యూరప్ దేశాలకు ఎగుమతులకు నేరుగా భారీ కార్గో షిప్స్ లేవు. మొదట్లో విశాఖ, కోల్‌కతా నుంచి చైన్నెకి పంపించి అక్కడి నుంచి యూరప్ దేశాలకు వెళ్లేవి. ఈ విధానంలో ఇబ్బందులను అధిగమించేందుకు దుబాయ్‌ని ట్రాన్షిప్‌మెంట్ హబ్‌గా అభివృద్ధి చేశారు. ఇటువైపు దేశాల నుంచి యురోపియన్ దేశాలకు సరకు పంపించాలంటే దుబాయ్ జెబెల్ అలీ పోర్టుకు పంపించేవారు. అక్కడి నుంచి ఆయా దేశాలకు ఎగుమతి అయ్యేవి. యుద్ధం కారణంగా హార్మూజ్ జలసంధిని మూసేయడంతో విశాఖ, చైన్నె పోర్టుల నుంచి దుబాయ్ మీదుగా జరిగే ట్రాన్షిప్‌మెంట్ నిలిచిపోయింది. దీంతో ఎగుమతిదారులు ప్రత్యామ్నాయాల కోసం చూస్తున్నారు. మిడిల్ ఈస్ట్ దేశాలకు ముంబై, ముంద్రా, చైన్నె, వైజాగ్, కాండ్లా, కొచ్చి పోర్టులతో పాటు దేశంలోని ఇతర పోర్టుల నుంచి రోజూ 15 వేల నుంచి 20 వేల కంటైనర్లు వెళ్తుంటాయి. ప్రస్తుత సంక్షోభం వల్ల ఈ రవాణా 25 నుంచి 30 శాతానికి పడిపోయింది.


