మద్దిలపాలెం: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రపంచవ్యాప్తంగా సరికొత్త ఉద్యోగ అవకాశాలను సృష్టిస్తోందని, వీటిని అందుకోవడానికి విద్యార్థులకు నైపుణ్యం ఎంతో అవసరమని సైయంట్ వ్యవస్థాపక చైర్మన్, పద్మశ్రీ అవార్డు గ్రమీత బి.వి.ఆర్. మోహన్‌రెడ్డి అన్నారు. ఆంధ్ర విశ్వవిద్యాలయం శతాబ్ది ఉత్సవాల్లో భాగంగా బీచ్‌రోడ్డులోని ఏయూ కన్వెన్షన్ సెంటర్ వేదికగా ఏయూ–ఏఐసీటీఈ–సైయంట్ సంయుక్తంగా నిర్వహిస్తున్న ఇన్‌స్టిట్యూట్–ఇండస్ట్రీ–ఇన్వెస్టర్స్ కాన్‌క్లేవ్‌ను బుధవారం ఆయన ప్రారంభించి, కీలకోపన్యాసం చేశారు. ప్రస్తుతం స్టార్టప్ సంస్థలు ఉపాధి కల్పనలో కీలక పాత్ర పోషిస్తున్నాయని, 60 శాతానికి పైగా ఉద్యోగ అవకాశాలు వీటి ద్వారానే లభిస్తున్నాయని తెలిపారు. స్టార్టప్‌లు పరిమాణంలో చిన్నవిగా ఉన్నప్పటికీ, వాటిలో వినూత్న ఆలోచనలు ఎక్కువగా ఉంటాయన్నారు. విశాఖపట్నం సిటీ ఇన్నోవేషన్ క్లస్టర్ ద్వారా ఆలోచన దశ నుంచి ఉత్పత్తి దశ వరకు ఉన్న అంతరాన్ని తగ్గించడానికి ఈ వేదిక దోహదపడుతుందని ఆకాంక్షించారు. వందేళ్ల చరిత్ర కలిగిన ఆంధ్ర విశ్వవిద్యాలయంలో భాగస్వాములు కావడం ఇక్కడి విద్యార్థుల అదృష్టమని, రాబోయే వందేళ్లలో ఈ యూనివర్సిటీ దేశానికి, ప్రపంచానికి గొప్ప భవిష్యత్తును అందిస్తుందని కొనియాడారు.
త్వరలో ఎఫ్‌డీపీ: ఏయూ వీసీ
ఏయూ ఉపకులపతి ఆచార్య జి.పి.రాజశేఖర్ మాట్లాడుతూ.. సైయంట్ సంస్థతో కలిసి త్వరలో ఇన్నోవేషన్ రంగంలో ఫ్యాకల్టీ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్(ఎఫ్‌డీపీ) నిర్వహిస్తామని ప్రకటించారు. రూసా నిధుల ద్వారా మౌలిక వసతుల కల్పన, స్టార్టప్‌ల అభివృద్ధికి ప్రత్యేక కృషి చేస్తున్నామని, ఏయూలోని ఏ–హబ్‌తో కలిసి పనిచేయడానికి 30కి పైగా స్టార్టప్‌లు సిద్ధంగా ఉన్నాయని వెల్లడించారు. ఏఐసీటీఈ ఇన్నోవేషన్ సెల్ అసిస్టెంట్ డైరెక్టర్ డాక్టర్ దీపన్ సాహు మాట్లాడుతూ.. గత ఆరు నెలల్లో విశాఖ సిటీ ఇన్నోవేషన్ క్లస్టర్ సాధించిన ప్రగతిని వివరించారు. ఈ సందర్భంగా అతిథుల చేతుల మీదుగా ప్రత్యేక నివేదికలను ఆవిష్కరించారు. అనంతరం విద్యార్థులు, స్టార్టప్ సంస్థలు ఏర్పాటు చేసిన సాంకేతిక ప్రదర్శనను అతిథులు తిలకించి, యువ ఆవిష్కర్తలను అభినందించారు. ఈ కార్యక్రమంలో ఐఐసీ అధ్యక్షుడు ఆచార్య జి.ఎం.జె. రాజు, క్లస్టర్ కోఆర్డినేటర్ ఆచార్య కె. రమాసుధ, కన్వీనర్ ఆచార్య డి. లలిత భాస్కరి, సైయంట్ సంస్థ ఉన్నతాధికారి పి.ఎన్.ఎస్.వి.నరసింహం తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమం ముగిసిన అనంతరం ఉపకులపతి తన కార్యాలయంలో బి.వి.ఆర్.మోహన్ రెడ్డిని ఘనంగా సత్కరించి, ఏయూ జ్ఞాపికను అందజేశారు.


