● మళ్లీ లీకువీరులు
హతవిధీ
ఏసీపీ, డీసీపీ స్థాయి అధికారులపై అవినీతి ఆరోపణలు ఏసీబీ తనిఖీల సమయంలో అందుబాటులో లేని కీలక అధికారులు అంతర్గత లీకులే కారణమని విమర్శలు
అవినీతి తిమింగలాలను వేటాడాల్సిన ఏసీబీలో ’లీకు వీరుల’ హవా ఏమాత్రం తగ్గడం లేదు. నిఘా వ్యవస్థ కళ్లుగప్పి, అవినీతి అధికారులకు రక్షణ కవచంలా మారుతున్న కొందరు సిబ్బంది వ్యవహారం ఇప్పుడు శాఖలో హాట్ టాపిక్‌గా మారింది. తాజా సంఘటనలు చూస్తుంటే.. ఏసీబీ వ్యూహాల కంటే లీకు వీరుల నెట్‌వర్కే బలంగా ఉందా? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
జీవీఎంసీ టౌన్ ప్లానింగ్‌లో ముందస్తు ‘హెచ్చరికల’ కలకలం
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం:
అవినీతి అంతమే లక్ష్యంగా అడుగులు వేయాల్సిన అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) కోటలో.. ‘లీకు వీరులు’ లంకంత రంధ్రం చేస్తున్నారు. అధికారుల వ్యూహాలు పక్కాగా ఉన్నా, దాడుల సమాచారం మాత్రం అంతకంటే వేగంగా నిందితులకు చేరిపోతోంది. గతంలో ఎనిమిది మందిపై వేటు పడినా, హెడ్ కానిస్టేబుళ్లు కటకటాల పాలైనా.. విశాఖ ఏసీబీలో ఈ ‘ఇన్ఫార్మర్’ వ్యవస్థ వేళ్లూనుకుపోవడం విస్మయానికి గురిచేస్తోంది. తాజాగా గ్రేటర్ విశాఖపట్నం మునిసిపల్ కార్పొరేషన్ (జీవీఎంసీ) టౌన్ ప్లానింగ్ విభాగంలో జరిగిన సోదాలే దీనికి సజీవ సాక్ష్యం. ఏసీబీ బృందం అడుగు పెట్టకముందే, ‘వసూళ్ల వీరులు’గా ముద్రపడ్డ ఏసీపీ, డీసీపీ స్థాయి అధికారులు చల్లగా జారిపోవడం వెనుక శాఖలోని ఒక ‘లీగల్’ మేధావి హస్తం ఉన్నట్లు వినిపిస్తున్న ఆరోపణలు ఇప్పుడు కలకలం రేపుతున్నాయి. వేటగాడి కంటే ముందే వేట పసిగట్టిన జంతువులా.. అవినీతి అధికారులు తప్పించుకుంటున్నారంటే.. ఏసీబీలోనే ‘డబుల్ ఏజెంట్లు’ రాజ్యమేలుతున్నారా? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సదరు లీకువీరుడిపై ఉన్నతాధికారులు కూడా దృష్టి సారించినట్టు తెలుస్తోంది.
లీకుల ‘నెట్‌వర్క్’పై మళ్లీ చర్చ
విశాఖ ఏసీబీ విభాగంలో లీకుల వ్యవహారం కొత్తది కాదు. గతంలో కూడా తనిఖీల సమాచారం ముందుగానే అవినీతి అధికారులకు చేరుతోందన్న ఆరోపణలు తీవ్ర చర్చకు దారి తీశాయి. ఫిర్యాదులు వచ్చిన అధికారులకే సమాచారం చేరడంతో భారీగా నెలవారీ మాముళ్లు వసూలవుతున్నాయన్న విమర్శలు కూడా వచ్చాయి. ఈ నేపథ్యంలో ఏసీబీ ఉన్నతాధికారులు సీరియస్‌గా స్పందించి ఒకేసారి ఎనిమిది మంది సిబ్బందిపై బదిలీ వేటు వేశారు. అయినప్పటికీ లీకుల వ్యవహారం పూర్తిగా ఆగలేదని తాజా పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి.
గతంలో హెడ్ కానిస్టేబుల్‌పై వేటు
గత ఏడాది జూన్‌లో జరిగిన మరో ఘటనలో ఒక సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో తనిఖీలకు వెళ్లిన ఏసీబీ అధికారులు అక్కడి ఫోన్లను స్వాధీనం చేసుకుని పరిశీలించారు. ఆ సమయంలో ఒక హెడ్ కానిస్టేబుల్ ముందుగానే తనిఖీల సమాచారం సబ్ రిజిస్ట్రార్‌కు ఫోన్ ద్వారా అందించినట్టు బయటపడింది. సదరు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం నుంచి వెళ్లిపోవడానికి సిద్ధమవుతుండగానే ఏసీబీ అధికారులు అక్కడికి చేరుకున్నారు. ఫోన్ కాల్ వివరాల్లో నిజం బయటపడడంతో ఆ హెడ్ కానిస్టేబుల్‌పై చర్యలు తీసుకుని అతని నివాసంలో కూడా సోదాలు నిర్వహించినట్టు సమాచారం.
టౌన్ ప్లానింగ్‌లో ‘సేఫ్’ గేమ్!
తాజాగా జీవీఎంసీ టౌన్ ప్లానింగ్ విభాగంలో జరిగిన ఏసీబీ సోదాలు అభాసుపాలయ్యాయి. పక్కా సమాచారంతో రంగంలోకి దిగిన అధికారులకు, అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న అసలు సిబ్బంది దొరకకపోవడం గమనార్హం. ముఖ్యంగా వసూళ్ల వీరులుగా ముద్రపడ్డ ఒక ఏసీపీ, ఒక డీసీపీ స్థాయి అధికారులు తనిఖీలకు సరిగ్గా కొద్ది నిమిషాల ముందే మాయమవ్వడం వెనుక ‘ముందస్తు సమాచారం’ అందిందన్న విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి.
చట్టపరమైన ముసుగులో ’లీకు’ డ్రామా?
గతంలో క్షేత్రస్థాయి సిబ్బంది ద్వారా సమాచారం బయటకు వెళ్లేది. కానీ, ఈసారి వ్యూహం మారింది. రెగ్యులర్ సిబ్బందిపై నిఘా ఉండటంతో, ఈ దఫా చట్టపరమైన వ్యవహారాలు చూసే (లీగల్ సెక్షన్) ఒక కీలక వ్యక్తి ద్వారా ఈ సమాచారం లీక్ అయినట్టు తెలుస్తోంది. సదరు ఏసీపీ, డీసీపీలకు ఆ ’అజ్ఞాత వ్యక్తి’ ముందస్తు హెచ్చరికలు పంపడంతో, ఏసీబీ బృందం వచ్చేసరికి వారు అలెర్ట్ అయిపోయారు. రికార్డులు చూస్తే అక్రమాలు కనిపిస్తున్నా.. అక్రమార్కులు మాత్రం దొరకకుండా దొడ్డిదారిన తప్పించుకున్నారు.
తదుపరి వేటు ఎవరిపై?
ప్రస్తుతం ఇన్‌చార్జిగా ఉన్న డీఎస్పీ అత్యంత కఠినంగా వ్యవహరిస్తారనే పేరుంది. ఆయన రాకతో లీకు వీరులు సర్దుకుంటారని భావించినా, క్షేత్రస్థాయిలో పరిస్థితి మారలేదు. జీవీఎంసీ అధికారుల ఎస్కేప్ ఎపిసోడ్‌ను ఏసీబీ ఉన్నతాధికారులు సీరియస్‌గా తీసుకున్నారు. తనిఖీల సమాచారాన్ని బయటకు పంపిన ఆ ’లీగల్’ కింగ్‌పిన్ ఎవరనే దానిపై ఇప్పటికే ఒక స్పష్టతకు వచ్చినట్టు సమాచారం. త్వరలోనే శాఖలో మరోసారి ప్రక్షాళన జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.


