మహారాణిపేట: రాష్ట్ర బార్ కౌన్సిల్ ఆదేశాల ప్రకారం న్యాయవాదుల సంఘాలకు ఈనెల 27వ తేదీకి లేదా ఏప్రిల్ మొదటి వారంలో ఎన్నికలు జరపాలని నిర్ణయించబడింది. ఈ నేపథ్యంలో విశాఖ న్యాయవాదులు సంఘం జిల్లా కోర్టులో సోమవారం అత్యవసర సమావేశం నిర్వహించింది. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు ఎం.కె.శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రస్తుత సంవత్సరానికి సంఘంలో ఉపాధ్యక్ష, గ్రంథాలయ కార్యదర్శి, జూనియర్ కార్యనిర్వాహక సభ్యుల స్థానాలు రిజర్వ్‌లో ఉన్నాయన్నారు. ఈ స్థానాలకు మహిళ న్యాయవాదులు పోటీ చేయవచ్చని చెప్పారు.
ఎన్నికల అధికారిగా ప్రభాకరరెడ్డి
సీనియర్ న్యాయవాది ఎ.ప్రభాకరరెడ్డిను ఎన్నికల నిర్వహణ అధికారిగా నియమిస్తూ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. మూడున్నర దశాబ్దాలుగా న్యాయ వృత్తిలో ఉన్న ప్రభాకరరెడ్డి పలు ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలకు న్యాయసలహాదారుగా సేవలందిస్తున్నారు. గతంలో కూడా సంఘం ఎన్నికల్లో అధికారిగా పనిచేసిన ఆయన నియామకంపై బార్ కౌన్సిల్ సభ్యులు ఎస్. కృష్ణ మోహన్, పి.నరసింహరావు, కె.రామజోగేశ్వరరావు, బైపా అరుణ్‌కుమార్, ఇతర న్యాయవాదులు హర్షం వ్యక్తం చేశారు.


