జీవీఎంసీలో ఇక ప్రత్యేకాధికారి పాలన | - | Sakshi
Sakshi News home page

జీవీఎంసీలో ఇక ప్రత్యేకాధికారి పాలన

Mar 18 2026 7:34 AM | Updated on Mar 18 2026 7:34 AM

● ముగిసిన పాలకవర్గ గడువు ● మాజీలైన కార్పొరేటర్లు ● నేటి నుంచి కలెక్టర్‌ పాలన

డాబాగార్డెన్స్‌: గ్రేటర్‌ విశాఖ నగర పాలక సంస్థ (జీవీఎంసీ) ప్రస్తుత పాలకవర్గ పదవీకాలం మంగళవారంతో ముగిసింది. బుధవారం నుంచి కార్పొరేషన్‌లో ప్రత్యేకాధికారి పాలన అమలులోకి వచ్చింది. తదుపరి ఎన్నికలు జరిగే వరకు ప్రభుత్వం నియమించిన ప్రత్యేక అధికారి, కలెక్టర్‌ ఎం.ఎన్‌.హరేందిర ప్రసాద్‌ కంట్రోల్‌లోనే జీవీఎంసీ పరిపాలన కొనసాగనుంది. 2021లో మొదలైన ఈ పాలకవర్గ ప్రయాణం ఎన్నో రాజకీయ మలుపులకు వేదికై ంది. 2021 ఏప్రిల్‌ నుంచి 2025 ఏప్రిల్‌ వరకు వైఎస్సార్‌ సీపీకి చెందిన గొలగాని హరి వెంకటకుమారి మేయర్‌గా వ్యవహరించగా.. రాజకీయ కుట్రలు, కూటమి మద్దతుతో గతేడాది ఏప్రిల్‌ 28న టీడీపీకి చెందిన పీలా శ్రీనివాసరావు మేయర్‌గా బాధ్యతలు చేపట్టారు. అయితే, తన పదవీకాలం ముగుస్తుందనగా చివరి నెల రోజుల్లో జరిగిన సమావేశాల్లో పదుల సంఖ్యలో అంశాలను హడావుడిగా ఆమోదించుకోవడం విమర్శలకు దారితీసింది. ముఖ్యంగా చిట్టచివరి స్థాయీ సంఘం సమావేశంలో ఏకంగా 294 అంశాలను ఆమోదింపజేసుకున్నారు. మేయర్‌గా తన 11 నెలల పాలనలో కూటమి పార్టీలకు చెందిన పలువురు కార్పొరేటర్లు దోచుకుతిన్నారనే ఆరోపణలు ఉన్నాయి. సభ్యులు ఆమోదించకపోయినప్పటికీ.. అధికారుల సహకారంతో అజెండా అంశాలను మేయర్‌ ఆమోదించుకున్నారని సొంత పార్టీకి చెందిన కార్పొరేటర్లు బాహాటంగా చెప్పుకోవడం గమనార్హం.

జీవీఎంసీ చరిత్రలో చీకటి రోజు

జీవీఎంసీ చరిత్రలో 2026 జనవరి 30వ తేదీ చీకటి రోజుగా నిలిచిపోయింది. విశాఖ ఎంపీ శ్రీభరత్‌కు చెందిన గీతం విశ్వవిద్యాలయం ఆధీనంలో ఉన్న రూ.5వేల కోట్ల విలువైన 54.79 ఎకరాల ప్రభుత్వ భూమిని(ఎండాడ, రుషికొండ) క్రమబద్ధీకరిస్తూ కౌన్సిల్‌లో నిర్ణయం తీసుకున్నారు. వైఎస్సార్‌ సీపీ, వామపక్షాల ఆందోళనలు, ప్రతిపక్షాల నిరసనలను బేఖాతరు చేస్తూ.. టీడీపీ, జనసేన, బీజేపీ ఎమ్మెల్యేలు, కార్పొరేటర్ల మద్దతుతో మేయర్‌ ఏకపక్షంగా ఈ నిర్ణయాన్ని ఆమోదింపజేశారు. ఈ క్రమంలో మీడియాను అనుమతించకపోవడం, పోలీసులను అడ్డుపెట్టుకుని ప్రతిపక్షాల గొంతు నొక్కడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమయ్యాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement