తొలిరోజు పదిలంగా.. | - | Sakshi
Sakshi News home page

తొలిరోజు పదిలంగా..

Mar 17 2026 7:21 AM | Updated on Mar 17 2026 7:21 AM

● ప్రశాంతంగా ప్రారంభమైన ● జిల్లాలో 99.70 శాతం హాజరు ● ఆలయాలు, చర్చిల్లో ప్రత్యేక పూజలు

పదో తరగతి పరీక్షలు

ఆరిలోవ: జిల్లాలో 2025–26 విద్యా సంవత్సరానికి సంబంధించిన పదో తరగతి పబ్లిక్‌ పరీక్షలు సోమవారం ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పరీక్షలు సజావుగా జరిగాయి. ఈ పరీక్షలు ఏప్రిల్‌ 1 వరకు కొనసాగనున్న విషయం తెలిసిందే. ఉదయం 9.30 గంటలకు ప్రారంభమైన పరీక్షలకు విద్యార్థులు సమయానికి ముందుగానే పరీక్షా కేంద్రాలకు చేరుకున్నారు. తమ పిల్లలను పరీక్షలకు తీసుకొచ్చిన తల్లిదండ్రులతో కేంద్రాల వద్ద సందడి నెలకొంది. ముఖ్యంగా ప్రధాన రహదారుల పక్కన ఉన్న కొన్ని పాఠశాలల్లో పరీక్ష ప్రారంభం, ముగింపు సమయాల్లో విద్యార్థులు, తల్లిదండ్రుల రద్దీతో వాహన రాకపోకలకు స్వల్ప అంతరాయం ఏర్పడింది.

ఆశీస్సుల కోలాహలం

పరీక్షలకు వెళ్లే ముందు పలువురు విద్యార్థులు తల్లిదండ్రులతో కలిసి ఆలయాలు, చర్చిలను సందర్శించి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. నగరంలోని సంపత్‌ వినాయకుడి ఆలయం వద్ద విద్యార్థుల కోలాహలం కనిపించింది. ఎక్కువ మంది విద్యార్థులు తమ హాల్‌ టికెట్లను దేవుడి వద్ద ఉంచి పూజలు చేసి ఆశీర్వాదాలు తీసుకున్నారు. తల్లిదండ్రులు కూడా పిల్లలకు బొట్టు పెట్టి ఆశీర్వదించి పరీక్షలకు పంపించారు.

అధికారుల తనిఖీలు

పరీక్షల సరళిని పర్యవేక్షించేందుకు ఉన్నతాధికారులు రంగంలోకి దిగారు. పరీక్షల పరిశీలకుడు దేవానందరెడ్డి 5 కేంద్రాలను, ప్రాంతీయ సంయుక్త సంచాలకుడు విజయభాస్కర్‌ 4 కేంద్రాలను తనిఖీ చేయగా, డీఈవో స్వయంగా 8 కేంద్రాలను సందర్శించి ఏర్పాట్లను సమీక్షించారు. ఫ్లైయింగ్‌ స్క్వాడ్‌ అధికారులు సైతం 10 కేంద్రాల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు.

ఉత్తరాంధ్రలో 99.61 శాతం హాజరు

మధురవాడ: ఉత్తరాంధ్రలో జరిగిన 10వ తరగతి పరీక్షలకు 1,23,214 మంది విద్యార్థులకు గాను 1,22,762 మంది హాజరయ్యారని విద్యాశాఖ ఆర్‌జేడీ విజయభాస్కర్‌ తెలిపారు. 639 పరీక్షా కేంద్రాల్లో జరిగిన ఈ పరీక్షలకు 652 మంది గైర్హాజరయ్యారని పేర్కొన్నారు.

తనిఖీ చేసి పంపిస్తున్న సిబ్బంది

ఓపెన్‌ టెన్త్‌ పరిస్థితి

సార్వత్రిక విద్యా పీఠం ద్వారా పరీక్ష రాస్తున్న విద్యార్థుల హాజరు ఇలా ఉంది:

కేటాయించిన కేంద్రాలు 11

పరీక్ష రాయాల్సిన వారు 578

హాజరైన వారు 480

హాజరు శాతం: 83.04%

జిల్లాలో హాజరు వివరాలు

మొదటి రోజు ప్రథమ భాష (తెలుగు, సంస్కృతం, ఉర్దూ, ఒరియా) పరీక్ష నిర్వహించారు. దీనికి సంబంధించిన గణాంకాలను డీఈవో ఎన్‌.ప్రేమకుమార్‌ వెల్లడించారు:

మొత్తం పరీక్షా కేంద్రాలు: 133

పరీక్ష రాయాల్సిన వారు : 29,042

హాజరైన విద్యార్థులు: 28,955

హాజరు శాతం: 99.70%

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement