పది పరీక్షలకు సన్నద్ధం | - | Sakshi
Sakshi News home page

పది పరీక్షలకు సన్నద్ధం

Mar 11 2026 9:00 AM | Updated on Mar 11 2026 9:00 AM

ఈ నెల 16 నుంచి పరీక్షలు

ఆరిలోవ: జిల్లాలో పదో తరగతి పబ్లిక్‌ పరీక్షల నిర్వహణకు విద్యాశాఖ అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తోంది. 2025–26 విద్యా సంవత్సరానికి సంబంధించి ఈ నెల 16 నుంచి ఏప్రిల్‌ 1 వరకు పరీక్షలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో విద్యార్థులను పరీక్షలకు సన్నద్ధం చేసేందుకు ఉపాధ్యాయులు, అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. పరీక్షల నిర్వహణ కోసం జిల్లావ్యాప్తంగా ఇప్పటికే 133 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. వీటి పర్యవేక్షణ కోసం 133 మంది చీఫ్‌ సూపరింటెండెంట్లు (సీఎస్‌), మరో 133 మంది డిపార్ట్‌మెంటల్‌ ఆఫీసర్లను(డీవో) విద్యాశాఖ నియమించింది. పరీక్ష పత్రాలను (సెట్‌ 1, 2) సంబంధిత కేంద్రాలకు సమీపంలోని పోలీస్‌ స్టేషన్లలో పటిష్ట భద్రత నడుమ భద్రపరిచారు.

ప్రత్యేక శిక్షణ.. రాత్రి వేళ్లలో పర్యవేక్షణ

విద్యార్థుల్లో నైపుణ్యాన్ని పెంచేందుకు గతంలో మాదిరిగానే 100 రోజుల ప్రణాళికతో పాటు 30 రోజుల ప్రత్యేక ప్రణాళికను అమలు చేస్తున్నారు. విద్యార్థులను వారి సామర్థ్యాన్ని బట్టి గ్రేడులుగా విభజించి, వెనుకబడిన విద్యార్థులను హాస్టళ్లలో వసతి కల్పించి ప్రత్యేక శిక్షణ ఇస్తున్నారు. రాత్రి వేళల్లో డీఈవో, ఎంఈవోలు, ప్రధానోపాధ్యాయులు ఆయా ప్రాంతాల్లోని విద్యార్థుల ఇళ్లకు వెళ్లి వారు చదువుకుంటున్న తీరును స్వయంగా పరిశీలిస్తున్నారు.

స్టడీ మెటీరియల్‌ పంపిణీ : విద్యార్థులకు భరోసా ఇచ్చేందుకు పలు స్వచ్ఛంద సంస్థలు, ఉపాధ్యాయులు రూపొందించిన స్టడీ మెటీరియల్స్‌ను అందజేశాయి. ‘సాక్షి’ యాజమాన్యం ప్రతి ఏటా మాదిరిగానే అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులతో రూపొందించిన మెటీరియల్‌ను జిల్లాలోని విద్యార్థులకు పంపిణీ చేసింది. ఉపాధ్యాయులు స్వయంగా తయారు చేసిన నోట్స్‌ విద్యార్థులకు ఎంతగానో ఉపయోగపడుతోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement