ఎంవీపీకాలనీ: రవిరాజ్ ట్రావెల్స్‌కు చెందిన బస్సు ఢీకొని మారుపల్లి పోలమ్మ (52) అనే మహిళ మృతి చెందింది. ఎంవీపీ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన జరిగింది. పోలీసులు తెలిపిన వివరాలివి. జీవీఎంసీ 19వ వార్డు శివగణేష్ నగర్‌లో నివాసముంటున్న పోలమ్మ, లాసన్స్ బే కాలనీలో ఇళ్లలో పనులు చేస్తూ జీవనం సాగిస్తోంది. గురువారం మధ్యాహ్నం 12 గంటల సమయంలో పని ముగించుకుని తిరిగి ఇంటికి వస్తోంది. అదే సమయంలో లాసన్స్ బే కాలనీ సచివాలయం వద్ద బస్సు డ్రైవర్ యర్రపత్తి రాంబాబు అజాగ్రత్తగా బస్సును రివర్స్ చేశాడు. ఈ క్రమంలో వెనుకనే ఉన్న పోలమ్మను గమనించకుండా ఢీకొట్టడంతో ఆమె కిందపడిపోయింది. బస్సు చక్రాలు ఆమైపె నుంచి వెళ్లడంతో పోలమ్మ అక్కడికక్కడే మృతి చెందింది. సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం కేజీహెచ్‌కు తరలించారు. మృతురాలి కుమారుడు మారుపల్లి ధనరాజు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


