డాబాగార్డెన్స్: విశాఖ దక్షిణ నియోజకవర్గంలోని 30వ వార్డులో జనసేన పార్టీకి చెందిన సుమారు 100 కుటుంబాలు బుధవారం వైఎస్సార్‌సీపీలో చేరాయి. పార్టీ వార్డు అధ్యక్షుడు దశమంతుల మాణిక్యాలరావు నేతృత్వంలో, వార్డు మహిళా అధ్యక్షురాలు దశమంతుల సంతోషి ఆధ్వర్యంలో వారు పార్టీలో చేరారు. మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్‌సీపీ దక్షిణ నియోజకవర్గ సమన్వయకర్త వాసుపల్లి గణేష్‌కుమార్ వారికి పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు. ఈ సందర్భంగా వాసుపల్లి మాట్లాడుతూ ప్రజా సమస్యలపై ప్రశ్నిస్తానని చెప్పిన పవన్‌కల్యాణ్ చివరకు చంద్రబాబు వెంట నడుస్తూ జనసేన కార్యకర్తలకు, నాయకులకు కూడా భరోసా ఇవ్వలేని పరిస్థితికి చేరుకున్నారని విమర్శించారు. కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది దాటినా ప్రజలకు ఇచ్చిన హామీలు, ’సూపర్ సిక్స్’ పథకాలను అమలు చేయడంలో విఫలమైందని ఆరోపించారు. 30వ వార్డులోని కోడిపంద్యాల వీధి ప్రాంతంలో గతంలో ద్విచక్రవాహనం కూడా వెళ్లలేని పరిస్థితి ఉండేదని, వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో రహదారులను విస్తరించి అంబులెన్స్ వెళ్లేలా అభివృద్ధి చేశామని గుర్తుచేశారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు దశమంతుల చిన్ని, లండా రమణ, వడ్డాది దిలీప్, దశమంతుల రామలక్ష్మి, కోన శంకర్, తాడి రవితేజ, సువార్త రాజు, లీలా కృష్ణ, వాసుపల్లి బంగారమ్మ, ఆకుల శ్యామ్, వీటీ కృష్ణ, సూరిని రాము, ముత్తాబత్తుల రమేష్, ఎర్నిమ్మ తదితరులు పాల్గొన్నారు.


