తిరుమల పవిత్రతకు ముప్పు | - | Sakshi
Sakshi News home page

తిరుమల పవిత్రతకు ముప్పు

Mar 18 2026 7:34 AM | Updated on Mar 18 2026 7:34 AM

● టీటీడీ చైర్మన్‌ బి.ఆర్‌.నాయుడును వెంటనే తొలగించాలి ● వైఎస్సార్‌ కాంగ్రెస్‌ జిల్లా అధ్యక్షుడు కేకే రాజు డిమాండ్‌

అల్లిపురం: కోట్లాది మంది హిందువుల ఆరాధ్యదైవం కొలువైన తిరుమల పవిత్రత నేడు ప్రమాదంలో పడిందని, అనైతిక ఆరోపణలు ఎదుర్కొంటున్న టీటీడీ చైర్మన్‌ బి.ఆర్‌.నాయుడును తక్షణమే పదవి నుంచి తొలగించాలని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ విశాఖ జిల్లా అధ్యక్షుడు కేకే రాజు డిమాండ్‌ చేశారు. బీఆర్‌ నాయుడు అనైతిక వ్యవహారాలపై వచ్చిన ఆరోపణలకు వ్యతిరేకంగా తిరుపతిలో శాంతియుతంగా నిరసన వ్యక్తం చేసిన మహిళలపై దాడులు చేయించడం, అనంతరం కేసులు పెట్టించి అరెస్టులు చేయించడం వంటి ఘటనలను ఖండిస్తూ మంగళవారం సాయంత్రం డాబాగార్డెన్స్‌లోని బి.ఆర్‌.అంబేడ్కర్‌ విగ్రహం వద్ద వైఎస్సార్‌సీపీ శ్రేణులతో కలిసి భారీ నిరసన చేపట్టారు. ‘తిరుమలను కాపాడండిం బీఆర్‌ నాయుడిని తొలగించండి’ అంటూ నినాదాలతో ప్రాంతం మార్మోగింది. అనంతరం కేకే రాజు మాట్లాడుతూ వీడియోలు, ఫొటోల రూపంలో ఆరోపణలు వెలుగులోకి వచ్చినా బీఆర్‌ నాయుడు నిర్లజ్జగా పదవిలో కొనసాగడం ఆలయ పవిత్రతకు మచ్చ తెచ్చే చర్య అని తీవ్రంగా విమర్శించారు. మహిళలపై దాడులు చేయించడం అమానుషమని, ఇది ప్రజాస్వామ్యంపై దాడి అని మండిపడ్డారు. ఈ ఘటనల వెనుక ప్రభుత్వ ప్రోత్సాహం ఉందని ఆరోపిస్తూ, ముఖ్యమంత్రి చంద్రబాబు తీరు భక్తుల మనోభావాలను దెబ్బతీస్తోందన్నారు. గతంలోనే ఒక మహిళ తనపై లైంగిక వేధింపుల ఆరోపణలు చేసినా ప్రభుత్వం స్పందించకపోవడం దురదృష్టకరమని గుర్తుచేశారు. ఇలాంటి వివాదాస్పద వ్యక్తికి టీటీడీ వంటి పవిత్ర సంస్థలో అత్యున్నత పదవి ఇవ్వడం పెద్ద తప్పిదమని, ఆయన పదవీకాలంలో తిరుమల–తిరుపతిలో అనేక అపచారాలు జరుగుతున్నాయని ఆరోపించారు. నిరసన తెలిపిన మహిళలపై గూండాలతో దాడులు చేయించడం, కేసులు పెట్టించడం అత్యంత ఖండనీయమన్నారు. నైతిక విలువలు లేని వ్యక్తిని ఇంకా పదవిలో కొనసాగించడం ప్రభుత్వం వైఫల్యమని తేల్చిచెప్పారు. బీఆర్‌ నాయుడు వెంటనే రాజీనామా చేయాలని, లేదంటే ప్రభుత్వం తక్షణమే ఆయనను తొలగించాలని లేకుంటే ఈ ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.

