డాబాగార్డెన్స్: వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని నగరంలో గెడ్డలు, కాలువలు పొంగిపొర్లకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని జీవీఎంసీ కమిషనర్ కేతన్‌గార్గ్ అధికారులను ఆదేశించారు. మంగళవారం జీవీఎంసీ ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన ప్రజా ఆరోగ్యశాఖ సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు. నగరంలో చెత్త వేసే పాయింట్లను శాశ్వతంగా తొలగించి గ్రీన్ స్పాట్లుగా మార్చాలని, బహిరంగంగా చెత్త వేసే వారిపై జరిమానాలు విధించాలని స్పష్టం చేశారు. ఇంటింటి చెత్త సేకరణలో అలసత్వం వహిస్తే చర్యలు ఉంటాయని హెచ్చరించారు. అలాగే వీధికుక్కల నియంత్రణకు జోన్ల వారీగా సర్వే జరపాలని, రోడ్లు అపరిశుభ్రం కాకుండా ప్రతి ఆటోలో చిన్న డస్ట్‌బిన్ ఏర్పాటు చేసుకునేలా అవగాహన కల్పించాలని ఆదేశించారు. సమావేశంలో అదనపు కమిషనర్ పి.నల్లనయ్య, వైద్యాధికారులు పాల్గొన్నారు.


