మహారాణిపేట: విశాఖపట్నం పోర్ట్ అథారిటీ (వీపీఏ) ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం గురువారం సాగర్‌మాల కన్వెన్షన్ హాల్‌లో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి రాష్ట్ర గిరిజన సహకార సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ఎస్.ఎస్.శోభిక ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. పోర్ట్ చైర్మన్ ఎం.అంగముత్తు మాట్లాడుతూ మహిళా విభాగం చేస్తున్న కార్యక్రమాలను ప్రశంసించారు. సంస్థ అభివృద్ధిలో మహిళా ఉద్యోగులు కీలక పాత్ర పోషిస్తున్నారని, సంస్థకు మరిన్ని విజయాలు అందించాలని కోరారు. డిప్యూటీ చైర్‌పర్సన్ కె.రోష్ని అపరంజి మాట్లాడుతూ మహిళలకు ఆర్థిక స్వావలంబన ఎంతో అవసరమని పేర్కొన్నారు. మహిళలు కేవలం సంపాదించడమే కాకుండా, తమ ఆదాయాన్ని పొదుపు చేస్తూ సరైన పద్ధతుల్లో పెట్టుబడి పెట్టే అలవాటు పెంపొందించుకోవాలని సూచించారు.
ఈ సందర్భంగా పోర్ట్ మహిళా విభాగం ఆధ్వర్యంలో నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అలరించాయి. వీపీఏ చీఫ్ మెడికల్ ఆఫీసర్, మహిళా విభాగం కన్వీనర్ డాక్టర్ ఉషా దేవి నేతృత్వంలో వివిధ శాఖల అధికారులు, మహిళా ఉద్యోగులు పాల్గొన్నారు. కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించిన పోర్ట్ కార్యదర్శి ఎం.శంకర్ బాబు బృందాన్ని డిప్యూటీ చైర్‌పర్సన్ అభినందించారు. పోర్ట్ చీఫ్ విజిలెన్స్ ఆఫీసర్ టి.అరుణ్ ప్రసాద్, కలెక్టర్ సతీమణి, ప్రముఖ న్యాయవాది దివ్య హరేందిరప్రసాద్, విద్యావేత్త లక్ష్మీ ప్రసాద్ తదితరులు హాజరయ్యారు.


