ఆక్రమణదారులపై కఠిన చర్యలు | - | Sakshi
Sakshi News home page

ఆక్రమణదారులపై కఠిన చర్యలు

Mar 18 2026 7:34 AM | Updated on Mar 18 2026 7:34 AM

● అధికారులు మంచి మనసుతో పనిచేయాలి ● ఎస్సీ కమిషన్‌ సభ్యుడు రావాడ సీతారాం

మహారాణిపేట: సమాజంలోని బలహీన వర్గాల పట్ల అధికారులు సానుకూల దృక్పథంతో వ్యవహరించి, వారికి అండగా నిలవాలని రాష్ట్ర ఎస్సీ కమిషన్‌ సభ్యుడు రావాడ సీతారాం సూచించారు. జిల్లా పరిషత్‌ సమావేశ మందిరంలో మంగళవారం నిర్వహించిన కార్యక్రమంలో సుమారు 500 మంది నుంచి వినతులు స్వీకరించారు. వీటిని సంబంధిత అధికారులకు పంపించి, త్వరితగతిన పరిష్కరించాలని ఆదేశించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గృహ స్థలాలు, పట్టాలు, దళితులకు కేటాయించిన అసైన్డ్‌ భూములను ఇతరులు ఆక్రమించుకున్నారంటూ పెద్ద ఎత్తున ఫిర్యాదులు వచ్చాయని, ఆక్రమణదారులపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకోవాలన్నారు. ముఖ్యంగా భీమిలి, గాజువాక మండలాల్లో భూ సమస్యలు ఎక్కువగా ఉన్నాయని, అక్కడ రెవెన్యూ అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. నిడిగట్టు, కొత్తవలస, భీమిలి ప్రాంతాల్లో ఎస్సీలు నివసించే ప్రాంతాలకు దారి లేకుండా ముందుగా లేఅవుట్లు వేసి అడ్డుకున్న ఘటనలపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలన్నారు. వీఎంఆర్డీఏ పరిధిలో నిర్మించే వాణిజ్య దుకాణాలను నిష్పత్తి ప్రాతిపదికన ఎస్సీ లబ్ధిదారులకు కేటాయించాలని సూచించారు. ఎస్సీ కార్పొరేషన్‌ పరిధిలో చేపట్టిన వివిధ అభివృద్ధి పనులకు సంబంధించిన పెండింగ్‌ బిల్లులను ఎలాంటి ఆలస్యం లేకుండా వెంటనే చెల్లించాలని ఆదేశించారు. ఉద్యోగాల్లో రిజర్వేషన్ల అమలుతో పాటు జీవీఎంసీ, వీఎంఆర్డీఏ, సాంఘిక సంక్షేమ శాఖల ద్వారా చేపట్టే ఇంజినీరింగ్‌ పనుల్లో దళిత కాంట్రాక్టర్లకు తగిన కోటా, అవకాశాలు కల్పించాలని స్పష్టం చేశారు. అనంతరం ఆయన శ్రీకృష్ణాపురం పాఠశాలను సందర్శించారు. అక్కడ ప్రతిభ చాటిన విద్యార్థులకు బహుమతులు అందజేసి, వారు భవిష్యత్తులో ఉన్నత స్థానాలకు చేరుకోవాలని ఆకాంక్షించారు. విశాఖ ఆర్డీవో సుధాసాగర్‌, సాంఘిక సంక్షేమ శాఖ డీడీ కె.రామారావు, డీఎంహెచ్‌వో జగదీశ్వరరావు, వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement