అగనంపూడి : అగనంపూడి జోనల్ కార్యాలయంలో రెవెన్యూ విభాగం అవినీతి అక్రమాలకు అడ్డాగా మారుతోంది. ‘ఫైలు కదలాలన్నా.. పన్ను పడాలన్నా.. నా చేయి తడవాల్సిందే‘ అంటూ ఓ రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ సాగిస్తున్న వసూళ్ల దందాపై వార్డు సచివాలయ అడ్మిన్లు ఒక్కసారిగా తిరుగుబాటు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ పట్టణ ప్రణాళిక విభాగాలపై ఏసీబీ దాడులు జరుగుతున్న నేపథ్యంలో, అగనంపూడి జోన్‌లో సాగుతున్న ఈ ‘పర్సంటేజీల’ వ్యవహారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
ఒక్కో ఫైలుకు ఒక్కో రేటు!
అగనంపూడి జోనల్ కార్యాలయ పరిధిలోని 4 వార్డులు, 16 వార్డు సచివాలయాల్లో కొత్త ఇళ్లకు పన్ను నిర్ణయించడం, ఆస్తి పన్ను సవరణలు, వీఎల్‌టీ విధింపు వంటి ప్రతి పనికి ఒక రేటు నిర్ణయించి వసూలు చేయాలని సదరు అధికారి సచివాలయ సిబ్బందిపై ఒత్తిడి తెస్తున్నట్లు సమాచారం. ‘గతంలో నేను పనిచేసిన చోట ఇదే ఆనవాయితీ.. ఇక్కడ కూడా అది కొనసాగాల్సిందే‘ అంటూ ఆయన మొండికేయడం విశేషం.
తిరగబడ్డ సచివాలయ సిబ్బంది : ఈ ప్రాంతం ఎక్కువగా గ్రామీణ వాతావరణం కలిగి ఉంటుందని, ఇక్కడి ప్రజలు అడిగినంత ఇచ్చుకోలేరని సచివాలయ అడ్మిన్లు నచ్చజెప్పే ప్రయత్నం చేసినా సదరు అధికారి వినకపోవడంతో వివాదం ముదిరింది. అవినీతి ఊబిలో తాము కూరుకుపోలేమని, ప్రజల నుంచి వసూళ్లు చేసి పెట్టడం తమ వల్ల కాదని 16 సచివాలయాల సిబ్బంది మూకుమ్మడిగా తెగేసి చెప్పారు. ఇలాంటి పరిస్థితుల్లో తాము ఉద్యోగాలు చేయలేమంటూ వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఏసీబీ దాడుల వేళ గుబులు : మంగళవారం రాష్ట్రవ్యాప్తంగా ఏసీబీ అధికారులు పట్టణ విభాగాలపై మెరుపు దాడులు చేయడంతో అగనంపూడి జోనల్ కార్యాలయంలోని అక్రమాల పుట్ట కదిలింది. తాము బలిపశువులం కాకూడదనే ఉద్దేశంతో సచివాలయ సిబ్బంది ఈ వసూళ్ల భాగోతాన్ని బయటపెట్టారు. ప్రశాంతంగా ఉండే అగనంపూడి జోన్‌కు మొదటిసారిగా ఇలాంటి అవినీతి మరక అంటుకోవడంపై స్థానికంగా పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.


