మత్స్యకారుల ప్రాణదాత ట్రాన్స్‌పాండర్‌ | - | Sakshi
Sakshi News home page

మత్స్యకారుల ప్రాణదాత ట్రాన్స్‌పాండర్‌

Mar 19 2026 7:27 AM | Updated on Mar 19 2026 7:27 AM

● సముద్రంలో చిక్కుకున్న బోటు సురక్షితం ● ప్రాణాలతో బయటపడ్డ గంగపుత్రులు

మహారాణిపేట: సముద్రంలో వేట సాగిస్తుండగా ప్రమాదంలో చిక్కుకున్న బోటును గుర్తించడంలో ట్రాన్స్‌పాండర్‌ పరికరం కీలక పాత్ర పోషించింది. ఈ పరికరం అందించిన సమాచారంతో ఇండియన్‌ కోస్ట్‌ గార్డ్‌ సిబ్బంది సకాలంలో స్పందించి, బోటుతో పాటు అందులోని ఆరుగురు మత్స్యకారులను సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు. వివరాలివి.. ఈ నెల 5న ఫిషింగ్‌ హార్బర్‌ నుంచి ఎం.ఎం.108 నంబర్‌ గల బోటు వేట కోసం సముద్రంలోకి వెళ్లింది. 12వ తేదీన తీరం నుంచి సుమారు 300 కిలోమీటర్ల దూరంలో వేట సాగిస్తుండగా, బోటు ఇంజిన్‌ అకస్మాత్తుగా పాడైపోయింది. నడి సముద్రంలో సాంకేతిక సమస్య తలెత్తడంతో బోటులోని శ్రీలంకకు చెందిన నలుగురు, విశాఖకు చెందిన ఇద్దరు మత్స్యకారులు ఆందోళనకు గురయ్యారు. ప్రాణభయంతో తమను కాపాడాలని బోటు యజమాని బి.రాజుకు సమాచారం అందించారు. వెంటనే స్పందించిన యజమాని.. మత్స్యశాఖ జేడీ లక్ష్మణరావు ద్వారా కలెక్టర్‌ ఎం.ఎన్‌.హరేందిర ప్రసాద్‌ను సహాయం కోరారు. కలెక్టర్‌ ఆదేశాల మేరకు ఇండియన్‌ కోస్ట్‌ గార్డ్‌ రంగంలోకి దిగింది. అయితే, ఇటీవల ప్రధాన మంత్రి మత్స్య సంపద యోజన పథకం ద్వారా ఆ బోటుకు ట్రాన్స్‌పాండర్‌ పరికరాన్ని అమర్చారు. ఆ పరికరం పంపిన సిగ్నల్స్‌ ఆధారంగా మ త్స్యశాఖ అధికారులు బోటు ఉన్న ప్రాంతాన్ని గుర్తించి కోస్ట్‌ గార్డ్‌కు సమాచారం ఇచ్చారు. దీంతో కోస్ట్‌ గార్డ్‌ నౌక గాలింపు చర్యలు చేపట్టి, బుధవారం తెల్లవారుజామున 4 గంటలకు బోటును గుర్తించింది. సిబ్బందిని సురక్షితంగా రక్షించి ఫిషింగ్‌ హార్బర్‌కు తీసుకొచ్చి మత్స్యశాఖ జేడీ లక్ష్మణరావుకు అప్పగించారు. ఈ సందర్భంగా బోటు యజమాని బి.రాజు మాట్లాడుతూ.. ట్రాన్స్‌పాండర్‌ ఉండటం వల్లే తన బోటు, సిబ్బంది ప్రాణాలతో తిరిగి రాగలిగారని హర్షం వ్యక్తం చేశారు. మత్స్యకారులందరూ తప్పనిసరిగా తమ బోట్లకు ఈ పరికరాన్ని అమర్చుకోవాలని కోరారు. తమను ఆదుకున్న కలెక్టర్‌, కోస్ట్‌ గార్డ్‌, మత్స్యశాఖ అధికారులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement