స్యకారులు చేపలవేటకు వెళ్లొద్దని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ప్రాణభయంతో అప్పటికే సముద్రంలో వేట సాగిస్తున్న బోట్లలో సగానికిపైగా ఆగమేఘాలపై విశాఖ హార్బర్‌కు తీసుకొచ్చేశారు. మరికొన్ని మరపడవలు సమీపంలో ఉన్న ఒడిశాలోని గోపాల్పూర్, పారదీప్, శ్రీకాకుళం జిల్లా భావనపాడు తదితర రేవులకు చేర్చారు. విశాఖ నుంచి సుమారు 650 బోట్లు వేట సాగిస్తుంటాయి. నిషేధం పూర్తయ్యాక ఇందులో దాదాపు 400 బోట్లు వేటకెళ్లాయి. మిగిలినవి వెళ్లే లోగానే అల్పపీడన భయంతో హార్బర్‌లోనే నిలిచిపోయాయి. వాస్తవానికి నిషేధానికి రెండు నెలల ముందు నుంచి చేపలవేట ఆశాజనకంగా లేదు. దీంతో అప్పటికే మత్స్యకారులు బాగా నష్టపోయారు. వేట విరామం తర్వాత చేపల లభ్యత బాగుంటుందన్న ఆశతో వేటకెళ్లారు. ఒకసారి వేటకు వెళ్తే 10 నుంచి 15 రోజుల పాటు సముద్రంలోనే ఉంటారు. ఇందుకు అవసరమైన డీజిల్, ఐస్, నిత్యావసర సరకులు వెరసి రూ.లక్షన్నరకు పైగా పెట్టుబడి పెట్టారు. సముద్రంలో వేట మొదలయ్యే సరికే వాయుగుండం హెచ్చరికలు వెలువడ్డాయి. దీంతో అర్ధంతరంగా వెనక్కి రావడం వల్ల ఒక్కో బోటుకు 300 నుంచి 400 లీటర్ల డీజిల్ వృథాగా ఖర్చయింది. నాలుగైదు టన్నుల ఐస్ కూడా కరిగిపోయింది. చేపలు లభ్యత లేకపోవడంతో రూ.40 నుంచి 50 వేల వరకు నష్టపోయామని బోటు యజమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వాయుగుండం హెచ్చరికలతో వెనక్కి వచ్చేసిన బోట్లు విశాఖ ఫిషింగ్ హార్బర్లో 300కు పైగా ఉన్నాయి. ఇవన్నీ మళ్లీ వేటకు బయల్దేరాలంటే మరో రెండు రోజులైనా పడుతుంది. అప్పుడు కొత్తగా ఐస్, రేషన్ వంటివి అవసరమని, మళ్లీ వాటిని సమకూర్చుకోవడానికి అప్పులు చేయాల్సి వస్తుందని వైశాఖి బోటు ఆపరేటర్ల సంక్షేమ సంఘం అధ్యక్షుడు సీహెచ్.సత్యనారాయణమూర్తి తెలిపారు. -
కష్టాలబాటలో ఆశలవేట
హుదూద్ దెబ్బకు నష్టపోయిన మత్స్యకారులు 20రోజులుగా సాగరానికి దూరం ఇప్పుడిప్పుడే కదులుతున్న బోట్లు రోజుకు స్వల్పస్థాయిలో ఉత్పత్తి పరిహారమందక అప్పులపాలు జలపుత్రుల జీవన గమనంలో అడుగుడుగునా సుడి‘గండా’లే. వాటిని మెల్లగా దాటుకుంటూ బతుకు సయ్యాటలో భాగంగా గంగపుత్రులు మళ్లీ సాగరం బాట పట్టారు. హుదూద్ దెబ్బకు 20 రోజులుగా తీరానికి దూరంగా ఉన్న ఈ బడుగు జీవులు శనివారం నుంచి వేటకు ఉపక్రమించారు. అయినా మెజార్టీ మెకనైజ్డ్ బోట్లు లంగరేయడంతో రోజుకు నాలుగైదు టన్నులకు మించి మత్స్యసంపద దొరకని పరిస్థితి. సాక్షి, విశాఖపట్నం: హుదూద్ దెబ్బకు కకావికలమైన జిల్లా తేరుకుంటున్నా తీరం వెంబడి సముద్రంతో సహజీవనంచేసే మత్స్యకారు లు మాత్రం ఇంకా కుదుట పడలేదు. జిల్లాలోని 11 మండలాల్లో 132 కిలోమీటర్ల తీరం ఉంది. 62 మత్స్యకార గ్రామాల్లోని 30 వేల మంది రోజూ వేటకు వెళతారు. వీరిలో 30శాతం మందికి వేటలేకుంటే పూట గడవదు. సుమారు లక్ష మంది వేట ఆధారంగా జీవిస్తున్నారు. మరో లక్ష మంది పరోక్షంగా అనుబంధ రంగాలపై ఆధారపడి బతుకుతున్నారు. వీరందరికీ హుదూద్ వల్ల ఉపాధి లేకుండా పోయింది. తుఫాన్ వల్ల జిల్లాలో 40కి పైగా మత్స్యకార గ్రామాలు దెబ్బతిన్నాయి. విశాఖ ఫిషింగ్ హార్బర్లో 670 మెకనైజ్డ్ బోట్లుంటే దాదాపు అన్నీ దెబ్బతిన్నాయి. సగానికి పైగా ధ్వంసమైతే మిగిలిన సగం బోట్లకు నష్టం వాటిల్లింది. వలలతో పాటు ఉన్న బోట్స్ 391 కొట్టుకుపోతే, వలలతో ఉన్న మరో 190 బోట్స్‌కు నష్టం వాటిల్లింది. ఇవి కాకుండా మరో 431బోట్స్, మరో 190 వలలు విడివిడిగా కొట్టుకుపోతే..మరో చిన్నా చితకా బోట్లు కలిపి 1301 వరకు దెబ్బ తిన్నాయి. బోట్స్,వలలకు రూ. 24 కోట్ల 61లక్షల 14వేలుగా అంచనా వేశారు. ఇప్పటి వరకు ఒక్క పైసా కూడా పరిహారం అందలేదు. లైవ్లీ హుడ్ కింద ఒక్కొక్కరికి రూ.10వేల చొప్పున ఇస్తామన్న పరిహారం కూడా ఏ ఒక్క మత్స్యకారునికి అందలేదు. దీంతో అప్పులతో బోట్లకు మరమ్మతులు చేసుకుంటున్నారు. స్వల్పంగా నష్టపోయిన బోట్లకు మరమ్మతులు చేయించుకున్న యజమానుల శనివారం నుంచి వేటకు వెళ్లడం మొదలు పెట్టారు. సుమారు 350కు పైగా బోట్లు వేటకు వెళ్లినట్టు అంచనా. నావలు,నాటుపడవలు,చిన్న బోట్లన్నీ తీరంలోనే వేట సాగిస్తున్నాయి. సాధారణ రోజుల్లో ప్రతీరోజు వేట ద్వారా హార్బర్‌కు 150 నుంచి 200 మెట్రిక్ టన్నుల మత్స్యసంపద వచ్చేది. ప్రస్తుతం కేవలం నాలుగైదు టన్నులకు మించి మత్స్య సంపద రావడంలేదు. పైగా ఇదంతా స్థానిక మార్కెట్ల అవసరాలకే ఉపయోగ పడే రకాలేతప్ప ఎగుమతికి ఉపయోగపడే రకం ఒక్క కిలో కూడా దొరకని దుస్థితి. ఒక్కొక్క మెకనైజ్డ్ బోటుపై 8 నుంచి 10 మంది వరకు పనిచేస్తుంటారు. ఈ విధంగా చూస్తే వేటకు వెళ్లిన బోట్లపై సుమారు రెండున్నరవేల మంది ఉపాధి పొందుతుండగా తీరంలో ఎండుచేపలు, పచ్చిచేపల వ్యాపారం చేసే వారు మరో 500 మంది వరకు ఉపాధి లభిస్తోంది. ఫిషింగ్ హార్బర్‌పై ఆధారపడి జీవనం సాగించే వేలాది మత్స్యకారులతో పాటు భీమిలి నుంచి పాయకరావుపేట వరకు తీరం వెంబడి వేటే జీవనాధారంగా బతికే వారుసైతం ఉపాధి లేక అర్ధాకలితో అలమటిస్తున్నారు. పూర్తిస్థాయిలో వేట ఎప్పుడు ప్రారంభమవుతుందా? పూర్వ వైభవం వస్తుందా? అని ఆశగా ఎదురుచూస్తున్నారు. -
బోటుకు చోటేదీ
పాతపోస్టాఫీసు: విశాఖ ఫిషింగ్ హార్బ ర్ సుమారు 24 హెక్టార్ల విస్తీర్ణంలో ఉం ది. రూ.4.26 కోట్లతో 11 జెట్టీలను 1976లో విశాఖపట్నం పోర్టుట్రస్టు నిర్మించింది. 750 మరబోట్లు, 1500 మోటారుబోట్లు,100 మినీ ట్రాలర్లు, భారీ ట్రాలర్లను ఈ 11 జెట్టీల్లోనే కట్టాలి. కానీ పదేళ్ల క్రితం మరమ్మతులకు గురైన 14 ట్రాలర్లను యజమానులు పట్టించుకోకపోవడంతో అవి మునిగిపోయాయి. వాటిని తొలగించాలంటే రూ.లక్షల్లో ఖర్చవుతుందని భావించి అలాగే వదిలేశారు. దీంతో ఇవి 300 మరబోట్లు పట్టే స్థలాన్ని ఆక్రమించాయి. అప్పటి నుంచి జెట్టీల్లో అడుగు చోటు దొరకడమే గగనంగా మారింది. ప్రస్తుతం ఒకబోటు వెనుక మరోబోటును ఇలా నాలుగు వరుసల్లో కట్టుకుంటున్నారు. బోట్లలో డీజిల్, ఐస్, నిత్యావసర వస్తువులు నింపుకునే ందుకు మత్స్యకారులు అవస్థలు పడుతున్నారు. ముందున్న బోట్లను తీస్తే గానీ వెనుకున్న బోట్లు ముందుకు వచ్చి నింపుకోవడం కుదరదు. లేదంటే ముందున్న బోట్లు వేటకెళ్లేంతవరకు ఎదురుచూడాల్సిందే. ఇక బోటు మరమ్మతుకు గురైందంటే.. ఇక అంతే సంగతులు. నీటిలో మునిగిన ట్రాలర్లు పైకి 10 శాతం మాత్రమే కనిపిస్తాయి. మిగిలిన 90 శాతం నీటి అడుగున ఉంటాయి. పదేళ్లుగా అవి నీళ్లలో ఉండడంతో బాగా తుప్పుపట్టి ప్రమాదకరంగా తయారయ్యాయి. మరబోట్లకు చిన్న ఇనుపముక్క తగిలినా నష్టం భారీగా ఉంటుంది. పనుల కోసం మత్స్యకారులు నీళ్లలోకి దిగితే వీటి వల్ల ప్రమాదానికి గురయ్యే అవకాశాలున్నాయి. మునిగిన ట్రాలర్ల వల్ల చాలా కష్టాలు పడుతున్నామని, వాటిని తొలగించాలని చాలా కాలంగా పోర్టు అధికారులను మత్స్యకారులను కోరుతూనే ఉన్నారు. మునిగిన ట్రాలర్లను తొలగించాలి మునిగిన 14 ట్రాలర్లతో చాలా ఇబ్బందులు పడుతున్నాం. హార్బర్లో 300 మరబోట్లు పట్టేంత స్థలాన్ని ఇవి ఆక్రమించాయి. మరబోట్లు పెట్టుకోవడానికి స్థలం కరువైంది. నాలుగు వరుసల్లో బోట్లను కట్టుకుంటున్నాం. ఒక మరబోటు తయారీకి రూ.20 లక్షల నుంచి రూ.25 లక్షల వరకు ఖర్చవుతుంది. మునిగి తుప్పుపట్టిన ట్రాలర్లు మరబోటుకు తగిలితే చాలా నష్టం కలుగుతుంది. నీటి అడుగు భాగా నికి వెళ్లినప్పుడు తుప్పు వ స్తువులు తగిలి మత్స్యకా రు లు ప్రమాదాలకు గురవు తున్నారు. వీటిని వెంటనే తొల గించి మా కష్టాలు తొలగిం చాలి. - బర్రి కొండబాబు, కోస్టల్ మరపడవల సంఘం అధ్యక్షుడు -
విరామానికి ముందే ఫుల్స్టాప్!
చేపలకు కరువే కారణం ఎగుమతి కేంద్రాలూ మూత మత్స్యకారుల కలత విశాఖపట్నం, న్యూస్‌లైన్: మత్స్యకారులకు చేపల వేట నష్టాల బాటగా మారింది. తూర్పు తీరంలో చేపలకు కరువొచ్చి పడింది. ప్రాణాలొడ్డి నెలల తరబడి సంద్రంలో కష్టపడినా వారికి చేపల జాడే లేకుండా పోయింది. ఫలితంగా ఒక దఫా వేటకు రూ.20-30 వేల వరకు నష్టాలు మూటగట్టుకుంటున్నారు. మునుపెన్నడూ లేనంతగా ప్రస్తుత పరిస్థితులను చూసి మత్స్యకారులు, బోటు ఓనర్లు, మత్స్య కార్మికులు తీవ్రంగా కలత చెందుతున్నారు. ఏటా ఏప్రిల్ 15 నుంచి 47 రోజుల పాటు చేపల వేటపై నిషేధం అమలవుతుంది. కానీ నిషేధం అమలుకు సుమారు నెలన్నర రోజుల ముందు నుంచే చేపల లభ్యత క్షీణించడం మొదలైంది. రానురాను మరింత దిగజారడంతో వేట గిట్టుబాటు కావడం లేదు. దీంతో గత్యంతరం లేక, నష్టాలను భరించలేక కొద్ది రోజుల నుంచి చేపల వేట మానేసి బోట్లను హార్బర్లో జట్టీలకే పరిమితం చేశారు. ఇప్పుడు విశాఖ ఫిషింగ్ హార్బర్ మరబోట్లతో నిండి ఉంది. విశాఖ నుంచి వేటకెళ్లే మరబోట్లు 750, 1500 వరకూ మోటారు బోట్లు వేట సాగిస్తుంటాయి. వీటిలో 90 శాతానికి పైగా బోట్లు వేటకు ఫుల్స్టాప్ పెట్టేసి హార్బర్లో విశ్రాంతి తీసుకుంటున్నాయి. వాస్తవానికి నెలన్నర రోజుల వేట విరామానికే మత్స్యకారులు కుటుం పోషణ సాగక అల్లాడుతుంటారు. అలాంటిది రెండు నెలలకు పైగానే చేపల వేట మానుకోవలసిన పరిస్థితి తలెత్తడంతో వీరు ఆందోళన చెందుతున్నారు. మరోవైపు చేపల్లేకపోవడంతో హార్బర్లోని ఎగుమతి కేంద్రాలు కళతప్పాయి. విశాఖ హార్బర్లో పెద్ద ఎగుమతి కేంద్రాలు 24, చిన్నవి వందకు పైగా ఉన్నాయి. వీటిలో ఒక్కటంటే ఒక్కటే పెద్ద కేంద్రం పనిచేస్తుండగా, చిన్న ఎగుమతి కేంద్రాలు అర డజను మాత్రమే తెరచి ఉన్నాయి. ఫలితంగా వేట నిలిచిపోవడంతో చేపలు లేక, ఎగుమతి కేంద్రాలు తెరచుకోక ఫిషింగ్ హార్బర్ బోసిపోయింది. అలాగే హోల్‌సేల్, రిటైల్ చేపల మార్కెట్లలో కూడా అమ్మకాలు, కొనుగోళ్లు సన్నగిల్లాయి. మత్స్యకారులు వేటకు స్వస్తి చెప్పి ఇంజన్లు, వలలు, ప్రొపెల్లర్లను బోట్ల నుంచి తీసి ఇంటికి పట్టుకుపోతున్నారు. ఈ ఏడాది సుమారు రెండు నెలల పాటు తమకు గడ్డుకాలమేనని వాపోతున్నారు. సంక్రాంతి నుంచి ఇంతే.. సంక్రాంతి నుంచి చేపలవేట ఆశాజనకంగా లేదు. నెలల తరబడి వేట సాగించినా చేపలు పడడం లేదు. 30 శాతం బోట్లు వేటకెళితే అందులో మూడొంతులు బోట్లకు నష్టాలే వస్తున్నాయి. దీంతో బోటు ఓనర్లు సాహసం చేయలేకపోతున్నారు. బోట్లను హార్బర్‌కే పరిమితం చేస్తున్నారు. - పి.సి.అప్పారావు, అధ్యక్షుడు, ఏపీ మరపడవల సంఘం


