మహారాణిపేట: జిల్లా యంత్రాంగం చేపట్టిన ‘రెవెన్యూ క్లినిక్’ నిర్వహణకు సోమవారం గందరగోళం నెలకొంది. సాధారణంగా కలెక్టరేట్‌లోని వీడియో కాన్ఫరెన్స్ హాలులో జరిగే ఈ కార్యక్రమానికి, ఇతర సమావేశాల కారణంగా ఈసారి వేదిక కరువైంది. అటు కోర్టు హాలులోనూ స్థలం లేకపోవడంతో అధికారులు ఒక్కో మండలానికి ఒక్కో చోట మొక్కుబడిగా వినతులు స్వీకరించారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక కంటే రెవెన్యూ క్లినిక్‌కే జనం పెద్ద సంఖ్యలో తరలివచ్చినప్పటికీ, సరైన వసతి లేక తీవ్ర ఇబ్బందులు పడ్డారు. పూర్తిస్థాయిలో సమస్యలపై చర్చించే అవకాశం లేకపోవడంతో, తహసీల్దార్లు కేవలం వినతులు తీసుకుని బయట నుంచే సమాధానాలు చెప్పి పంపించేశారు. తమ సమస్యలు పరిష్కారం అవుతాయని ఆశతో వచ్చిన బాధితులు.. సరైన వేదిక, సమయం కేటాయించకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు.


