మద్దిలపాలెం: సంగీతం మానసిక ప్రశాంతతకు దివ్యౌషధమని కలెక్టర్ ఎం.ఎన్.హరేందిర ప్రసాద్ అన్నారు. ఆంధ్ర విశ్వవిద్యాలయం శతాబ్ది ఉత్సవాల్లో భాగంగా.. ఏయూ సంగీత, నృత్య విభాగం ఆధ్వర్యంలో బీచ్ రోడ్డులో కన్వెన్షన్ సెంటర్‌లో నిర్వహించిన శతాబ్ది కళా ఉత్సవం కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించి మాట్లాడారు. విద్యార్థులు సాధించే ప్రగతి, వారి ప్రవర్తనే విశ్వవిద్యాలయ గౌరవాన్ని పెంచుతాయని, ఏయూ విద్యార్థులు వర్సిటీకి బ్రాండ్ అంబాసిడర్లుగా నిలవాలని ఆకాంక్షించారు. ప్రతి వ్యక్తి జీవితంలో సంగీతం, నృత్యం అంతర్భాగం కావాలని సూచించిన ఆయన, వర్సిటీ అభివృద్ధికి పునాదులు వేసిన మహనీయులను ఈ సందర్భంగా స్మరించుకోవాలన్నారు. ఏయూ మరో వెయ్యేళ్ల పాటు తన సేవలను దిగ్విజయంగా అందించేలా నేటి తరం బలమైన పునాదులు వేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో భాగంగా విశిష్ట అతిథి, శతాధిక వృద్ధుడు, ప్రముఖ సంగీత విద్వాంసులు పద్మశ్రీ అవార్డు గ్రహీత అన్నవరపు రామస్వామిని, వర్సిటీ తరపున జ్ఞాపిక, సన్మాన పత్రంతో ఘనంగా సత్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. విద్యార్థులు తమకు విద్యాబుద్ధులు నేర్పిన గురువులను, జన్మనిచ్చిన తల్లిదండ్రులను ఎన్నడూ మరువకూడదని హితవు పలికారు. తనకు జరిగిన ఈ సన్మానాన్ని సంగీత కళకు దక్కిన గౌరవంగా భావిస్తున్నానని, తన ఎదుగుదలకు గురువే కారణమన్నారు. మన ఆరోగ్యానికి సంగీతం ఎంతో మేలు చేస్తుందని పేర్కొన్న ఆయన, ఏయూలో తనకు జరిగిన ఈ గౌరవం మరువలేనిదని ఆనందం వ్యక్తం చేశారు. ఏయూ వీసీ ఆచార్య జి.పి.రాజశేఖర్ మాట్లాడుతూ, వర్సిటీ శతాబ్ది శోభను ప్రతిబింబించేలా ప్రతిభావంతులైన విద్యార్థులతో ఈ ప్రదర్శనలు ఏర్పాటు చేశామన్నారు. కళారంగంలో విశేష కృషి చేసిన దిగ్గజాలను సన్మానించుకోవడం గర్వకారణమని పేర్కొన్నారు. ఈ వేడుకలో భాగంగా ప్రముఖ కళాకారులు ఎ.బి.బాలకొండలరావు, మండ సుధారాణి, మండపాక శారద, హరిరామమూర్తి, జి.శారద సుబ్రహ్మణ్యం, వై.హనుమంతరావులను వర్సిటీ ప్రతినిధులు ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో సంగీత, నృత్య విభాగాధిపతి ఆచార్య సరస్వతీ విద్యార్థి, వివిధ విభాగాల ప్రిన్సిపాల్స్, డీన్లు, ఆచార్యులు, విద్యార్థులు పాల్గొన్నారు. అనంతరం విద్యార్థులు ప్రదర్శించిన శాసీ్త్రయ నృత్యాలు, గాన కచేరీలు ఆహూతులను అలరించాయి.
కలెక్టర్ హరేందిర ప్రసాద్ పిలుపు


