ఐటీ అభివృద్ధికి 60 రోజుల్లో మాస్టర్‌ ప్లాన్‌ | - | Sakshi
Sakshi News home page

ఐటీ అభివృద్ధికి 60 రోజుల్లో మాస్టర్‌ ప్లాన్‌

Mar 13 2026 7:31 AM | Updated on Mar 13 2026 7:31 AM

ఐటీ కార్యదర్శి కాటమనేని భాస్కర్‌

మహారాణిపేట: విశాఖపట్నం ఎకనామిక్‌ రీజియన్‌(వీఈఆర్‌) పరిధిలో ఐటీ పార్కుల అభివృద్ధి, మౌలిక వసతుల కల్పన కోసం ప్రత్యేక మాస్టర్‌ ప్లాన్‌ రూపొందించాలని రాష్ట్ర ఐటీ కార్యదర్శి కాటమనేని భాస్కర్‌ ఆదేశించారు. గురువారం కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో వివిధ శాఖల అధికారులు, నిప్పన్‌ కోయి కన్సల్టెంట్స్‌ ఏజెన్సీ ప్రతినిధులతో ఆయన సమావేశమై ఐటీ రంగ అభివృద్ధిపై సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఐటీ పార్కులు, డేటా సెంటర్లు, గ్లోబల్‌ కేపబిలిటీ సెంటర్ల ఏర్పాటులో భాగంగా అంతర్జాతీయ ఐటీ కంపెనీలను ఆకర్షించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రస్తుతం ఉన్న ఐటీ క్లస్టర్లను విస్తరించడంతో పాటు, కొత్తగా అభివృద్ధి చేసే అవకాశాలను పరిశీలించాలన్నారు. పెట్టుబడులను ఆకర్షించడానికి అవసరమైన రోడ్డు కనెక్టివిటీ, కమర్షియల్‌ స్పేస్‌, ఎంటర్‌టైన్‌మెంట్‌, సోషల్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ వంటి సౌకర్యాలను మెరుగుపరచాలని చెప్పారు. వీఎంఆర్డీఏ, జీవీఎంసీ, నిప్పన్‌ కోయి ఏజెన్సీ ప్రతినిధులు సంయుక్తంగా క్షేత్రస్థాయిలో పనిచేసి ప్రాక్టికల్‌ రిపోర్ట్‌ సిద్ధం చేయాలని ఆదేశించారు. ఈ ప్రాజెక్టుల ద్వారా ఈ ప్రాంతంలో భారీగా ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని ఆయన పేర్కొన్నారు. అన్ని విభాగాలు సమన్వయంతో పని చేసి 60 రోజుల్లో ఐటీ అభివృద్ధికి సంబంధించిన పూర్తిస్థాయి మాస్టర్‌ప్లాన్‌ సిద్ధం చేయాలని స్పష్టం చేశారు. సమావేశంలో జేసీ గొబ్బిళ్ల విద్యాధరి, వీఎంఆర్డీఏ కమిషనర్‌ తేజ్‌ భరత్‌, భీమిలి ఆర్డీవో సంగీత్‌ మాధుర్‌, ఏపీఐఐసీ జోనల్‌ మేనేజర్‌ సింహాచలం, పరిశ్రమల కేంద్రం జనరల్‌ మేనేజర్‌ ఆదిశేషు, జీవీఎంసీ ఏడీసీ వర్మ తదితరులు పాల్గొన్నారు. వీఈఆర్‌ పరిధిలోని ఇతర జిల్లాల జాయింట్‌ కలెక్టర్లు వర్చువల్‌ విధానంలో హాజరయ్యారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement