మద్దిలపాలెం: ఆంధ్ర విశ్వవిద్యాలయం ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన వర్సిటీల సరసన నిలుస్తుందని భారతదేశంలో ఘనా హైకమిషనర్ ప్రొఫెసర్ క్వాసి ఒబిరి డాన్సో కొనియాడారు. శనివారం ఏయూలో ఘనా విద్యార్థుల సమక్షంలో నిర్వహించిన ఆ దేశ స్వాతంత్య్ర దినోత్సవంలో ఆయన మాట్లాడారు. భారతదేశంతో ఘనాకు మెరుగైన ద్వైపాక్షిక సంబంధాలు ఉన్నాయని, భవిష్యత్ నాయకత్వాన్ని, నైపుణ్యం కలిగిన వర్క్‌ఫోర్స్‌ను తీర్చిదిద్దడంలో ఏయూ కీలక పాత్ర పోషిస్తోందన్నారు. పలువురు భారతీయులు శాశ్వత పౌరసత్వం పొంది ఘనాలో నివసిస్తున్న విషయాన్ని ఆయన ప్రస్తావించారు. ఏయూలో తమ దేశ విద్యార్థులకు అందుతున్న నాణ్యమైన విద్య పట్ల ఆయన సంతృప్తి వ్యక్తం చేస్తూ, శతాబ్ది ఉత్సవాలు జరుపుకుంటున్న వర్సిటీ మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. ఏయూ వీసీ ఆచా ర్య జి.పి.రాజశేఖర్ మాట్లాడుతూ.. ఘనా దేశంతోనూ, అక్కడి విద్యార్థులతోనూ ఏయూకు బలమైన విద్యా, సాంస్కృతిక అనుబంధం ఉందన్నారు. ఈ నెలలో విదేశీ విద్యార్థుల కోసం ప్రత్యేకంగా సాంస్కృతిక సమ్మేళనం, ఫుడ్ ఫెస్టివల్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఏయూలో చదువుకుని ఘనాలో ఉన్నత పదవుల్లో స్థిరపడిన వారిని శతాబ్ది ఉత్సవాల సందర్భంగా సత్కరిస్తామని ప్రకటించారు. భారత్‌లో చదువుకుంటున్న విదేశీ విద్యార్థులందరినీ ఏకం చేస్తూ ఏయూ వేదికగా ఒక భారీ సైన్స్ టెక్నాలజీ కాంక్లేవ్ నిర్వహించేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని సూచించారు. కార్యక్రమంలో విదేశీ విద్యార్థి వ్యవహారాల డీన్ ఆచార్య పాల్ డగ్లస్, అసోసియేట్ డీన్లు డాక్టర్ ఎన్.ఎం. యుగంధర్, డాక్టర్ విజయశాంతి, ఘనా విద్యార్థుల సంఘం అధ్యక్షుడు ఎ.అబ్రహం తదితరులు పాల్గొన్నారు. అనంతరం విద్యార్థులు ప్రదర్శించిన ఘనా సంప్రదాయ నృత్యాలు అలరించాయి. ఈ సందర్భంగా ఏయూ తరఫున ఘనా హైకమిషనర్‌ను సత్కరించారు.


