● ఏ‘ఛీ’బీ బాగోతం
మేతగాడైతే..
తనిఖీల ముందే సమాచారం.. దర్జాగా దండుకుంటున్న వైనం కేసుల మాఫీ పేరిట అమాయకులపై ‘దందా’ పండు ముదుసలుల పెన్షన్ సొమ్మునూ వదలని వైనం పదే పదే అదే శాఖలో తిష్ట.. ఉన్నతాధికారులకే సవాల్!
వ్యవస్థకే తూట్లు పొడుస్తున్న
‘కలెక్షన్’ వీరుడు
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం:
అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ)లో మరోసారి అంతర్గత కలకలం రేగుతోంది. తనిఖీల సమాచారాన్ని ముందుగానే లీక్ చేస్తూ, అదే సమయంలో కక్షిదారుల నుంచే భారీగా వసూళ్లు చేస్తున్న ఓ అధికారి వ్యవహారం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. గతంలో ఏసీబీలో పనిచేసి, మధ్యలో మరో విచారణ సంస్థకు బదిలీపై వెళ్లిం మళ్లీ అదే శాఖకు చేరిన ఈ వ్యక్తి ఇప్పుడు ‘లీకులు–కలెక్షన్లు’ ద్వంద్వ దందాతో చెలరేగుతున్నాడన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. తనిఖీల వివరాలను ముందుగానే చేరవేసి అధికారులను అప్రమత్తం చేయడమే కాకుండా, గతంలో కేసులు ఎదుర్కొంటున్న వారిని టార్గెట్ చేస్తూ ‘సహాయం చేస్తాను’ పేరుతో వసూళ్లకు దిగుతున్నాడని సమాచారం. ఇటీవల జీవీఎంసీ టౌన్ ప్లానింగ్ విభాగంపై జరగబోయే తనిఖీల సమాచారాన్ని ముందుగానే లీక్ చేయడంతో, సంబంధిత అధికారులు అప్రమత్తమై తప్పించుకున్నారన్న ఆరోపణలు తీవ్రంగా వినిపిస్తున్నాయి. ఈ వ్యవహారం ఏసీబీ ఉన్నతాధికారుల దృష్టికి చేరినట్లు తెలుస్తోంది. ఇప్పటికే లీకుల వ్యవహారంలో పలువురిపై చర్యలు తీసుకున్న నేపథ్యంలోం ఈ కొత్త ‘లీక్ వీరుడు’ వ్యవహారం ఉన్నతాధికారులను మరింత ఆగ్రహానికి గురిచేస్తోందని సమాచారం. కఠిన వైఖరి కలిగిన ప్రస్తుత ఉన్నతాధికారి ఈ వ్యవహారంపై విచారణ ప్రారంభించినట్లు తెలుస్తోంది.
అటు లీకులు.. ఇటు కలెక్షన్లు!
ఒకవైపు కక్షిదారులను భయపెట్టి వసూళ్లు చేయడం.. మరోవైపు ఏసీబీ తనిఖీల విషయాలను బయటకు లీక్ చేస్తూ భారీగా దండుకోవడం సదరు వ్యక్తికి వెన్నతో పెట్టిన విద్యగా మారింది. ఇటీవల జీవీఎంసీ టౌన్ ప్లానింగ్ విభాగంపై దాడులు జరగబోతున్నాయనే అత్యంత రహస్య సమాచారాన్ని ఒక ఏసీపీ, డీసీపీకి ముందే చేరవేశాడన్న ఆరోపణలు గుప్పుమంటున్నాయి. దీంతో భారీ కలెక్షన్ రాయుళ్లుగా ముద్రపడిన ఆ ఇద్దరు అధికారులు ‘లీకు వీరుడి’ పుణ్యమా అని దర్జాగా తప్పించుకున్నారు. ఇప్పటికే ఏసీబీలో 9 మంది లీకు వీరులపై వేటు పడగా.. ఈ ‘పదో అవతారం’ వ్యవహారం ఇప్పుడు ఉన్నతాధికారులకు మింగుడుపడటం లేదు.
చర్యలు లేకపోతే మచ్చ తప్పదు!
విశాఖలో గత కొంతకాలంగా ఏసీబీపై ప్రజల్లో పెరిగిన గౌరవం ఈ ‘కలెక్షన్ కింగ్’ వల్ల మంటగలిసిపోయే ప్రమాదం ఉంది. ఈ ఇంటి దొంగను వెంటనే ఏరివేయనట్లయితే.. అవినీతి నిరోధక శాఖ తన లక్ష్యాన్ని కోల్పోయే అవకాశం ఉంది. ఇప్పటికై నా ఉన్నతాధికారులు స్పందించి ఈ లీకు వీరుడి ఆట కట్టించాలని బాధితులు కోరుతున్నారు.
అవినీతిని వేటాడాల్సిన తుపాకీ.. ఇప్పుడు వసూళ్ల గొడ్డలిగా మారింది. నిఖార్సైన అధికారి సారథ్యంలో ఏసీబీ తన ప్రతిష్టను పెంచుకుంటుంటే, ఒకే ఒక్క ‘ఇంటి దొంగ’
ఆ శాఖ గౌరవాన్ని బజారున పడేస్తున్నాడు. తనిఖీల సమాచారాన్ని ముందస్తుగా ‘లీక్’ చేసి అవినీతి తిమింగలాలను కాపాడటమే కాదు.. కేసుల్లో ఇరుక్కున్న కక్షిదారుల నుంచే ‘సహాయం’ పేరుతో భారీగా వసూళ్లకు పాల్పడుతున్న ఈ ‘కలెక్షన్ కింగ్’ వ్యవహారం హాట్ టాపిక్‌గా మారింది.
ముసలివాళ్ల నోటికాడ ముద్దకూ ఎసరు!
ఈ లీకు వీరుడి అరాచకం అంతటితో ఆగలేదు. గతంలో ఏసీబీ కేసుల్లో చిక్కుకుని, ఇప్పుడు పదవీ విరమణ చేసి, పెన్షన్ రాక, రోగాలతో ఇబ్బంది పడుతున్న వృద్ధులను సైతం ఇతగాడు వదలడం లేదు. ‘మీ కేసు పరిష్కరిస్తా.. మీకు సహాయం చేస్తా‘ అంటూ నమ్మించి, వారి దగ్గర ఉన్న కొద్దిపాటి సొమ్మును కూడా మాయమాటలతో గుంజేస్తున్నాడు. వైద్య ఖర్చుల కోసం దాచుకున్న డబ్బును కూడా కనికరం లేకుండా వసూలు చేస్తున్న తీరుపై బాధితులు కన్నీరుమున్నీరవుతున్నారు.
మళ్లీ మళ్లీ ఏసీబీకే.. ఎందుకో?
వసూళ్ల రుచి మరిగిన ఈ వ్యక్తి.. మధ్యలో వేరే విచారణ సంస్థకు వెళ్లినా, పక్కా పైరవీలతో మళ్లీ ఏసీబీకే రావడం వెనుక ఉన్న మతలబు ఏంటో అందరికీ అర్థమవుతూనే ఉంది. వసూళ్లకు అనువైన శాఖ కావడంతోనే మళ్లీ ఇక్కడే తిష్ట వేశాడన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఉన్నతాధికారి ముక్కుసూటిగా వెళ్తున్నా, ఇతను మాత్రం తన పాత అలవాట్లను మానుకోకుండా సంస్థకు మచ్చ తెస్తున్నాడు.


