విశాఖ లీగల్: కక్షిదారులు తమ కేసులను రాజీ మార్గంలో పరిష్కరించుకోవడం వల్ల బహుళ ప్రయోజనాలు ఉంటాయని జిల్లా ప్రధాన న్యాయమూర్తి చిన్నంశెట్టి రాజు అన్నారు. శనివారం జిల్లా కోర్టు ప్రాంగణంలోని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యాలయంలో నిర్వహించిన మెగా జాతీయ లోక్ అదాలత్‌ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లాలోని వివిధ న్యాయస్థానాల్లో పెండింగ్‌లో ఉన్న కేసుల రాజీ కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. ఈ లోక్ అదాలత్‌లో 345 సివిల్ కేసులు, 12,800 క్రిమినల్ కేసులు, ప్రీ లిటిగేషన్ ద్వారా 152 కేసులు రాజీ అయ్యాయి. వీటి ద్వారా మొత్తం రూ.38 కోట్ల నగదు సమకూరింది. కేసుల పరిష్కారంలో రాష్ట్రంలో విశాఖ 9వ స్థానంలో నిలిచిందని జిల్లా ప్రధాన న్యాయమూర్తి వెల్లడించారు. కాగా, రాజీ మార్గంలో పరిష్కారమైన ఒక కేసులో అత్యధికంగా రూ.2.56 కోట్ల పరిహారాన్ని బాధితులకు అందజేశారు. కార్యక్రమంలో జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి ఆర్.సన్యాసినాయుడు పాల్గొన్నారు.


