సింహాచలం: ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని గురువారం సింహగిరిపై శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామి వారి పెళ్లిరాట ఉత్సవం వైభవంగా జరగనుంది. ఈ మేరకు ఆలయ అర్చకులు, అధికారులు ఘనంగా ఏర్పాట్లు చేశారు. శ్రీ పరాభవనామ సంవత్సర ప్రారంభం సందర్భంగా ఉదయం స్వామికి విశేష అర్చనలు నిర్వహించి, ఉగాది పచ్చడిని నివేదిస్తారు. అనంతరం భక్తులకు పచ్చడి ప్రసాదాన్ని పంపిణీ చేస్తారు. మధ్యాహ్నం 2.30 గంటలకు ఆలయ స్థానమండపంలో స్వామి వారి ఉత్సవమూర్తులను వేంజేపు చేసి, విష్వక్సేన పూజ, పుణ్యాహవాచనం నిర్వహిస్తారు. మధ్యాహ్నం 3 నుంచి 3.30 గంటల వరకు ప్రధాన అర్చకులచే పంచాంగ శ్రవణం ఉంటుంది. అనంతరం 3.30 నుంచి 4.30 గంటల వరకు పెళ్లిరాట ఉత్సవం నిర్వహిస్తారు. ఈ నెల 29న (చైత్ర శుద్ధ ఏకాదశి) జరగనున్న స్వామి వారి వార్షిక కల్యాణోత్సవానికి చిహ్నంగా ఆలయ ఉత్తర ద్వారం, రాజగోపురం, కల్యాణ ప్రాంగణాల వద్ద పెళ్లిరాటలు వేస్తారు. ఈ సందర్భంగా పండితులకు సత్కారాలు, దాతలకు విశిష్ట సేవా పురస్కారాలు అందజేస్తారు. అనంతరం సింహగిరి మాడవీధుల్లో స్వామివారి తిరువీధి ఉత్సవం జరుగుతుంది. కాగా, ఏటా ఉగాది రోజు సాయంత్రం స్వామి వారి మూలవిరాట్‌ను సూర్యకిరణాలు తాకడం ఇక్కడి విశేషం. ఈ అద్భుత దృశ్యాన్ని దర్శించుకోవడానికి భక్తులు భారీగా తరలివచ్చే అవకాశం ఉంది. భక్తులందరూ ఈ వేడుకల్లో పాల్గొని స్వామి వారి కృపకు పాత్రులు కావాలని దేవస్థానం ఈవో జల్లేపల్లి వెంకటరావు కోరారు.
సాయంత్రం స్వామిని తాకనున్న సూర్యకిరణాలు