కూటమి ప్రభుత్వంలో ప్రజాస్వామ్యం ఉందా..?

ఎమ్మెల్సీ వరుదు కల్యాణి మాట్లాడుతూ టీటీడీ చైర్మన్‌ పదవి నుంచి బీఆర్‌ నాయుడును తొలగించాలని శాంతియుతంగా నిరసన చేస్తున్న మహిళలపై టీడీపీ గూండాలు దాడిని చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. దాడికి పాల్పడిన ఘటనను చూస్తే కూటమి పాలనలో ప్రజాస్వామ్యం అనేది ఉందా..? చచ్చిపోయిందా..? అనే సందేహం కలుగుతుందన్నారు. మహిళలపై దాడి చేయడమే కాకుండా తిరిగి మహిళలపై పీడీ యాక్ట్‌ కేసులు నమోదు చేయడాన్ని వైఎస్సార్‌సీపీ తీవ్రంగా వ్యతిరేకిస్తుందన్నారు. రాష్ట్రంలో మహిళలపై కూడా అంబేడ్కర్‌ రాజ్యాంగం కాకుండా రెడ్‌బుక్‌ రాజ్యాంగం అమలవుతుంటే .. సనాతనవాది అనే పవన్‌కల్యాణ్‌ ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. ఎప్పుడైతే పవిత్రమైన తిరుపతి లడ్డూలో జంతుకొవ్వు కలిసిందంటూ చంద్రబాబు, బీఆర్‌ నాయుడు అపహాస్యం చేశారో..ఆ నాటి నుంచే వారి పతనం ప్రారంభమైందన్నారు.

ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి పసుపులేటి బాలరాజు, జెడ్పీ చైర్‌పర్సన్‌ జల్లిపల్లి సుభద్ర, మాజీ ఎమ్మెల్యే కె.భాగ్యలక్ష్మి, డిప్యూటీ మేయర్‌ కట్టమూరి సతీష్‌, మాజీ ఎమ్మెల్యే చింతలపూడి వెంకట్రామయ్య, రాష్ట్ర అధికార ప్రతినిధి కొండా రాజీవ్‌ గాంధీ, రాష్ట్ర అనుబంధ విభాగం అధ్యక్షులు బొల్లవరపు జాన్‌వెస్లీ, పేర్ల విజయచందర్‌, పరిశీలకులు డాక్టర్‌ జహీర్‌ అహ్మద్‌, శోభ స్వాతిరాణి, పేడాడ రమణి కుమారి, రొంగలి జగన్నాథం, బాణాల శ్రీనివాసరావు, పిన్నమరాజు సతీష్‌ వర్మ, ముఖ్యనేతలు ఎండీ ఫరూఖీ, ద్రోణంరాజు శ్రీవాస్తవ, తాడి జగన్నాథ రెడ్డి, పల్లా దుర్గారావు, మంచ నాగ మల్లేశ్వరి, జీవీ రామచంద్రరావు, చెన్న జానకి రామ్‌, సేనాపతి అప్పారావు, అంబటి శైలేష్‌, పి.వి.సురేష్‌, సనపల రవీంద్ర భరత్‌, బోని శివరామకృష్ణ, కటికల కల్పన, మేడి ఆనందరావు బాజీ నాయుడు, రాయపురెడ్డి అనిల్‌ కుమార్‌, పీలా ప్రేమ కిరణ్‌ జగదీష్‌, సకలభక్తుల ప్రసాద్‌ రావు, దేవరకొండ మార్కెండేయులు, బోండా ఉమా మహేశ్వర రావు, కోడిగుడ్ల పూర్ణిమ, నీలి రవి, అల్లంపల్లి రాజబాబు, వేంపాడు శ్రీనివాస్‌ రెడ్డి, మువ్వల లక్ష్మి, సాడి పద్మారెడ్డి, రెయ్యి వెంకట రమణ, కెవి శశికళ, భూపతి రాజు సుజాత, ఎండి ఫరీఫ్‌, జీలకర నాగేంద్ర, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement