ఫార్మసీ.. ౖపైరవీ! | - | Sakshi
Sakshi News home page

ఫార్మసీ.. ౖపైరవీ!

Mar 19 2026 7:27 AM | Updated on Mar 19 2026 7:27 AM

11 ఫార్మసీ పోస్టులకు 583 దరఖాస్తులు పోస్టుల కోసం ఎమ్మెల్యేలు, మంత్రుల పీఏల ఒత్తిళ్లు తమను కలవమంటూ నిరుద్యోగ అభ్యర్థులకు ఫోన్లు పోస్టుకు రూ.3 నుంచి రూ.5 లక్షలు డిమాండ్‌

మహారాణిపేట: ఉత్తరాంధ్ర జిల్లాల్లో వైద్య ఆరోగ్య శాఖ పరిధిలోని ఫార్మసీ పోస్టుల భర్తీ ప్రక్రియలోకి దళారులు ప్రవేశించారు. కేవలం 11 పోస్టులు మాత్రమే ఖాళీగా ఉండటం, వాటికి వందల సంఖ్యలో నిరుద్యోగులు పోటీ పడుతుండటంతో అక్రమార్కులు దీన్ని తమకు అనుకూలంగా మలచుకుంటున్నారు. అధికార పార్టీ నేతల పేరుతో కొందరు, ప్రజాప్రతినిధుల పీఏల పేరుతో మరికొందరు సిఫార్సులు, బెదిరింపులకు దిగుతుండటంతో అధికారులకు తలనొప్పిగా మారింది. ఒక్కో పోస్టుకు లక్షల్లో డిమాండ్‌ చేస్తూ దళారులు బేరసారాలకు దిగుతున్న నేపథ్యంలో, ఈ నియామకాలు పూర్తిగా పారదర్శకంగా జరుగుతాయని, ఎవరినీ నమ్మి మోసపోవద్దని వైద్య ఆరోగ్య శాఖ ప్రాంతీయ సంచాలకురాలు డాక్టర్‌ రాధారాణి స్పష్టం చేశారు.

అధికారులపై పీఏల ఒత్తిళ్లు

తుది ఎంపిక జాబితా విడుదలకు సమయం దగ్గరపడుతుండటంతో దళారులు నేరుగా రంగంలోకి దిగారు. ‘హలో మేము వైద్య ఆరోగ్య శాఖ ప్రాంతీయ కార్యాలయం నుంచి మాట్లాడుతున్నాం. మీరు ఫార్మసీ పోస్టుకు దరఖాస్తు చేసుకున్నారా? మీకు ఆ పోస్టు కావాలంటే డబ్బులు ఇవ్వాలి’అంటూ దరఖాస్తుదారులకు ఫోన్లు చేసి, పోస్టింగ్‌ ఇప్పిస్తామని నమ్మిస్తున్నారు. ఇందుకు గాను ఒక్కో పోస్టుకు రూ.3 లక్షల నుంచి రూ.5 లక్షల వరకు డిమాండ్‌ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ వ్యవహారంలో కొందరు కూటమి నేతలు సైతం భారీగా బేరసారాలకు దిగి, ఈ పోస్టులను ఆదాయ వనరులుగా మార్చుకున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. మరోవైపు అధికారులపై రాజకీయ ఒత్తిళ్లు కూడా తీవ్రమయ్యాయి. ఈ పోస్టులను తమ సిఫార్సు చేసిన వారికే కట్టబెట్టాలంటూ కొందరు ఎమ్మెల్యేలు, మంత్రుల వ్యక్తిగత సహాయకులు ఆర్డీకి వరుస ఫోన్లు చేస్తున్నట్లు సమాచారం. ఏకంగా సిఫార్సు లేఖలు పంపిస్తూ ఒత్తిడి తెస్తున్నారు. ఒక పక్క దరఖాస్తుల పరిశీలనలో బిజీగా ఉన్న అధికారులకు ఈ ఫోన్‌ కాల్స్‌, సిఫార్సుల తాకిడి ఇబ్బందిగా మారింది.

దళారులను నమ్మి మోసపోవద్దు

పోస్టుల భర్తీ ప్రక్రియ దాదాపు తుది దశకు చేరుకుంది. త్వరలోనే ఫైనల్‌ మెరిట్‌ జాబితాను విడుదల చేస్తాం. నియామకాలన్నీ కేవలం అర్హత ప్రమాణాలు, మెరిట్‌, రోస్టర్‌ విధానం ఆధారంగానే పారదర్శకంగా జరుగుతున్నాయి. దళారుల మాయమాటలు నమ్మి నిరుద్యోగులు ఎవరూ వారికి డబ్బులు ఇచ్చి మోసపోవద్దు. పైరవీలకు ఇక్కడ ఎలాంటి తావులేదు.

– డాక్టర్‌ రాధారాణి, ఆర్డీ, వైద్య ఆరోగ్యశాఖ

పోస్టులు తక్కువ.. పోటీ ఎక్కువ!

ఉమ్మడి ఉత్తరాంధ్ర పరిధిలోని శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, విశాఖపట్నం, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లోని ప్రాథమిక, పట్టణ ఆరోగ్య కేంద్రాలతో పాటు కమ్యూనిటీ హెల్త్‌ సెంటర్లలో 11 ఫార్మసీ గ్రేడ్‌–2 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వీటిని ఏడాది కాల వ్యవధికి కాంట్రాక్ట్‌ ప్రాతిపదికన భర్తీ చేసేందుకు వైద్య ఆరోగ్య శాఖ ప్రాంతీయ డైరెక్టర్‌(ఆర్డీ) కార్యాలయం ఇటీవల దరఖాస్తులు ఆహ్వానించింది. ఈ 11 పోస్టుల కోసం ఏకంగా 583 మంది నిరుద్యోగులు దరఖాస్తు చేసుకున్నారు. ఇప్పటికే మెరిట్‌ జాబితాను కూడా అధికారులు విడుదల చేశారు. అయితే, తీవ్రమైన పోటీ ఉండటంతో పోస్టింగ్‌ ఎలాగైనా సాధించాలనే అభ్యర్థుల ఆరాటాన్ని దళారులు, కొందరు రాజకీయ నేతలు క్యాష్‌ చేసుకునే పనిలో పడ్డారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement