పన్ను పోటు.. లేదంటే వేటు! | - | Sakshi
Sakshi News home page

పన్ను పోటు.. లేదంటే వేటు!

Mar 13 2026 7:31 AM | Updated on Mar 13 2026 7:31 AM

మహారాణిపేట: ఆర్థిక సంవత్సరం ముగింపు దశకు చేరుకోవడంతో జిల్లాలోని సచివాలయ సిబ్బందిపై పన్నుల వసూళ్ల భారం అమాంతం పెరిగింది. అటు జీవీఎంసీ పరిధిలోనూ, ఇటు గ్రామ పంచాయతీల్లోనూ వంద శాతం పన్నుల వసూళ్లే లక్ష్యంగా ప్రభుత్వం సిబ్బందిని పరుగులు పెట్టిస్తోంది. మార్చి 31లోగా నిర్దేశించిన టార్గెట్లను పూర్తి చేయాలని, లేని పక్షంలో కఠిన చర్యలు తప్పవని ఉన్నతాధికారులు హెచ్చరిస్తుండటంతో సచివాలయ ఉద్యోగులు తీవ్ర ఆందోళనలో ఉన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా స్థానిక సంస్థల ఆదాయంపైనే చంద్రబాబు ప్రభుత్వం ఆధారపడుతోంది. ఇందులో భాగంగా ఇంటి పన్ను, ఖాళీ స్థలాల పన్ను, నీటి పన్నులతో పాటు ఇతర బకాయిల వసూళ్లకు ప్రాధాన్యమిస్తోంది. పట్టణ, పురపాలన, పంచాయతీరాజ్‌ కమిషనర్ల నుంచి నిరంతరం ఒత్తిడి వస్తుండటంతో స్థానిక అధికారులు వార్డు/గ్రామ కార్యదర్శులకు తీరిక లేకుండా ఉరుకులు పెట్టిస్తున్నారు. పన్నులు చెల్లించని వారికి నోటీసులు జారీ చేయడం, అవసరమైతే ఇళ్లను సీజ్‌ చేయడం వంటి కఠిన చర్యలకు సిబ్బంది ఉపక్రమిస్తున్నారు. నిత్యం ఉదయం, సాయంత్రం సమీక్ష సమావేశాలు నిర్వహిస్తూ, గంట గంటకూ గూగుల్‌ షీట్‌లలో ప్రోగ్రెస్‌ అప్‌డేట్‌ చేయాలని ఆదేశిస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా మొత్తం 607 సచివాలయాలు (జీవీఎంసీలో 551, గ్రామీణంలో 56) ఉన్నాయి. వీటిలో 12 కేటగిరీలకు చెందిన 3,860 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. వీరిలో ముఖ్యంగా పంచాయతీ కార్యదర్శులు, వార్డు పరిపాలన కార్యదర్శులపై పన్ను వసూళ్ల ఒత్తిడి ఎక్కువగా ఉంది.

జాబ్‌ చార్ట్‌కు మించి పనిభారం

కేవలం పన్నుల వసూళ్లే కాకుండా, తమ విధులకు సంబంధం లేని ఇతర పనుల వల్ల సచివాలయ సిబ్బంది మానసిక క్షోభకు గురవుతున్నారు. విజన్‌ 2047 సర్వే, 100 రోజుల హౌస్‌ హోల్డ్‌ సర్వే, జియో ట్యాగింగ్‌, ఓడీఎఫ్‌ సర్వే కింద బాత్‌రూమ్‌ ఫొటోలు తీయడం వంటి పనులతో సిబ్బంది సతమతమవుతున్నారు. నెల మొదట్లో తెల్లవారుజామున 5 గంటల నుంచే పెన్షన్ల పంపిణీ, రోజూ పారిశుధ్య పర్యవేక్షణతో ప్రారంభమయ్యే వీరి విధులు, రాత్రి పొద్దుపోయే వరకు పన్నుల వసూళ్ల సమీక్షలతో ముగుస్తున్నాయి. ‘ప్రాపర్టీ ట్యాక్స్‌ వసూలు చేయకపోతే మెమోలు ఇస్తున్నారు. పరుష పదజాలంతో దూషిస్తున్నారు. జాబ్‌ చార్ట్‌లో లేని పనులను కూడా మాపై రుద్దుతున్నారు’ అని పలువురు కార్యదర్శులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా వెల్ఫేర్‌, ఎడ్యుకేషన్‌ అసిస్టెంట్లకు కూడా బ్యాంకు ఖాతాల అనుసంధానం, స్కూల్‌ బాత్‌రూమ్‌ ఫొటోల అప్‌లోడింగ్‌ వంటి టార్గెట్లు ఇవ్వడంపై ఆగ్రహం వ్యక్తమవుతోంది. పని ఒత్తిడితో ఆరోగ్యం దెబ్బతింటోందని, మానసిక వేదన అనుభవిస్తున్నామని సిబ్బంది వాపోతున్నారు.

పన్నుల వసూళ్లలో సచివాలయ

ఉద్యోగులపై తీవ్ర ఒత్తిడి

స్థానిక సంస్థల ఖజానా

నింపుకోవడానికి సిబ్బందిపై భారం

టార్గెట్‌ చేరుకోకపోతే

వేటు తప్పదని హెచ్చరికలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement