పట్టణాల అభివృద్ధికి మున్సిపల్‌ బాండ్లు | - | Sakshi
Sakshi News home page

పట్టణాల అభివృద్ధికి మున్సిపల్‌ బాండ్లు

Mar 16 2026 7:17 AM | Updated on Mar 16 2026 7:17 AM

మూడేళ్లలో విశాఖ మెట్రో పూర్తి: మంత్రి నారాయణ

మహారాణిపేట: పట్టణ మౌలిక వసతుల అభివృద్ధికి పెట్టుబడులను సమీకరించడం, స్థానిక సంస్థల సామర్థ్యాన్ని పెంపొందించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పి.నారాయణ అన్నారు. ఆదివారం నగరంలోని ఒక హోటల్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వ సహకారంతో ‘యూ–విన్‌’ కార్యక్రమం కింద ఆంధ్రప్రదేశ్‌తో పాటు తమిళనాడు, కర్ణాటక, కేరళ రాష్ట్రాల ప్రతినిధులతో ప్రాంతీయ వర్క్‌షాప్‌ నిర్వహిస్తున్నట్లు మంత్రి తెలిపారు. పట్టణ మౌలిక వసతుల కోసం అవసరమైన నిధులను క్యాపిటల్‌ మార్కెట్ల ద్వారా సమీకరించడం, మున్సిపల్‌ బాండ్లు, ఇతర పెట్టుబడి అవకాశాలను వినియోగించుకోవడంపై ఈ వర్క్‌షాపులో చర్చిస్తున్నట్లు చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా జూన్‌ నెలాఖరు నాటికి సుమారు 2.60 లక్షల గృహాలను పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు మంత్రి వెల్లడించారు. పాలనను వేగవంతం చేసేందుకు అన్ని మున్సిపల్‌ కార్పొరేషన్లకు జేసీలను ప్రత్యేక అధికారులుగా నియమించినట్లు తెలిపారు. విశాఖ మెట్రో రైల్‌ ప్రాజెక్టును కేంద్ర ప్రభుత్వం పరిశీలిస్తోందని మంత్రి తెలిపారు. ఈ ప్రాజెక్టుపై రైట్స్‌ సంస్థ అధ్యయనం చేస్తోందని, మరో రెండు నెలల్లో ఈ ప్రక్రియ పూర్తవుతుందని చెప్పారు. అనంతరం పనులను వేగవంతం చేసి, వచ్చే మూడు సంవత్సరాల్లో మెట్రో ప్రాజెక్టును పూర్తి చేయాలనే పట్టుదలతో ఉన్నామన్నారు. హైదరాబాద్‌ ఔటర్‌ రింగ్‌ రోడ్‌ తరహాలో విశాఖకు రాంబిల్లి నుంచి భోగాపురం వరకు సెమీ రింగ్‌ రోడ్‌ అభివృద్ధి చేయడానికి చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి తెలిపారు. వీఎంఆర్డీఏ పరిధిలోని మాస్టర్‌ ప్లాన్‌లో ప్రతిపాదించిన ఒక ప్రధాన రహదారి నిర్మాణానికి అటవీ భూమి అడ్డంకిగా మారిందని, ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి సమస్యను పరిష్కరించినట్లు మంత్రి వెల్లడించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement