పెందుర్తి: జీవీఎంసీ పెందుర్తి జోన్ పరిధిలో నిబంధనలకు విరుద్ధంగా భవన నిర్మాణాలకు అనుమతులు ఇచ్చినట్లు వచ్చిన ఫిర్యాదులపై అవినీతి నిరోధక శాఖ అధికారులు మంగళవారం విస్తృత తనిఖీలు చేపట్టారు. వేపగుంటలోని పెందుర్తి జోన్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించారు. ఏసీబీ డీఎస్పీ రమణమూర్తి ఆధ్వర్యంలో దాదాపు 20 మంది సభ్యులతో కూడిన బృందం కార్యాలయంలోని టౌన్‌ప్లానింగ్ విభాగాన్ని పూర్తిగా తనిఖీ చేసింది. ఆన్‌లైన్‌లో వచ్చిన దరఖాస్తులను పరిశీలించిన అధికారులు నిబంధనలకు విరుద్ధంగా ఉన్నట్లు అనుమానం ఉన్న పలు భవనాల వద్దకు నేరుగా వెళ్లి పరిస్థితులను పరిశీలించారు. జీవీఎంసీ ప్లానింగ్ అధికారులను వెంటబెట్టుకుని భవన యజమానులను కూడా ప్రశ్నించారు. అధికారిక, అనధికారిక లావాదేవీలపై విచారణ జరిపారు. అనంతరం కార్యాలయంలోని ఫైళ్లు, పత్రాలను రాత్రి వరకు పరిశీలించారు. బుధవారం కూడా సోదాలు కొనసాగనున్నట్లు సమాచారం. ఈ తనిఖీలతో ప్లానింగ్ యంత్రాంగంలో కలకలం రేగింది.


