మహారాణిపేట: రాష్ట్రస్థాయి వైద్య కళాశాలల అథ్లెటిక్స్ పోటీల్లో ఆంధ్ర మెడికల్ కాలేజీ(ఏఎంసీ) ప్రభంజనం సృష్టించింది. క్రీడా మైదానంలో తమ సత్తా చాటుతూ వరుసగా 16వ సారి ఓవరాల్ చాంపియన్‌షిప్‌ను కై వసం చేసుకుని రికార్డు నెలకొల్పింది. డాక్టర్ ఎన్టీఆర్ ఆరోగ్య విజ్ఞాన విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో కాకినాడలోని రంగరాయ మెడికల్ కాలేజీలో ఏపీ రాష్ట్రస్థాయి మెడికల్, డెంటల్ కాలేజీల అథ్లెటిక్స్ మీట్ 2025–26’ ఘనంగా జరిగింది. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 40 జట్లు పాల్గొన్న ఈ టోర్నమెంట్‌లో ఏఎంసీ విద్యార్థులు అద్భుత ప్రతిభ కనబరిచి అగ్రస్థానంలో నిలిచారు. పురుషుల జట్టు 66 పాయింట్లు సాధించి మెన్ ఓవరాల్ చాంపియన్‌షిప్‌ను సొంతం చేసుకుంది. మహిళల జట్టు 48 పాయింట్లు సాధించి వుమెన్ ఓవరాల్ చాంపియన్‌షిప్‌ను కై వసం చేసుకుంది. మొత్తం 114 పాయింట్లతో పురుషుల, మహిళల విభాగాల్లో ఉమ్మడిగా ఆంధ్ర మెడికల్ కాలేజీ విజేతగా నిలిచింది. ఈ సందర్భంగా ఏఎంసీ ప్రిన్సిపాల్ డాక్టర్ సంధ్యాదేవి మాట్లాడుతూ వరుసగా 16వ సారి ఓవరాల్ చాంపియన్‌షిప్‌ను గెలుచుకోవడం ఒక గొప్ప రికార్డు అని హర్షం వ్యక్తం చేశారు. పురుషుల జట్టు కెప్టెన్ జి. నేతాజీ, మహిళల జట్టు కెప్టెన్ వై. తోషిత, ఇతర జట్టు సభ్యుల కృషితోనే ఈ అద్భుత విజయం సాధ్యమైందని కొనియాడారు. ఈ సందర్భంగా విద్యార్థులను కళాశాల ప్రిన్సిపాల్‌తో పాటు, లేడీస్ హాస్టల్ డిప్యూటీ వార్డెన్ డాక్టర్ సూర్యప్రభ, ఫిజికల్ డైరెక్టర్ డాక్టర్ ఎం.ఎస్.ఎన్. పాత్రుడు తదితరులు అభినందించారు.
వరుసగా 16వ సారి ఓవరాల్ చాంపియన్‌గా ఆంధ్ర మెడికల్ కాలేజీ


