తాటిచెట్లపాలెం: ఈస్ట్ కోస్ట్ రైల్వే, వాల్తేరు డివిజన్ ఆధ్వర్యంలో 70వ రైల్వే వీక్ అవార్డ్స్–రైల్ సేవా పురస్కార్ వేడుకలు శుక్రవారం రైల్వే స్టేషన్ సమీపంలోని రైల్ క్లబ్‌లో ఘనంగా నిర్వహించారు. డివిజనల్ రైల్వే మేనేజర్ లలిత్ బోహ్రా జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైల్వేలోని ప్రతి విభాగంలో సిబ్బంది చూపిన ప్రతిభను గుర్తించి వారిని సత్కరించడం ఈ వేడుకల ఉద్దేశమన్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో వాల్తేర్ డివిజన్ పలు కీలక కార్యక్రమాలు చేపట్టిందని చెప్పారు. ఈ ఆర్థిక సంవత్సరంలో ఇంకా 24 రోజులు మిగిలి ఉండగానే సరుకు లోడింగ్ లక్ష్యాన్ని అధిగమించి రికార్డు సృష్టించినట్లు తెలిపారు. మొత్తం 84 మిలియన్ టన్నుల సరుకు రవాణా లక్ష్యాన్ని డివిజన్ చేరుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఉత్తమ ప్రతిభ కనబర్చిన 72 మంది వాల్తేర్ డివిజన్ ఉద్యోగులకు ప్రతిభా పురస్కారాలు అందజేశారు. అలాగే ఇటీవల భువనేశ్వర్‌లో జరిగిన రైల్ సేవా పురస్కార్–2025 వేడుకల్లో డివిజన్ ఓవరాల్ ఎఫిషియెన్సీ షీల్డ్‌తో పాటు మొత్తం 14 షీల్డ్‌లను అందుకున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో సీనియర్ డివిజనల్ పర్సనల్ ఆఫీసర్ జుసుఫ్ కబీర్ అన్సారి, ఈకార్వో ప్రెసిడెంట్ జ్యోత్స్న బోహ్ర, అదనపు డీఆర్‌ఎంలు ఈ. శాంతారం (ఇన్‌ఫ్రా), కే. రామారావు (ఆపరేషన్స్), ఈకార్వో వైస్ ప్రెసిడెంట్ గాయత్రి శాంతారం, రైల్వే అధికారులు, యూనియన్ ప్రతినిధులు, సిబ్బంది పాల్గొన్నారు. అనంతరం సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు.


