కకావికలం | - | Sakshi
Sakshi News home page

కకావికలం

Mar 18 2026 7:34 AM | Updated on Mar 18 2026 7:34 AM

● కడలిపై కదన ప్రభావం
సముద్ర వాణిజ్యం

సాక్షి, విశాఖపట్నం: పశ్చిమాసియా దేశాల్లో యుద్ధం ప్రపంచదేశాల సరఫరా గొలుసు (సప్లయ్‌ చైన్‌)ను ఛిన్నాభిన్నం చేస్తోంది. ముఖ్యంగా భారత్‌ నుంచి యూరప్‌, అమెరికా దేశాలకు వెళ్లే సరుకు రవాణాపై ఇది పెనుప్రభావం చూపుతోంది. భారత్‌ నుంచి యూరప్‌ దేశాల ఎగుమతులకు ట్రాన్షిప్‌మెంట్‌ హబ్‌గా వ్యవహరించే దుబాయ్‌లో యుద్ధప్రభావం తీవ్రంగా ఉండటంతో.. పదిరోజుల్లోనే వెయ్యికిపైగా రిఫ్రిజిరేటర్‌ కంటైనర్ల ఎగుమతులు నిలిచిపోయాయి. ఈస్ట్‌కోస్ట్‌ పోర్టుల నుంచి మిడిల్‌ ఈస్ట్‌ దేశాలకు వెళ్లిన కంటైనర్‌ షిప్‌లన్నీ తిరుగుముఖం పట్టాయి. వీటిలో ఎక్కువ షిప్‌లను కేరళలోని విజింజం అంతర్జాతీయ పోర్టుకు మళ్లించారు. ఇక్కడ నిండిపోయిన తర్వాత చైన్నెలోని కట్టుపల్లికి తరలించనున్నారు. తర్వాత విశాఖ కంటైనర్‌ టెర్మినల్‌ని ప్రత్యామ్నాయ స్థావరంగా ఎంపిక చేశారు. మరోవైపు యుద్ధప్రభావంతో పశ్చిమతీరం నుంచి కూడా సరుకు ఎగుమతులు మందకొడిగా సాగుతున్నాయి. భారత తూర్పుతీరానికి గేట్‌వేగా ఉన్న విశాఖపట్నం కంటైనర్‌ టెర్మినల్‌ (వీసీటీపీఎల్‌) సాధారణంగా నెలకు 50 వేల నుంచి 60 వేల టీఈయూ (ట్వంటీ–ఫుట్‌ ఈక్వలెంట్‌ యూనిట్‌) సామర్థ్యం ఉన్న కంటైనర్ల హ్యాండ్లింగ్‌ జరుగుతుంటుంది. తాజా పరిస్థితుల కారణంగా యూరప్‌కు వెళ్లే సరుకు రవాణాలో 15 నుంచి 20 శాతం మేర మందగమనం కనిపిస్తోంది. డొమెస్టిక్‌ కంటైనర్ల హ్యాండ్లింగ్‌ దాదాపు నిలిచిపోయింది. భారత్‌ నుంచి యూఏఈలోని ఏడుదేశాలకు సరకు హ్యాండ్లింగ్‌ జరుగుతుంటుంది. విశాఖ నుంచి ఇప్పటికే బయలుదేరిన షిప్‌లు వెనక్కి వచ్చేస్తున్నాయి. విశాఖ నుంచి రోజుకు 600 చొప్పున 10 రోజుల్లో ఆరువేల కంటైనర్లతో కూడిన నౌకలు బయలుదేరాయి. ఇందులో 1,500కి పైగా కంటైనర్లు సీ ఫుడ్‌తో ఉన్నాయి. ఒడిశా నుంచి వచ్చిన మినరల్స్‌ ఫెర్రో, మాంగనీస్‌ లోడుతో వంద కంటైనర్లు, ఫార్మ కంటైనర్లు 50, ఫార్మా ట్యాంక్‌ కెమికల్‌ కంటైనర్లు 50 కూడా తిరుగుముఖం పట్టాయి.

సముద్రజలాల్లో నిలిపివేత

యుద్ధ ప్రభావం వల్ల భారత్‌ నుంచి బయలుదేరిన 37 కార్గో కంటైనర్‌షిప్‌లు ప్రస్తుతం హార్మూజ్‌ జలసంధి సమీపంలో సముద్రంలోనే నిలిచిపోయాయి. కొన్ని షిప్పింగ్‌లైన్లు తమ కంటైనర్లని యూఏఈలోని ఖోర్‌ఫక్కన్‌, ఫుజైరా పోర్టుల్లో దిగుమతి చేసుకుంటున్నాయి. అక్కడి నుంచి రోడ్డు మార్గాన దుబాయ్‌లోని జెబెల్‌ అలీ పోర్టుకు తరలించే ప్రయత్నాలు చేస్తున్నాయి. మరోవైపు ముంబై పోర్టులో ఎగుమతికి సిద్ధంగా ఉన్న ఐదువేల కంటైనర్లు నిలిచిపోయాయి. ముంద్రా, కాండ్లా పోర్టుల్లో రెండువేలు, వైజాగ్‌లో వెయ్యి కంటైనర్లు నిలిచిపోయాయి. మన దేశంలోని వివిధ పోర్టుల నుంచి ప్రతినెల 3,500కు పైగా రిఫ్రిజిరేటర్‌ కంటైనర్లలో సముద్ర ఉత్పత్తులు, పండ్లు, ఫార్మా ఉత్పత్తులు ఎగుమతి అయ్యేవి. ఇప్పుడు అవన్నీ నిలిచిపోయాయి. యుద్ధం భారతీయ పోర్టులపై తీవ్ర ప్రభావం చూపిస్తోంది.

సముద్రదారులన్నీ కేరళ వైపు

ఈస్ట్‌కోస్ట్‌ కంటైనర్లన్నీ విజింజం పోర్టులోనే నిలుపుదల

భారత తూర్పుతీరం నుంచి తగ్గిపోయిన ఎగుమతులు

పశ్చిమతీరం నుంచి మందకొడిగా నడుస్తున్న కంటైనర్‌ షిప్‌లు

మిడిల్‌ ఈస్ట్‌ దేశాలకు వెళ్లే రిఫ్రిజిరేటర్‌ కంటైనర్ల నిలిపివేత

పది రోజుల్లో ఆగిపోయిన వెయ్యి కంటైనర్లు

హార్మూజ్‌ జలసంధి సమీపంలో నిలిచిపోయిన 37 కార్గో షిప్స్‌

భారత తూర్పుతీరం నుంచి దుబాయ్‌ మీదుగానే యూరప్‌కు ఎగుమతులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement