రూ. 800 కోట్ల పెట్టుబడులే లక్ష్యంగా బెర్తుల ఆధునికీకరణ
‘ఓ అండ్ ఎం’ పద్ధతిలో 100 శాతం యాంత్రీకరణ దిశగా అడుగులు
పీపీపీ మోడల్‌లో 3 కీలక బెర్తుల పునర్నిర్మాణం.. సిద్ధమైన ప్రణాళికలు
పోర్టుపై ‘పైసా’ భారం పడకుండా సరకు రవాణాలో సరికొత్త రికార్డులు
సాక్షి, విశాఖపట్నం: ‘ఈస్ట్‌కోస్ట్ గేట్ వే ఆఫ్ ఇండియా’గా పేరుగాంచిన విశాఖపట్నం పోర్టు అంతర్జాతీయ నౌకాయాన పటంలో తన ముద్రను మరింత బలోపేతం చేసుకుంటోంది. దిగ్గజ పోర్టులతో పోటీపడుతూ, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 100 మిలియన్ టన్నుల సరకు రవాణా లక్ష్యాన్ని ఛేదించేందుకు సన్నద్ధమవుతోంది. అటు మౌలిక వసతులు, ఇటు సాంకేతికత.. రెండింటినీ జోడించి నిర్వహణ సామర్థ్యాన్ని ప్రపంచ స్థాయికి తీసుకెళ్లేందుకు ‘యాంత్రీకరణ’ అస్త్రాన్ని ప్రయోగిస్తోంది.
‘ఓ అండ్ ఎం’.. పోర్టు సరికొత్త అస్త్రం!
దేశంలోనే తొలిసారిగా ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ (ఓ అండ్ ఎం) పద్ధతిని అమలు చేసి సక్సెస్ అయిన విశాఖ పోర్టు, ఇప్పుడు అదే వ్యూహంతో మరిన్ని బెర్తులను ఆధునికీకరించనుంది. పోర్టు ఖజానాపై ఒక్క రూపాయి భారం పడకుండా, ప్రైవేట్ భాగస్వామ్యంతో రూ. 800 కోట్ల పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా అధికారులు అడుగులు వేస్తున్నారు.
హెచ్‌ఎల్‌సీ క్రేన్లతో.. సూపర్ ఫాస్ట్ హ్యాండ్లింగ్!
మల్టీ కార్గో హ్యాండ్లింగ్‌లో వేగాన్ని పెంచేందుకు అత్యాధునిక హెవీ లిఫ్ట్ క్రేన్లను (హెచ్‌ఎల్‌సీ) ఏర్పాటు చేయనున్నారు.
ఈక్యూ–3 : మల్టీ పర్పస్ కార్గో కోసం కేటాయింపు.
ఈక్యూ–4 : బల్క్ కార్గో హ్యాండ్లింగ్ సామర్థ్యం పెంపు.
డబ్ల్యూక్యూ–1: బెర్తు పునర్నిర్మాణం, ఆధునికీకరణ.
ఈ మూడు బెర్తుల నిర్వహణ బాధ్యతలను పీపీపీ పద్ధతిలో ప్రైవేట్ సంస్థలకు అప్పగించనున్నారు. తద్వారా అత్యాధునిక యంత్రాలతో సరకు రవాణా వేగం పెరగడమే కాకుండా, పోర్టు నిర్వహణ వ్యయం గణనీయంగా తగ్గుతుంది.
రీటెండర్లతో పక్కా వ్యూహం
ముందుగా పిలిచిన టెండర్లలో ఆశించిన మేర పెట్టుబడులు రాకపోవడంతో, పోర్టు ప్రయోజనాల దృష్ట్యా అధికారులు ఇప్పుడు రీటెండర్లకు వెళ్తున్నారు. పోర్టు చైర్మన్ డాక్టర్ అంగముత్తు, డిప్యూటీ చైర్‌పర్సన్ రోష్ని అపరాంజి దిశానిర్దేశంలో, చీఫ్ మెకానికల్ ఇంజనీర్ (సీఎంఈ) రామ్ ప్రసాద్ పర్యవేక్షణలో ఈ భారీ కసరత్తు జరుగుతోంది. ఇప్పటికే రూ. 655 కోట్లతో ఈక్యూ–7, వెస్ట్ క్యూ–7, 8 బెర్తుల యాంత్రీకరణ పనులు శరవేగంగా సాగుతున్నాయి.
ప్రపంచ వాణిజ్య కేంద్రంగా విశాఖ
కేవలం సరకు రవాణాకే పరిమితం కాకుండా, కంటైనర్ టెర్మినల్ విస్తరణ, జెట్టీల ఆధునికీకరణ, లాజిస్టిక్ కనెక్టివిటీ ప్రాజెక్టులతో విశాఖ పోర్టు రూపురేఖలు మారుతున్నాయి. రాబోయే రోజుల్లో 100 శాతం మెకనైజేషన్ పూర్తి చేసుకుని, ప్రపంచ వాణిజ్య కేంద్రాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలవడమే లక్ష్యంగా ఈ ‘ఆధునిక’ విప్లవం సాగుతోంది. విశాఖ పోర్టు సాధిస్తున్న ఈ పురోగతి, అటు పారిశ్రామిక రంగానికి, ఇటు ప్రభుత్వానికి భారీ ఆదాయ వనరుగా మారబోతోంది. పెట్టుబడుల ప్రవాహం పెరిగితే స్థానికంగా మరిన్ని ఉపాధి అవకాశాలు లభించే వీలుంది.


