సాక్షి, విశాఖపట్నం: నేషనల్ డిఫెన్స్ కాలేజీ(ఎన్‌డీసీ)కి చెందిన 16 మంది సభ్యులతో కూడిన ఫ్యాకల్టీ, కోర్సు సభ్యుల బృందం బుధవారం విశాఖపట్నం పోర్టు అథారిటీ (వీపీఏ)ని సందర్శించింది. ఈ బృందానికి పోర్టు డిప్యూటీ చైర్‌పర్సన్ రోష్ని అపరంజి కొరాటి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా పోర్టులోని మౌలిక సదుపాయాలు, కార్గో నిర్వహణ సామర్థ్యం, ఆధునికీకరణ, యాంత్రీకరణ పనులపై ఆమె పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. అలాగే కవర్డ్ స్టోరేజీ సదుపాయాలు, సౌర శక్తి వినియోగం, పారిశ్రామిక అవసరాల కోసం నిర్వహిస్తున్న ఎస్‌టీపీ ప్లాంట్, క్రూయిజ్ టెర్మినల్ వంటి కీలక అంశాలను ఎన్‌డీసీ బృందానికి వివరించారు. పోర్టు చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలు అద్భుతంగా ఉన్నాయని డిఫెన్స్ కాలేజీ బృందం అభినందించింది. కార్యక్రమంలో పోర్టు కార్యదర్శి ఎం.శంకర బాబు, చీఫ్ ఇంజినీర్ శ్రీరామచంద్రమూర్తి, చీఫ్ మెకానికల్ ఇంజినీర్ రామ్ ప్రసాద్, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
ఎన్‌డీసీ బృందం ప్రశంస


