మహారాణిపేట: జిల్లాలోని వివిధ వసతి గృహాలకు చెందిన దివ్యాంగ చిన్నారులతో కలిసి కలెక్టర్ ఎం.ఎన్.హరేందిర ప్రసాద్ ఆత్మీయ విందు నిర్వహించారు. దివ్యాంగ శక్తి పథకం ప్రారంభోత్సవాన్ని పురస్కరించుకుని బుధవారం కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాలులో ఈ విందు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ చిన్నారులతో కలిసి భోజనం చేస్తూ వారితో ఆప్యాయంగా ముచ్చటించారు. వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకుంటూనే.. చదువు, ఆరోగ్యం, భవిష్యత్తు లక్ష్యాల గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ విందులో సాగర్ నగర్ అంధుల ఆశ్రమ పాఠశాలకు చెందిన అంధ విద్యార్థులు, పెదజాలారిపేట బీసీ వసతి గృహానికి చెందిన బధిర విద్యార్థులు పాల్గొన్నారు. వీరికి వివిధ రకాల వంటకాలతో భోజనం వడ్డించారు. ఈ సందర్భంగా ఆశ్రమ పాఠశాల చిన్నారులు చేసిన గీతాలాపన అందరినీ ఆకట్టుకుంది. వారి ప్రతిభకు ముగ్ధులైన కలెక్టర్, ఇతర అధికారులు కరతాళ ధ్వనులతో చిన్నారులను అభినందించారు. విభిన్న ప్రతిభావంతుల శాఖ ఏడీ కె. కవిత, వసతి గృహాల నిర్వాహకులు, కలెక్టరేట్ ఏవో బీవీ రాణి తదితరులు పాల్గొన్నారు.


