డాబాగార్డెన్స్: జీవీఎంసీ ప్రధాన కార్యాలయంలోని సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికకు ప్రజల నుంచి విశేష స్పందన లభించింది. మేయర్ పీలా శ్రీనివాసరావు, అదనపు కమిషనర్లు డీవీ రమణమూర్తి, పి.నల్లనయ్యతో కలిసి మొత్తం 117 వినతులను స్వీకరించారు. మేయర్ హోదాలో పీలా శ్రీనివాసరావుకు ఇదే చివరి ప్రజా సమస్యల పరిష్కార వేదిక కావడం గమనార్హం. అత్యధికంగా పట్టణ ప్రణాళికా విభాగానికి సంబంధించి 64 వినతులు రాగా, రెవెన్యూ విభాగానికి 21, ఇంజినీరింగ్ విభాగానికి 13, ప్రజారోగ్య విభాగానికి 9 వినతులు అందాయి. అలాగే పరిపాలన, అకౌంట్స్ విభాగానికి 5, యూసీడీకి 4, ఉద్యానవన విభాగానికి ఒక వినతి చొప్పున నమోదయ్యాయి. కార్యక్రమంలో జాయింట్ డైరెక్టర్ (అమృత్) డి.విజయభారతి, ప్రధాన వైద్యాధికారి నరేష్ కుమార్, సీసీపీ ప్రభాకరరావు, ఎగ్జామినర్ ఆఫ్ అకౌంట్స్ వాసుదేవరెడ్డి, డీసీఆర్ శ్రీనివాసరావు, కార్యదర్శి బీవీ రమణ, ఏడీహెచ్ వాసుకి, స్పోర్ట్స్ డైరెక్టర్ అప్పలరాజుతో పాటు పలువురు డీసీపీలు, ఏసీపీలు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.


