మహారాణిపేట: జిల్లాను అభివృద్ధి పథంలో అగ్రగామిగా నిలిపేందుకు స్వర్ణాంధ్ర–2047లో భాగంగా రూపొందించిన పది సూత్రాల అమలుపై కలెక్టర్ హరేందిర ప్రసాద్ ప్రత్యేక దృష్టి సారించారు. ఇటీవల ముఖ్యమంత్రి నిర్వహించిన కలెక్టర్ల సదస్సులో తీసుకున్న కీలక నిర్ణయాలను క్షేత్రస్థాయిలో అమలు చేసేందుకు సోమవారం కలెక్టరేట్‌లో జిల్లా అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. రాష్ట్రాన్ని పేదరికం లేని దిశగా తీసుకెళ్లడమే ప్రధాన లక్ష్యమని స్పష్టం చేస్తూ, ప్రతి కుటుంబానికి కనీస అవసరాల కల్పనతో పాటు సామాజిక మౌలిక సదుపాయాలను మెరుగుపరచాలని ఆదేశించారు. గ్రామాలు, పట్టణాల్లో రోడ్ల అనుసంధానం, డ్రైనేజీ వ్యవస్థ ఆధునీకరణ, వీధి దీపాల నిర్వహణపై అధికారులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు. యువతకు ఉపాధి కల్పనలో భాగంగా నైపుణ్య శిక్షణను వేగవంతం చేస్తూ, లక్ష మందికి నిర్వహించిన స్కిల్ స్క్రీనింగ్‌లో అర్హత సాధించిన వారికి తగిన అవకాశాలు కల్పించాలని పేర్కొన్నారు. ఇకపై జిల్లా ఉపాధి కల్పనాధికారి ‘స్కిల్ ఆఫీసర్’గా కూడా వ్యవహరిస్తారని ఆయన వెల్లడించారు. సమావేశంలో జాయింట్ కలెక్టర్ గొబ్బిళ్ల విద్యాధరి, ఇన్‌చార్జి డీఆర్వో శేషశైలజ, సీపీవో శ్రీనివాసరావు, ఏడీసీ సత్యవేణి, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.


