ఏయూక్యాంపస్: కస్టమ్స్ అధికారుల వృత్తిపరమైన సవాళ్లు, సామాజిక బాధ్యతలను ప్రతిబింబిస్తూ రూపొందించిన లఘు చిత్రం ‘రైట్ టర్న్– కర్మయోగి’ని సోమవారం నగరంలో ప్రత్యేకంగా ప్రదర్శించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన కస్టమ్స్ సెంట్రల్ టాక్స్ ప్రిన్సిపల్ చీఫ్ కమిషనర్ సంజయ్ రథ్ మాట్లాడుతూ.. నిబంధనలకు లోబడి పనిచేసే అధికారులు తమ బాధ్యతల పట్ల ఎంతటి సామాజిక స్పృహతో ఉండాలో ఈ చిత్రం చక్కగా వివరించిందని పేర్కొన్నారు. 10వ ఇండియన్ వరల్డ్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ఈ చిత్రానికి ‘హానరబుల్ జ్యూరీ మెన్షన్’ లభించడం విశేషమన్నారు. ప్రిన్సిపల్ కమిషనర్ ఎన్. శ్రీధర్ మాట్లాడుతూ కేవలం విమానాశ్రయాలకే పరిమితం కాకుండా కార్గో క్లియరెన్స్‌లోనూ కస్టమ్స్ కీలక పాత్ర పోషిస్తుందని, ఆ విధి నిర్వహణలోని భారాన్ని, బాధ్యతను ఈ చిత్రంలో స్పృశించామని తెలిపారు. కస్టమ్స్ సిబ్బందే ఇందులో నటించడం గమనార్హం. కార్యక్రమంలో విశాఖ పోర్ట్ అథారిటీ డిప్యూటీ చైర్‌పర్సన్ కె. రోషిణి అపరంజి, అడిషనల్ కమిషనర్ రజనీష్, ఇతర అధికారులు, వారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.


