సీతంపేట: ప్రపంచ కిడ్నీ దినోత్సవరం పురస్కరించుకుని.. కిడ్నీ ఆరోగ్యంపై ప్రజల్లో అవగాహన పెంచేందుకు ఆసియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ నెఫ్రాలజీ అండ్ యూరాలజీ ఆధ్వర్యంలో స్థానిక అంబేడ్కర్ భవనంలో రంగోలీ పోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో మహిళలు ఉత్సాహంగా పాల్గొని కిడ్నీ ఆరోగ్యం, ముందస్తు పరీక్షల ప్రాధాన్యత, ఆరోగ్యకరమైన జీవనశైలి వంటి సందేశాలను ప్రతిబింబించేలా ఆకర్షణీయమైన రంగవల్లులను తీర్చిదిద్దారు. ఈ సందర్భంగా సీపీ శంఖబ్రత బాగ్చి మాట్లాడుతూ.. ఇలాంటి సృజనాత్మక కార్యక్రమాల ద్వారా ఆరోగ్య అంశాలను ప్రజలకు సులభంగా చేరవేయవచ్చని కొనియాడారు. యూరో ఆంకాలజిస్ట్, రోబోటిక్ సర్జన్ డాక్టర్ జి.రవీంద్ర వర్మ మాట్లాడుతూ.. కిడ్నీల ఆరోగ్యం మన చేతుల్లోనే ఉందని, మంచి అలవాట్లతో వాటిని కాపాడుకోవచ్చని తెలిపారు. కన్సల్టెంట్ నెఫ్రాలజిస్టులు డాక్టర్ ఉదయ్ దీపక్‌రావ్ గాజారే, డాక్టర్ వైష్ణవి మాట్లాడుతూ.. కిడ్నీ సంబంధిత వ్యాధులు ప్రారంభ దశలో ఎటువంటి లక్షణాలు లేకుండానే వృద్ధి చెందుతాయని హెచ్చరించారు. అందుకే క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్షలు చేయించుకోవడం, తగినంత నీరు తాగడం, పౌష్టికాహారం తీసుకోవడం ద్వారా కిడ్నీల పనితీరును మెరుగుపరుచుకోవాలని సూచించారు. పోటీల అనంతరం పోటీల్లో ప్రతిభ కనబరిచిన మహిళలకు బహుమతులు అందజేశారు.


