మహారాణిపేట : మహిళలను ఇబ్బందులకు గురి చేసే ఏ అంశాన్నీ సహించబోమని రాయపాటి శైలజ హెచ్చరించారు. శుక్రవారం విశాఖలోని జెడ్పీ సమావేశ మందిరంలో ఉమ్మడి విశాఖ జిల్లాల నుంచి వచ్చిన మహిళల ఫిర్యాదుల విచారణతోపాటు కొత్త ఫిర్యాదులను స్వీకరించి విచారించారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. మహిళా కమిషన్‌కు వచ్చిన ఫిర్యాదుల్లో సుమారు 70 శాతం సమస్యలను పరిష్కరించామని, మిగతావాటిని కూడా త్వరలో పరిష్కరిస్తామని తెలిపారు. పని ప్రదేశాల్లో లైంగిక వేధింపులపై ఫిర్యాదు చేసేందుకు స్కానర్ విధానాన్ని తీసుకొస్తున్నామని, విచారణ కోసం ఐసీసీ (ఇంటర్నల్ కంప్లైంట్స్ కమిటీ)లను ఏర్పాటు చేశామని చెప్పారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా జాతీయ మహిళా కమిషన్ ఆదేశాల మేరకు మహిళా జన్ సున్వాయ్ కార్యక్రమాలు నిర్వహించామన్నారు. నెల్లూరులో ప్రారంభమైన ఈ కార్యక్రమం విశాఖపట్నంతో మొదటి దశ పూర్తయిందన్నారు. ఇకపై ప్రతి జిల్లాలో కూడా ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తామని చెప్పారు. జన్ సున్వాయ్‌లో ఎక్కువగా గృహహింస, పని ప్రదేశాల్లో లైంగిక వేధింపులు, మోసపూరిత వివాహాలు వంటి ఫిర్యాదులు వస్తున్నాయని తెలిపారు. బాధితులు విచారణ అధికారుల పనితీరుపై అసంతృప్తి వ్యక్తం చేస్తే అవసరమైతే ఆ అధికారిని మార్చేందుకు జిల్లా ఎస్పీలకు సూచిస్తామని చెప్పారు. న్యాయవాదులను నియమించుకోలేని మహిళలకు న్యాయ సహాయం కూడా అందిస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మహిళా, శిశు సంక్షేమ శాఖ అధికారులు, పోలీసులు తదితరులు పాల్గొన్నారు.


