తగరపువలస: సంగివలసలోని ఒక కార్పొరేట్ విద్యాసంస్థకు చెందిన బస్సు ఢీకొని విజయనగరం జిల్లా డెంకాడ మండలం జొన్నాడకు చెందిన జి.సూర్యనారాయణ(65) దుర్మరణం చెందాడు. ప్రత్యక్ష సాక్షులు తెలిపిన వివరాలివి.. భీమిలి మండలం శింగనబంధ పంచాయతీ కృష్ణంరాజుపేట ప్రాంతానికి చెందిన పడగల అప్పలస్వామి, అప్పయ్యమ్మతో పాటు సూర్యనారాయణ శుక్రవారం ద్విచక్రవాహనంపై జొన్నాడ వైపు సర్వీస్ రోడ్డులో వెళ్తున్నారు. ఈ క్రమంలో ఎదురుగా వస్తున్న స్కూల్ బస్సు బలంగా బైక్‌ను ఢీకొంది. ఆ సమయంలో ద్విచక్రవాహనంపై ఉన్న ముగ్గురు కింద పడిపోగా.. వృద్ధుడు తలకు బలమైన గాయాలతో అక్కడికక్కడే చనిపోయాడు. మిగిలిన ఇద్దరికి తీవ్ర గాయాలు కాగా చికిత్స కోసం ఆస్పత్రి కి తరలించారు. బస్సును డ్రైవర్‌కు బదులుగా క్లీనర్ నడుపుతున్నట్టు తెలిసింది. ఘటన జరిగిన ప్రాంతం విజయనగరం జిల్లా డెంకాడ, భోగాపురంతో పాటు భీమిలి మండల పరిధిలో ఉండటంతో ఈ మూడు పోలీస్ స్టేషన్ల సిబ్బంది తొలుత కొంత అయోమయానికి గురయ్యారు. చివరకు ఆ స్థలం భీమిలి రెవెన్యూ పరిధిలో ఉందని గుర్తించి.. పోస్టుమార్టం కోసం మృతదేహాన్ని భీమిలి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.


