ఘనంగా ఏపీడబ్ల్యూజేఎఫ్ ఉగాది సంబరాలు
డాబాగార్డెన్స్: జర్నలిస్టులు సమాజ ప్రగతి సాధకులని ప్రముఖ పారిశ్రామికవేత్తలు, చలమాజీ చారిటబుల్ ట్రస్ట్ ప్రతినిధులు మట్టపల్లి విశ్వేశ్వరరావు, మట్టపల్లి హనుమంతరావు, సత్యనారాయణ కొనియాడారు. పూర్ణామార్కెట్ సమీపంలోని ఒక ఫంక్షన్ హాల్లో ఏపీ వర్కింగ్ జర్నలిస్టుల ఫెడరేషన్, బ్రాడ్‌కాస్ట్, స్మాల్ అండ్ మీడియం న్యూస్ పేపర్స్ అసోసియేషన్ సంయుక్త ఆధ్వర్యంలో ఆదివారం పరాభవ నామ సంవత్సర ఉగాది సంబరాలు వేడుకగా జరిగాయి. ఈ కార్యక్రమంలో పాల్గొన్న విశ్వేశ్వరరావు మాట్లాడుతూ.. రానున్న పరాభవ నామ సంవత్సరం జర్నలిస్టుల కుటుంబాల్లో వెలుగులు నింపాలని ఆకాంక్షించారు. ఫెడరేషన్ రాష్ట్ర నాయకుడు గంట్ల శ్రీనుబాబు మాట్లాడుతూ.. ప్రతి ఏటా జర్నలిస్టుల కుటుంబాలతో కలిసి ఉగాది సంబరాలు జరుపుకోవడం ఆనందంగా ఉందన్నారు. జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు, వెటరన్ జర్నలిస్టులకు పెన్షన్లు, హెల్త్‌కార్డులు, వృద్ధాప్యంలో ఉన్న జర్నలిస్టుల కోసం వృద్ధాశ్రమ ఏర్పాటు వంటి సమస్యల సాధన కోసం ఫెడరేషన్ అలుపెరగని పోరాటం చేస్తోందని వివరించారు. వేడుకల్లో భాగంగా పూడిపెద్ది కృష్ణశర్మ పంచాంగ శ్రవణం చేశారు. అనంతరం నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. ఫెడరేషన్ నగర అధ్యక్షుడు పి.నారాయణ, జి.శ్రీనివాసరావు, డి.రవికుమార్, పితాని సూర్యప్రసాద్, బి.శివప్రసాద్, ఎన్.రామకృష్ణ, కృష్ణపాత్రో, రవిశంకర్, ఆనంద్, రామునాయుడు, నగేష్‌బాబు, జర్నలిస్టుల కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.


