వందేళ్ల వైభవం.. ఉరిమిన ఉత్సాహం | - | Sakshi
Sakshi News home page

వందేళ్ల వైభవం.. ఉరిమిన ఉత్సాహం

Mar 11 2026 9:00 AM | Updated on Mar 11 2026 9:00 AM

మద్దిలపాలెం: ఆంధ్ర విశ్వవిద్యాలయం శతాబ్ది ఉత్సవాల వేళ.. విద్యార్థులు తమ కళా ప్రతిభతో మెరిశారు. తరగతి గదుల్లో పుస్తకాలతో కుస్తీ పట్టే విద్యార్థులు, వేదికపై అద్భుత ప్రతిభతో అదరగొట్టేశారు. విశ్వకళా పరిషత్‌ అన్న పేరును సార్థకం చేస్తూ బీచ్‌రోడ్డులోని ఏయూ కన్వెన్షన్‌ సెంటర్‌లో మంగళవారం నిర్వహించిన సాంస్కృతిక సంబరాలు అంబరాన్నంటాయి. ఏయూ యునైటెడ్‌ క్లబ్‌ ఆధ్వర్యంలో శాసీ్త్రయ నృత్యాల నుంచి వెస్ట్రన్‌ డ్యాన్స్‌ల వరకు, పౌరాణిక ఘట్టాల నుంచి మైమ్‌ ప్రదర్శనల వరకు.. విద్యార్థులు తమ అద్భుతమైన నృత్యాభినయాలతో అందరినీ మంత్రముగ్ధులను చేశారు.

అదరగొట్టిన విద్యార్థులు

కన్వెన్షన్‌ సెంటర్‌ ప్రాంగణమంతా పండగ వాతావరణం నెలకొంది. రామాయణ ఇతిహాసాన్ని విద్యార్థులు వేదికపై కళ్లకు కట్టినట్లు ఆవిష్కరించారు. శ్రీరామ జననం, సీతా కల్యాణం, వనవాసం, సీతాపహరణం, రావణ సంహారం, సీతాదేవి అగ్నిప్రవేశం.. ఇలా ప్రతి ఘట్టాన్ని సజీవంగా ప్రదర్శించి కరతాళ ధ్వనులు అందుకున్నారు. ఆ తర్వాత ప్రదర్శించిన నృసింహస్వామి అవతార ఘట్టం సైతం అందరినీ భక్తిభావంతో ముంచెత్తింది. యామిని ప్రియాంక శాసీ్త్రయ నృత్యంతో మొదలైన ఈ వేడుకల్లో.. శ్రీనిధి బృందం సెమీ క్లాసికల్‌ డ్యాన్స్‌, బీబీఏ విద్యార్థుల వెస్ట్రన్‌ డాన్స్‌ కుర్రకారుతో కేరింతలు కొట్టించాయి. జోకర్‌ మైమ్‌, పేరడీ పాటలు, వాయిస్‌ ఇమిటేషన్లు దేనికదే ప్రత్యేకంగా నిలిచాయి. ఈ సందర్భంగా ఏయూ వీసీ ఆచార్య జి.పి.రాజశేఖర్‌ మాట్లాడుతూ విద్యార్థుల అద్భుత ప్రదర్శనలు మనసును హత్తుకున్నాయన్నారు. ‘ఈ ప్రదర్శనల వెనుక విద్యార్థుల కష్టం, సాధన, సమన్వయం స్పష్టంగా కనిపిస్తున్నాయి. త్వరలో జరగనున్న ఏయూ శతాబ్ది ఉత్సవాలకు ఇది చోదకశక్తిలా నిలుస్తుంది’అని ఆయన ప్రశంసించారు. అనంతరం ఈ నెల 17న కన్వెన్షన్‌ సెంటర్‌లో నిర్వహించనున్న ఏయూ కళా ఉత్సవాల పోస్టర్‌ను వీసీ ఆవిష్కరించారు. కార్యక్రమంలో రెక్టార్‌ ఆచార్య పి.కింగ్‌, రిజిస్ట్రార్‌ ఆచార్య కె.రాంబాబు, ప్రిన్సిపాళ్లు ఆచార్య జాలాది రవి, ఎం.వి.ఆర్‌.రాజు, కె.సీతామాణిక్యం, ఎం.శశి, మహిళా ఇంజనీరింగ్‌ కళాశాల ప్రిన్సిపాల్‌ ఆచార్య పద్మశ్రీ తదితరులు పాల్గొన్నారు.

ఏయూలో ఆకట్టుకున్న కళా సంబరాలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement